
రాజకీయాలలో అధః పాతాళానికి పడిపోయిన ఓ వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగగలడా?అదీ.. పార్టీలో సీనియర్లు అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పుడు?ఎదగవచ్చని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నిరూపించి చూపారు.
టీడీపీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే పార్టీలో సీనియర్లు ఆయనని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి చేపడుతున్నప్పుడు, ముఖ్యమంత్రి పదవి చేపడుతున్నప్పుడు అందరూ ఆయనని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఎవరూ రేవంత్ రెడ్డిని నిలువరించలేకపోయారు.
తనను వ్యతిరేకిస్తున్న ఆ సీనియర్లనే వెంటబెట్టుకొని తెలంగాణలో అత్యంత శక్తివంతమైన బిఆర్ఎస్ పార్టీని, దేశ రాజకీయాలను శాసించాలనుకొంటున్న కేసీఆర్‌ని ఎన్నికలలో ఓడగొట్టడం సాధారణమైన విషయం కాదు.
తనను వ్యతిరేకిస్తున్న ఆ సీనియర్లందరినీ కట్టడి చేసి వారి చేతనే ‘గౌరవనీయ ముఖ్యమంత్రిగారు’ అనిపించుకోవడం కూడా మామూలు విషయం కాదు. కనుక సిఎం రేవంత్ రెడ్డి రాజకీయాలకు తిరుగులేదని చెప్పొచ్చు.
రాజకీయాలలో ఇంతగా రాణించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎదురు దెబ్బలు తింటుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆయన తీసుకునే వివాదాస్పద నిర్ణయాలే ఇందుకు కారణమవుతున్నాయి. ఇందుకు ఉదాహరణలుగా హైడ్రా ఏర్పాటు చేసి ఇళ్ళు కూల్చివేయిస్తుండటం, కొడంగల్ సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం భూసేకరణకు పూనుకోవడం, అల్లు అర్జున్ అర్జున్-సినీ పరిశ్రమ విషయంలో చాలా కటువుగా వ్యవహరించడం, తాజాగా గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల వేలం వంటివి కనిపిస్తున్నాయి.
ఈ నిర్ణయాల పట్ల సామాన్య ప్రజలు, రైతులు, విద్యార్ధులు, సినీ పరిశ్రమలోవారు, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
గచ్చిబౌలిలో 400 ఎకరాలలో విస్తరించి ఉన్న పచ్చటి చెట్లను నరికించేసి, ఆ భూములను వేలంవేసి ఆదాయం సమకూర్చుకోవాలనే సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో, బయట నిరసనలు తెలియజేస్తోంది. హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్ధులు కూడా ఆందోళనలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రేణూ దేశాయ్ వంటి ప్రముఖులు రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల అభ్యంతరం తెలిపారు. తెలంగాణ బీజేపి నేతలు మరో అడుగు ముందుకు వేసి ఢిల్లీ వెళ్ళి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చి దీనిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతిపక్షాలు, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి విద్యార్ధులను రెచ్చగొడుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ మంత్రులు వాదిస్తున్నారు.
అధికార, ప్రతిపక్షాల ఈ రాజకీయాలను పక్కన పెట్టి ఇవన్నీ చూస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ వివాదం నుంచి మరో వివాదం వైపు ప్రయాణిస్తున్నట్లు అర్దమవుతుంది.
రాజకీయాలలో ఇంతగా రాణించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎందుకు చిక్కుల్లో పడుతున్నారు?అని అనిపించక మానదు. ఇందుకు అనేక అనివార్య సమస్యలు, ఒత్తిళ్ళు కారణాలుగా కనిపిస్తున్నాయి. కానీ వాటిని చూపి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి ఆలోచనలు చేస్తుంటే ఇంకా అనేక కొత్త సమస్యలు సృష్టించుకున్నట్లవుతుంది.. ఆ సమస్యల ఊబిలో నుంచి బయటపడటం ఇంకా కష్టం కావచ్చు. కనుక సిఎం రేవంత్ రెడ్డికి ఇది పరీక్షా సమయమే అని భావించవచ్చు.
The elections to the Telugu Film and TV Dancers and Dance Directors Association will not…
Andhra Pradesh chief minister Chandrababu Naidu is currently serving his fourth term in the office…