
శశికళ జైలుకు వెళ్ళినా, ఆమె ఆశయాలను మాత్రం అనుచరులు విజయవంతంగా పూర్తి చేశారు. చిన్నమ్మ కోరుకున్నట్టే పళనిస్వామిని తమిళనాట ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఇందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు అమలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంతో ముందు చూపుతో డివిజన్ ప్రకారం ఓటింగ్ నిర్వహించి సీఎం పట్ల విశ్వాసాన్ని ప్రకటించారు. సమావేశానికి ముందే తమ పార్టీలోని ఎమ్మెల్యేలు చేజారకుండా ఒక్కో మంత్రికి నలుగురు ఎమ్మెల్యేల బాధ్యత అప్పగించారు.
సావధానంగా సభను ఏర్పాటు చేశారు. నిబంధనలకు అనుగుణంగా ముఖ్యమంత్రిని ఎన్నుకుందామని చెప్పారు. ఇక్కడ ప్రత్యర్థి వర్గం, ప్రతిపక్షం నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని ముందే ఊహించారు. దీంతో ప్రత్యర్థులు రహస్య ఓటింగ్ కు డిమాండ్ చేయగా, వారి డిమాండ్ తోసిపుచ్చుతూ డివిజన్ ప్రకారం ఓటింగ్ నిర్వహించారు. దీనిని విపక్షాలు అంగీకరించకపోవడంతో ముందు నోటికి పని చెప్పారు. నేరుగా దాడులకు దిగకుండా మార్షల్స్ ను ప్రయోగించారు. నిబంధనలు చూపుతూ వారిని సస్పెండ్ చేసి, మార్షల్స్ తో బయటకు నెట్టి వేయించారు.
అనంతరం ఇతరులు బలహీన పడడంతో వారంతట వారే ఒక్కొక్కరుగా సభను వీడేలా చేశారు. దీంతో పళనిస్వామి పట్ల విశ్వాస తీర్మానం నెగ్గడం సులువయ్యేలా చేశారు. అనంతరం చిన్నమ్మ ఆశయ సాధనకు ఉపక్రమించారు. పళనిస్వామి బల పరీక్షలో నెగ్గినట్టు ప్రకటించి, ముఖ్యమంత్రిగా ఆయనకు ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు డీఎంకే, పన్నీర్ వర్గాన్ని ఇరుకున పెట్టడమే చిన్నమ్మ వర్గం లక్ష్యం కానుంది. దీనిని చిన్నమ్మ వర్గం ఎంత సమర్థవంతంగా నెట్టుకొస్తుందో చూడాలి.
గత 14 రోజులుగా ఎన్నో మలుపులు, ఇంకెన్నో ట్విస్టులతో సాగిన తమిళనాడు రాజకీయాలకు ఎట్టకేలకు శుభంకార్డు పడినట్లయ్యింది. తన చిరకాల వాంఛ అయిన సీఎం కాలేకపోయినా, తమిళనాట అధికారాన్ని మాత్రం తన గుప్పిట్లో బంధించింది చిన్నమ్మ. ఇప్పుడు ఆమె ముందున్న లక్ష్యం ఒక్కటే, బెంగళూరు నుంచి తమిళనాడు జైలుకు ట్రాన్స్ ఫర్ చేయించుకుని, జైలు నుంచే రాష్ట్రాన్ని పాలించడం. ఏమైనా, ఇది అన్నాడీఎంకే విజయం అనే కంటే శశికళ విజయం అనడమే సముచితం!
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…