
నేను గొప్పవాడిని, మేధావిని ఎవరైనా అనుకుంటే సరిపోదు… దానిని అందరూ గుర్తించి అంగీకరించినప్పుడే ఆ వ్యక్తి గొప్పదనం ఏమిటో తెలుస్తుంది.
జగన్, కేసీఆర్ ఇద్దరూ మేము గొప్ప మేధావులం అనుకునేవారు… అలా అందరినీ నమ్మించే ప్రయత్నం చేసేవారు కూడా.
అన్నీ నాకు మాత్రమే తెలుసు అనుకునే కేసీఆర్ కుర్చీ వేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టించానని చెప్పుకున్నారు. ఆయన అధికారంలో ఉండగానే మేడిగడ్డ బ్యారేజి క్రుంగిపోయింది. వరద నీటిలో లక్ష్మీ పంప్ హౌస్ మునిగిపోయింది.
తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభంలో నుంచి బయటపడేశానని కేసీఆర్ చెప్పుకున్నారు. కానీ కాలం చెల్లిన పాత టెక్నాలజీతో యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వలన రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదని రేవంత్ రెడ్డి చెపుతున్నారు. వాటి నిర్మాణంలో జరిగిన అవకతవకలపై కమీషన్ వేసి విచారణ కూడా జరిపిస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ భోగోళిక విస్తీర్ణం సగానికి సగం తగ్గిపోయింది. కానీ ఏపీకి ఒక రాజధాని సరిపోదు… మూడు రాజధానులు కావాల్సిందే అంటూ ఒక్కటి కూడా ఏర్పాటుచేయకుండా జగన్ 5 ఏళ్ళు కాలక్షేపం చేసి చేతులు దులుపుకు వెళ్ళిపోయారు!
జగన్, కేసీఆర్ ఇద్దరూ తాము మహా మేధావులమని గట్టిగా నమ్మి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వలననే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలకు ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పక తప్పదు.
చంద్రబాబు నాయుడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఐటి రంగానికి పునాది వేశారు. దాని వలననే అనేక లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వాటి వల్లే హైదరాబాద్ నగరం ఇంతగా అభివృద్ధి చెందింది… అని కేసీఆర్, జగన్ అంగీకరించకపోయినా అదే వాస్తవం.
చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం జైల్లో పెట్టినప్పుడు ఐటి ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపడమే ఆయనకు గొప్ప అవార్డు వంటిదని చెప్పొచ్చు. శాసనసభ ఎన్నికలప్పుడు దేశవిదేశాల నుంచి పలువురు ఐటి నిపుణులు ఏపీకి వచ్చి స్వచ్ఛందంగా టిడిపి కోసం పనిచేసి పోలింగ్ ముగియగానే వెళ్ళిపోయారు. అది కూడా చంద్రబాబు నాయుడు గొప్పదనానికి ప్రతీకగానే భావించవచ్చు.
నేడు తెలంగాణ శాసనసభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన విధానాలనే తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుసరించిందన్నారు. ఆ విధానాలను అనుసరించడం వలననే హైదరాబాద్ నగరం ఇంతగా అభివృధ్ది చెందిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
చంద్రబాబు నాయుడు గొప్పతనానికి ఇదే కదా గీటురాయి? కానీ ఆయన గొప్పదనం గ్రహించలేక లేదా గ్రహించినా ఓర్వలేక జగన్ అసూయతో ద్వేషిస్తుంటారు.
కానీ అంత మాత్రన్న చంద్రబాబు నాయుడు గొప్పదనం ఏమీ తగ్గిపోదు… జగన్ స్థాయి ఏమీ పెరిగిపోదు కదా?
చివరిగా ఒక మాట: ప్రజలు శ్రీరాముడిని గుర్తుంచుకున్నట్లే రావణుడిని గుర్తుంచుకుంటారు. పాండవులను గుర్తుంచుకున్నట్లే కౌరవులను కూడా గుర్తుంచుకుంటారు. కనుక చంద్రబాబు నాయుడు గుర్తుంచుకున్నట్లే జగన్ని కూడా తప్పకుండా గుర్తుంచుకుంటారు…. కాకపోతే మరోవిదంగా అంతే తేడా!
A film's release is no longer the only way for a new heroine to get…
Vijay Deverakonda is confident about his comeback with Ranabaali and has a strong message for…