
Telangana Congress YSR Politics, Revanth Reddy, YS Rajasekhar Reddy, Telangana Congress Leaders
ఒకప్పుడు అంటే ఏపీ రాజకీయాలలో జగన్ నిలద్రొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నామజపం చేస్తుండేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పేరుతో పధకాలు, కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, క్రమంగా తనని తాను ప్రమోట్ చేసుకున్నారు. జగన్ బొమ్మలు, ఫ్లెక్సీ బ్యానర్లు ఇందుకు ఉదాహరణలు. తద్వారా ఇప్పుడు తండ్రి పేరుతో రాజకీయాలు చేయాల్సిన అవసరం తప్పించారు.
ఇప్పుడు ఆంధ్రాలో వైసీపీ అంటే జగన్. ప్రతిపక్షమంటే జగన్. ఏకైక ప్రతిపక్ష నాయకుడుగా జగన్ అనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కనుక వైఎస్ జయంతులు, వర్దంతులలో తప్ప తండ్రిని తలుచుకోవాల్సిన అవసరం తగ్గిందనే చెప్పాలి.
రాజకీయాలలో ఉన్నవారు, రాణించాలనుకున్నవారు తమకంటూ సొంత గుర్తింపు సంపాదించుకోవడం అవసరం. కనుక జగన్ ఈ ప్రయత్నంలో విజయం సాధించారని చెప్పవచ్చు.
అయన సొంత కొడుకు జగన్మోహన్ రెడ్డే క్రమంగా తండ్రి నీడ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ నేతలు మళ్ళీ వైఎస్సార్ భజన మొదలుపెట్టడం విచిత్రంగా అనిపిస్తుంది.
నిన్న వైఎస్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీలో పోలవరం, తెలంగాణలో ప్రాణహిత చేవెళ్ళ, కల్వకుర్తి, ఎస్ఎల్‌బీసి వంటి వాటికి బీజం వేశారని ప్రశంశించారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలనే అయన చివరి కోరికని మనం అందరం కలిసి నేరవేరుద్దామన్నారు.
ఇలాంటి సందర్భాలలో ఎవరైనా ఇలాగే మాట్లాడుతారు కనుక రేవంత్ మాటలను తప్పు పట్టలేము.
మంత్రి పదవి దక్కనందుకు మండి పడుతున్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ, “అసలు సిసలైన కాంగ్రెస్ నేత వైఎస్. మనమందరం వైఎస్ బాటలోనే నడుద్దాం,” అంటూ వైఎస్ భజన చేశారు.
రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడుని ముడిపెట్టి బీఆర్ఎస్ పార్టీ నీళ్ళ రాజకీయాలు చేస్తున్నప్పుడు, ఆంధ్రా పాలకులు తెలంగాణపై కన్నేశారని వాదిస్తున్నప్పుడు, కాంగ్రెస్ నేతలు ఈవిధంగా వైఎస్ భజన చేయడం రాజకీయంగా ఆత్మహత్యతో సమానమే అవుతుంది.
వైఎస్ షర్మిల కూడా ‘రాజన్న రాజ్యం స్థాపిస్తా’ అంటూ తెలంగాణలో కాళ్ళు ఆరిపోయేలా పాదయాత్ర చేసినా ప్రజలు, ఇప్పుడు అయన భజన చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా ఆమెను పట్టించుకోలేదు. ఎందువల్లనంటే, తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నందునే.
కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే తండ్రి నీడ నుంచి బయటపడితే, తెలంగాణ కాంగ్రెస్ నేతలు మళ్ళీ వైఎస్ భజన మొదలుపెట్టడం ఆశ్చర్యంగా ఉంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో లుకలుకలు, రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేయడం, కొండా సురేఖని మంత్రి పదవిలో నుంచి తొలగించడం వంటి పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చిందని తెలియజేస్తున్నట్లు ఉన్నాయి.
తెలంగాణ ప్రజలను కేసీఆర్ ప్రభావం నుంచి బయటకు తీసుకు రావాలని ఇంతకాలం ప్రయత్నించిన రేవంత్ రెడ్డి, మళ్ళీ అయన ప్రభావంలోకి వెళ్ళిపోయేలా చేస్తున్నారనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో వైఎస్ భజన చేయడం అంటే కాంగ్రెస్ పిలక కేసీఆర్‌కి అప్పగించడమే అవుతుంది.
The Telugu film industry may need to rethink the way it approaches ticket hikes. The…
Prabhu Deva and AR Rahman are teaming up again, and their new film Moonwalk has…