ఇతిహాసాలు పురాణాలను టెక్నాలజీని ఉపయోగించి చెప్పాలనుకోవడం మంచి ఆలోచనే. పుస్తకాలు చదవడం మర్చిపోతున్న ఇప్పటి తరం వినోదం కోసం ఎక్కువగా ఆధారపడే సినిమా ద్వారా అలాంటి ప్రయత్నాలు చేయడం అవసరమే. దర్శకులు గుణశేఖర్ కు అందుకే శాకుంతలం ఆలోచన వచ్చింది. ఈ కథ రామాయణం, మహాభారతం తెరకెక్కిన్నన్ని సార్లు రాలేదు. టీవీ సీరియల్ గానూ కొందరే ప్రయత్నించారు. సో ఇది తనకు అవకాశంగా మలుచుకోవాలనుకుని పెద్ద క్యాస్టింగ్ తో, విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సాహసానికి ఒడిగట్టారు. సమంతా లాంటి హీరోయిన్, స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత అండ ఇంతకంటే ఏం కావాలి.
ముందు కథ సంగతి చూస్తే విశ్వామిత్రుడి తపస్సుని భగ్నం చేయడం కోసం ఇంద్రుడు తన ఆస్థాన అప్సరస మేనకను భూలోకానికి పంపిస్తాడు. ఈ కార్యం వల్ల జన్మించిన బిడ్డే శకుంతల(సమంతా). అడవిలో కణ్వ మహర్షి(సచిన్ కెడ్కర్)దగ్గర పెరిగి పెళ్లీడుకు వస్తుంది. మహారాజు దుశ్యంతుడు యాగ రక్షణార్థం ఆశ్రమానికి వచ్చినప్పుడు శకుంతలను తొలిచూపులోనే ప్రేమించి ఎవరూ చూడని ప్రదేశంలో గాంధర్వ వివాహం చేసుకుంటాడు. మళ్ళీ వస్తానని మాట ఇచ్చి అతను వెళ్ళిపోయాక శకుంతల గర్భవతి అవుతుంది. దుర్వాసుడి(మోహన్ బాబు)శాపం వల్ల రాజ్యానికి వెళ్లిన ఆమెకు అవమానం ఎదురవుతుంది. ఆపై జరిగిదే అసలైన గాథ
సమంతా ఇమేజ్ ని మార్కెట్ చేసుకోవడం కోసం ఇది శకుంతల చుట్టూ తిరిగే కథగా ప్రచారం చేశారు కానీ నిజానికి సమాన ప్రాధాన్యత దుశ్యంతుడికీ ఉంటుంది. అయితే చాలా చిన్నదిగా ఎన్నో పరిమితులున్న ఇలాంటి నేపధ్యాన్ని ఇంత భారీ ఖర్చుతో అది కూడా త్రీడిలో తీయాలని ఆలోచన చేయడమే గుణశేఖర్ చేసిన అతి పెద్ద రిస్క్. పోనీ విజువల్ ఎఫెక్ట్స్ అబ్బురపరిచే రీతిలో ఉంటే కథనం అటుఇటుగా ఉన్నా గ్రాండియర్ కోసమైనా జనం చూసేవాళ్ళేమో. కానీ ఆ విషయంలోనూ తగినంత శ్రద్ధ వహించలేదు. సెకండ్ హాఫ్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలు, త్రీడి కన్వర్షన్ కోసం మార్చిన సీన్లలో నాణ్యత లేక స్క్రీన్ మీద అవుట్ ఫుట్ తేడా కొట్టేసింది.
శకుంతల దుశ్యంతుల మధ్య ప్రేమకథ, విడిపోయాక జరిగే పరిణామాలు, ఏళ్ళ ఎడబాటు తర్వాత తిరిగి కలుసుకునే క్రమంలో ఎక్కడా హై మూమెంట్స్ ఉండవు. చాలా ఫ్లాట్ గా చెప్పుకుంటూ పోవడంతో ఆసక్తి తగ్గిపోయి బోర్ కొట్టడం మొదలవుతుంది. పైగా పాటలు, వాటి ప్లేస్ మెంట్, మణిశర్మ సిగ్నేచరే లేని నేపధ్య నేపధ్యం ఇలా ఒక్కొక్కటి వీక్ గా మారిపోవడంతో గుణశేఖర్ స్క్రిప్ట్ ఎంత ఉన్నతంగా ఉన్నా అది మేకింగ్ రూపంలోకి మారిపోయాక తేలిపోయింది. బాహుబలి కేవలం ప్రభాస్ అనుష్కల కోసం జనం చూడలేదు. అబ్బురపరిచే ఎన్నో అంశాలు దోహదపడ్డాయి. అలాగే శాకుంతలంకు కేవలం సమంతా అనే బ్రాండ్ ఒకటే సరిపోదు. అంతకు మించి ఇది తెరమీదే చూడాలన్నంత బలమైన కంటెంట్ పడాలి. దానికి సామ్ ఒక సపోర్ట్ గా ఉంటుంది. దురదృష్టవశాత్తు అది జరగలేదు



