
అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంలో 18 మంది ఉద్యోగులు మృతి చెందడం, మరికొందరు తీవ్రంగా గాయపడటం చాలా బాధాకరమే. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిశ్రమలని రప్పించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జరిగిన ఈ ఘటన ఆ ప్రయత్నాలపై ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.
పరిశ్రమలను రప్పించడం ఒక ఎత్తు అయితే వాటిలో ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా నివారించడం మరో ఎత్తు అని చెప్పక తప్పదు. ఏ పరిశ్రమలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మానవ తప్పిదాలు, సాంకేతిక లోపాల వలన ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయనేది ఎవరూ కాదనలేని సత్యం.
ఉదాహరణకు సినీ పరిశ్రమనే తీసుకుంటే, భారతీయుడు-2 సినిమా షూటింగ్‌లో క్రేన్ కూలి ముగ్గురు చనిపోయారు. ఇటీవల నేపాల్, బ్రెజిల్ దేశాలలో విమానాలు కూలిపోయి వాటిలో ప్రయాణిస్తున్నవారందరూ మరణించారు. బొగ్గు గనులలో జరిగే ప్రమాదాలలో ఎందరో ప్రాణాలు కొలోపోయారు. ఇలా ఏ రంగంలోనైనా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. పాపికొండలు బోట్ షికారులో అగ్నిప్రమాదం లేదా బోట్ నదిలో మునిగి చనిపోయారు.
పరిశ్రమల విషయానికి వస్తే ఈ ప్రమాద అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఒక్కో రకం పరిశ్రమలో ఒక్కో రకమైన ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందుకే వాటిని కార్మిక, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ, విద్యుత్ ఇంకా పలు శాఖలు పర్యవేక్షిస్తుంటాయి. చాలా వరకు పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు పాటిస్తూనే ఉంటాయి.
కానీ అందరికీ తెలిసిన విషయమే… భారత్‌లో అనేక చిన్నా, పెద్దా పరిశ్రమలు తూతూ మంత్రంగా ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించి భద్రతా ప్రమాణాలు, జాగ్రత్తలు అన్ని పాటిస్తున్నట్లు చెప్పుకుంటాయి.
ఉదాహరణకు షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటలు ఆర్పే వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. అలాగే అగ్నిమాపక సిలెండర్లు అందుబాటులో ఉంచాలి. నది లేదా సముద్రంలో బోట్ షికార్ చేయిస్తున్నప్పుడు వాటిలో ప్రయాణించేవారికి లైఫ్ జాకెట్స్ తప్పనిసరి.
కానీ ఈ ఏర్పాట్లకి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కనుక మొక్కుబడిగా ఏర్పాటు చేస్తుంటారు. వాటిని ఎప్పటికప్పుడు తనికీలు చేసి సరిచేయించాల్సిన సంబందిత అధికారులు లంచాలకు కక్కుర్తిపడి అంతా బాగానే ఉన్నట్లు సర్టిఫై చేస్తుంటారు.
కార్మికులు, ఉద్యోగులు కూడా పని ప్రదేశాలలో కొన్నిసార్లు ఎటువంటి రక్షణ పరికరాలు, వ్యవస్థలు లేకుండానే పనిచేస్తుంటారు లేదా రోజూ చేసే పనే కదా?అని అలసత్వంతో చేసి ప్రమాదంలో చిక్కుకుంటారు.
పరిశ్రమలని, వాటి నిర్వాహకులని, వాటిని పర్యవేక్షించే ప్రభుత్వాధికారులని, పనిచేసే కార్మికులు లేదా ఉద్యోగులని అందరినీ నిబందనల ప్రకారం పనిచేయించడం కూడా అసాధ్యమే. కనుక ఇటువంటి ప్రమాదానికి ఎవరినో ఒకరిని వేలెత్తి చూపించడం సబబు కాదు. కానీ భారత్‌లో వ్యవస్థలు ఇంతకంటే గొప్పగా పనిచేయడం లేదా చేయించడం కూడా చాలా కష్టమే. ఇది చాలా చేదు నిజం.
అలాగని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని చేతులు ముడుచుకుని కూర్చోవడం కూడా సరికాదు. కనుక వీలైనంత వరకు వ్యవస్థలను గాడిలో పెట్టుకొంటూ ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిందే.
చివరాఖరుగా చెప్పుకోవలసిన మాట మరొకటి ఉంది. ఇటువంటి ప్రమాదాలపై రాజకీయాలు చేయడం ఎవరికీ మంచిది కాదు.
Tamil actress Divya Bharathi, known for Bachelor and her special appearance in Maharaja, has sparked…
Amit Rai’s Ohh My Dog appears to be getting a fresh lease of life on…