Telugu

విద్యార్థుల ఆత్మహత్యలు…పాపం ఎవరిదీ.?

రెండు తెలుగు రాష్ట్రాలలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ పరీక్షా ఫలితాల విడుదల కొంతమంది విద్యార్థులకు ఆయా కుటుంబాలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తే, మరి కొంతమంది విద్యార్థుల కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపుతుంది.

ADVERTISEMENT

పదవ తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాలు కొందరి విద్యార్థుల భవిష్యత్ కు శుభం కార్డు వేస్తున్నాయి. అయితే అనుకున్న స్థాయిలో మార్కులు సాధించలేకపోయాము అనే మనస్తాపంతో కొందరు, పరీక్షల్లో ఫెయిల్ అయ్యాము అనే అవమాన భారంతో మరికొందరు విద్యార్థులు బలవంతంగా తమ ప్రాణాలను విడుస్తున్నారు.

అయితే పరీక్షలలో ఫెయిల్ అయ్యామంటేనే ఇక జీవితం ముగిసిపోయింది, ఇరుగు పొరుగు వారికి ముఖం చూపించే పరిస్థితి లేదు, ఫెయిల్ అయితేనో, తక్కువ మార్కులు వస్తేనో ఇంట్లో వాళ్ళు తిడతారు, కొడతారు, తోటి స్నేహితులు గేలి చేస్తారు, ఉపాధ్యాయులు మందలిస్తారు అంటూ ఇలా చాల చిన్న చిన్న కారణాలతో జీవితం మీద ఎటువంటి అవగాహన లేని యువత ఆత్మహత్యలే శరణ్యం అంటూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ కన్న వారికీ తీరని కడుపు కోతను జీవితకాల శిక్షగా విధిస్తున్నారు.

ఈ విద్యార్థుల ఆత్మహత్య ల పాపం ఎవరిదీ.? వీరికి ఇటువంటి చెడు సందేశాలు ఇస్తుంది ఎవరు.? ఫెయిల్ అయితే సమాజం చులకనగా చూస్తుంది అనే ఆందోళనలోకి విద్యార్థులు ఎందుకు వెళుతున్నారు.? మార్కులే తమ బిడ్డల భవిష్యత్ అని నమ్మే తల్లిదండ్రులదా తప్పు.?

తమ విద్యాసంస్థల పేరు ప్రతిష్ఠల కోసం ర్యాంకుల పేరుతో విద్యార్థి స్థాయిని నిర్ణయించే విద్యా సంస్థలదా నేరం.? లేక ఫెయిల్ అయితే ఇక జీవితమే శూన్యం అంటూ నిందించే సమాజానిదా ఈ పాపం.? పరీక్షలలో ఫెయిల్ అయితే భుజం తట్టి నడిపించాల్సిన తల్లితండ్రులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారా.? అనేది ఒక్కసారి ఆలోచించాలి.

ఉరుకుల పరుగుల జీవితాలతో అటు తల్లితండ్రులు వారి పిల్లలతో విలువైన సమయాన్ని గడపలేకపోతున్నారు. స్కూల్స్ అని ఆ తరువాత ట్యూషన్స్ అని వారి బాల్యాన్ని మొత్తం నాలుగు గోడల మధ్యన, నలుగురు వ్యక్తుల మధ్యన బందీని చేస్తూ తెలియకుండానే పిల్లల్ని తల్లితండ్రులు మానసికంగా దూరం చేసుకుంటున్నారు.

ఇక ర్యాంకులు తప్ప సగటు విద్యార్థి అభిప్రాయాన్ని గౌరవించడం కాదు కదా కనీసం వినడానికి కూడా ఆసక్తి చూపని కొన్ని విద్యాసంస్థలు ఈ ఫెయిల్యూర్స్ ను తట్టుకుని నిలబడేలా భవిష్యత్ తరాన్ని తయారు చెయ్యలేకపోతున్నాయి. పోటీ ప్రపంచంలో రాణించాలి అంటే మంచి మార్కులు రావాల్సిందే, భవిష్యత్ బంగారు మయం కావాలంటే అత్యధిక మార్కులతో పాస్ అవ్వాల్సిందే అనే అభిప్రాయాన్ని సమాజం పిలల్ల మనసుల మీద రుద్దేస్తోంది.

అయితే తిరుపతి కి చెందిన సురేష్ అనే వ్యక్తి ఇంటర్ ఫెయిల్ అయినప్పటికీ కుంగిపోకుండా, తన ఫెయిల్యూర్ ని అంగీకరించి తిరిగి పట్టుదలతో చదివి భారత దేశంలోనే అత్యున్నత పరీక్షా గా భావించే సివిల్ సర్వీస్ లో జాతీయ స్థాయిలో 988 వ రాంక్ సాధించి అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఇటువంటి వారు ఎందరో నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తారు.

అటు తల్లితండ్రులు, ఇటు విద్యాసంస్థలు విద్యార్థులకు ఇటువంటి వారి జీవితాలను ఆదర్శం గా చెప్పడంతో ఆ పిల్లల మనసులో సూసైడ్ అనే ఆలోచనలు తగ్గే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా ఫెయిల్ అనేది తమ విద్యార్థి ప్రయాణంలో వచ్చిన ఒక తాత్కాలిక విరామం గా భావించి ముందుకెళ్లాలే కానీ అదే వారి జీవితానికి ఆఖరి మజిలీ అనుకుంటూ బలవన్మరణానికి అడుగులు వెయ్యకూడదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

December 4 Clash: Nithiin vs Naga Chaitanya

Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…

13 minutes ago

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

42 minutes ago