
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో విజయవాడ వచ్చి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు కుమారుడి వివాహానికి హాజరయ్యి నూతన వధూవరులను నిహార్, సాయి నర్మదలను ఆశీర్వదించారు.
ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్ధన్ రెడ్డి తదితరులు హెలిప్యాడ్ వద్ద ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు.
కళ్యాణ మండపంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సిఎం రేవంత్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించగా ఇద్దరూ కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పటికీ, రెండు రాష్ట్రాలలో రాజకీయ నాయకుల మద్య సత్సంబంధాలే ఉన్నాయి. ఆ సత్సంబంధాలు ఇటువంటి శుభకార్యాలకు, పరామర్శలకు, వ్యాపారాలు, కాంట్రాక్టులకు మాత్రమే పరిమితమవుతున్నాయి తప్ప రెండు తెలుగు రాష్ట్రాల మద్య 11 ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కానీ, ఆస్తులు, నదీ జలాల పంపకానికి గానీ ఏమాత్రం ఉపయోగపడకపోవడం చాలా బాధాకరమే.
జగన్, కేసీఆర్ మద్య చాలా బలమైన బంధం ఉంది. నేటికీ జగన్‌ని కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కవిత తదితరులు పొగుడుతూనే ఉంటారు. అలాగే వైసీపీ నేతలు, బిఆర్ఎస్ పార్టీ నేతలతో సఖ్యతగా ఉంటారు.
ఇక్కడి వైసీపీ సొంత మీడియా బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వార్తలు వ్రాస్తుంటే, అక్కడి బిఆర్ఎస్ పార్టీ సొంత మీడియా ‘నమస్తే తెలంగాణ’ జగన్, వైసీపీకి అనుకూలంగా వార్తలు వ్రాస్తుంటుంది.
కానీ జగన్, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు విభజన సమస్యలని పరిష్కరించుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వాటిని బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాలలో ఆయుధాలుగా వాడుకుంటోంది కనుక!
ఇప్పుడు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు మద్య, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్య, మంత్రుల మద్య సఖ్యత ఉంది. కానీ విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తే, వెంటనే అక్కడ బిఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించడం మొదలుపెట్టేస్తారు. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కు అయిపోయి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని, తెలంగాణ వనరులను ఆంధ్రాకు తాకట్టు పెట్టేస్తున్నారని గగ్గోలు పెట్టేస్తారు.
బిఆర్ఎస్ పార్టీ చేసే ఈ దుష్ప్రచారం వలన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం కలుగుతుంది. కనుక విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరువురు ముఖ్యమంత్రులకు కోరిక ఉన్నప్పటికీ వెనకడుగు వేయాల్సివస్తోంది.
కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకుల స్నేహం ఇటువంటి శుభకార్యాలకు, పరామర్శలకు మాత్రమే పరిమితం.
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…
Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…