ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బిరుదు లేకుండా హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రామ్ చరణ్ మాత్రమే. ఆఖరికి నాని కూడా ‘నాచురల్ స్టార్’ అవతారం దాల్చిన నేపధ్యంలో… చిరంజీవి తనయుడు మాత్రం ఎలాంటి పేరు లేకుండా వెలవెలబోతున్నాడు. అంతకు ముందు ఉన్నటువంటి ‘మెగా పవర్ స్టార్’ బిరుదును పవన్ కళ్యాణ్ తో తలెత్తిన విబేధాల నేపధ్యంలో వదులుకున్న విషయం తెలిసిందే.
అయితే ఉన్నట్లుండి రామ్ చరణ్ ను ఏకంగా ‘సూపర్ స్టార్’ అని పిలిచేసాడు హీరో నవదీప్. ‘ధృవ’ సినిమాలో చెర్రీతో పాటు ఓ కీలక పాత్ర పోషిస్తున్న నవదీప్, మెగా వారసుడుతో తన అనుభవాలు పంచుకుంటూ పోలీస్ డ్రెస్ లో ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసారు. ‘ఈ మనిషి అద్భుతం… అత్యుత్తమ కో సూపర్ స్టార్… ఇతనితో వర్క్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది’ అంటూ నవదీప్ తన ఫీలింగ్స్ ను ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.
అంతా బాగానే ఉంది గానీ, రామ్ చరణ్ ను ‘సూపర్ స్టార్’ అని సంభోదించడం ఏంటి? అది కేవలం నవదీప్ ఫీలింగ్ మాత్రమేనా? లేక దీనికి గ్రౌండ్ వర్క్ జరుగుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘సూపర్ స్టార్’ అనే బిరుదు అందరికీ ఇచ్చేది కాదు. దానికి ఒక అర్హత ఉండాలి. ఎంతో సాధిస్తే తప్ప ‘సూపర్ స్టార్’ అన్న పిలుపు సాధ్యం కాదు. అది రజనీకాంత్, అమితాబ్, ఒకప్పుడు కృష్ణ, ఇప్పుడు మహేష్ బాబు వంటి వారికి మాత్రమే సాధ్యమైంది.
మరి నవదీప్ పిలుపు కేవలం అభిమానంలో భాగంగా వచ్చిందా? లేక ‘సూపర్ స్టార్’గా రామ్ చరణ్ ను ప్రమోట్ చేస్తారా అనేది చూడాలి. మెగా క్యాంప్ లో జరిగేవన్నీ నేరుగా కాకుండా… ముందుగా ఇలా పరోక్షంగా ప్రేక్షకుల్లోకి ఎక్కించిన తర్వాతే, అసలు విషయాన్ని బయట పెడతారన్న టాక్ ఎలాగూ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. అయితే ‘సూపర్ స్టార్’గా ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబు ఉండడంతో బ్యాక్ గ్రౌండ్ లో ఎలాంటి వర్క్ జరిగినా… ఫోర్ గ్రౌండ్ కు వచ్చే పాటికి చెర్రీకి సాధ్యం కాకపోవచ్చని మరో టాక్.



