
Rural Voters Lead by Example in Elections
ఈ నెల 1న (ఆదివారం) జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 60.96 శాతం పోలింగ్ నమోదైంది. నగర, పట్టణ ఓటర్లు కొంతమేర పెద్ద సంఖ్యలో తరలిరావడం వల్లే ఈ మాత్రం పోలింగ్ నమోదైంది. ఒకవేళ విద్యాధికులు, ఐటీ ఉద్యోగులు, ఉన్నత ఆదాయ వర్గాల వారు కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపించి ఉంటే పోలింగ్ శాతం మరింత పెరిగి ఉండేది.
కానీ కొందరికి ఓటు వేయడం నామోషీ. మరికొందరికి అదొక వేస్ట్ పని. ఇంకొందరికి టైమ్ వేస్ట్. ఓటు వేయడానికి వెళ్లే బదులు ఇంట్లోనే ఉంటూ వర్క్ చేసుకోవచ్చు.. ఓటీటీలో సినిమాలు చూడొచ్చు.. కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లి సరదాగా గడపొచ్చు. ఇలా ఓటు వేయని వారిలో చాలామంది నిత్యం ప్రభుత్వాన్ని, దాని పనితీరును విమర్శిస్తూనే ఉంటారు. ఇందుకోసం సోషల్ మీడియాలో తమ సృజనాత్మకతనంతా ప్రదర్శిస్తుంటారు కూడా.
కానీ నిన్న జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూనే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకున్నారు. విద్యాధికులైన నగర, పట్టణ ఓటర్లకు కూడా ఆదర్శంగా నిలిచారు.
మురుసు తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి అనేక గ్రామాలు నీట మునిగాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అయినప్పటికీ గ్రామీణ ఓటర్లు తమకు ఎదురైన కష్టాలను, జరిగిన నష్టాన్ని తలుచుకుంటూ ఇళ్లలోనే ఉండిపోలేదు.
వరద, ముంపు ప్రాంతాల ప్రజలు సైతం అతికష్టం మీద సమీప పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫలితంగా నిన్న సాయంత్రం 5 గంటల సమయానికి 67.24 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి ఈ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.
నగర, పట్టణ ఓటర్లు ఎదుర్కొనే సమస్యలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో రెట్లు ఎక్కువ. అయినప్పటికీ వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో మాత్రం వెనుకడుగు వేయరు.
గ్రామీణ ఓటర్లలో నిరక్షరాస్యులు సైతం ఓటు వేయడాన్ని తమ బాధ్యతగా, గౌరవంగా భావిస్తారు. కానీ నగర ఓటర్లలో కొందరు మాత్రం ఓటు వేయడాన్ని నామోషీగా భావిస్తుండటం గమనార్హం.
అంతేకాదు.. అందుకు వింత వాదనలు కూడా వినిపిస్తుంటాయి. మనం ఓటు వేసినా, వేయకపోయినా దేశం, రాష్ట్రం మారిపోతాయా? మారనప్పుడు ఓటు వేయడం ఎందుకు? అంటూ ప్రశ్నిస్తుంటారు. కానీ గ్రామీణ ఓటర్లు ఇలాంటి వాదనలకు, భేషజాలకు పోకుండా తమ ఓటుతో పాలకులను ఎన్నుకుంటారు. తమ ఓటుకున్న శక్తిని వారు గుర్తించారు. మరి నగర, పట్టణ ఓటర్లు మాత్రం ఆ విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
Nitesh Tiwari’s Ramayana is finally out now in theatres. Despite not hitting a big number…
All international travelers arriving to India now have to complete the Air Suvidha form. This…