Telugu

సూపర్ స్టార్ కృష్ణ – సాహసమే వ్యక్తిత్వం

ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. ఒక అద్భుత శకం సెలవు తీసుకుంది. సూపర్ స్టార్ అనే పదానికి నిర్వచనంగా నిలిచిన వెలుగులారని తార నింగికెగిసింది. కథ అయిపోలేదు. ఇప్పుడే మొదలయ్యింది. రాబోయే తరానికి పాఠాలు చెప్పేందుకు సిద్ధమవుతోంది. తాను లేకపోయినా నటించిన సినిమాల్లో చిరస్ధాయిగా చెప్పుకునే పాత్రల ద్వారా స్ఫూర్తిని అందుకోమని పిలుపునిస్తోంది. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ ప్రస్థానంలో ఎదురుకున్న ఆటుపోట్లు, దాటుకున్న సవాళ్లు, కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు ఇలా అన్నింటికి దారి చూపిన దిక్సూచి ఏదంటే దానికాయన చెప్పే సమాధానం సాహసం. అవును సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిత్వమే చదువుతూ ఉండాలనిపించే సాహసగాథ

ఇప్పుడెవరైనా స్టార్ హీరోని ఒక ఏడాదిలో ఎన్ని సినిమాలు చేయగలరో అడిగి చూడండి. ఒకటి చేస్తే గొప్ప. రెండోది అదృష్టం. మూడనే ప్రసక్తే ఉండదు. అలాంటిది ఒక సంవత్సరంలో ఏకంగా పద్దెనిమిది చిత్రాలు విడుదల కావాలంటే ఆ యాక్టర్ ఎన్ని షిఫ్టులు పని చేసి ఉండాలి, ఎన్ని రాత్రిళ్ళు నిద్ర త్యాగం చేయాలి, కుటుంబానికి నెలల తరబడి ఎంత కాలం దూరం ఉండాలి. ఇవన్నీ భరించారు కాబట్టి కృష్ణగారు ఇప్పటి తరానికి అనితరసాధ్యమైన మూడు వందల నలభై పైచిలుకు పైగా సినిమాల్లో ఎప్పటికీ చెప్పుకునే పాత్రల్లో జీవించారు. ఘట్టమనేని సామ్రాజాన్ని అభిమానులనే బలమైన సైన్యంతో నడపగలిగిగారు. అందుకే కృష్ణ గారు వ్యక్తి కాదు చరిత్ర.

ADVERTISEMENT

చిన్నప్పుడు పాతాళభైరవిలో తోటరాముడిగా ఎన్టీఆర్ విశ్వరూపాన్ని తెరపై చూసినప్పుడు కృష్ణగారిలో కథానాయకుడి కాంక్ష మొగ్గతొడిగింది. తోడికోడళ్లు శతదినోత్సవం కోసం ఏఎన్ఆర్ తెనాలిలో ఓ థియేటర్ కు వచ్చినప్పుడు ఆ జన సందోహం చూసి తనకూ ఎప్పటికైనా ఇలాంటి వైభవం దక్కాలనే బలమైన కాంక్ష చిగురులు తొడిగింది. ఆ లక్ష్యంలో చిత్తశుద్ధి భగవంతుడికి చేరిందో ఏమో ఆ సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావే కృష్ణని తేనే మనసులతో పరిచయం చేయాల్సి రావడం విధి సంకల్పం. బిఎస్సి పూర్తి చేసి 20 దాటని వయసులోనే పరిశ్రమలోకి వెళ్లాలని నిర్ణయించుకుని ఆ మాటే ధైర్యంగా తండ్రితో చెప్పి ఒప్పించుకోవడమే మొదటి మెట్టు

నాటకాలు వేస్తూనే సినిమాల కోసం ప్రయత్నిస్తున్న టైంలో ఎల్వి ప్రసాద్ గారు మొదలుపెట్టిన కొడుకులు కోడళ్ళు కోసం మొదటి ఆఫర్ వచ్చింది. కానీ అది మొదలుకాకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత తేనే మనసుల ఆడిషన్ కోసం పిలుపు వస్తే వెంటనే మదరాసు వాలిపోయి ఆదుర్తిగారి కళ్ళలో పడి ఆయన్ను ఒప్పించడం, సినిమా మంచి విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. అన్నీ సవ్యంగా జరిగితే ఇది ఇండస్ట్రీ ఎందుకవుతుంది. రెండో సినిమా కన్నెమనసులు ఒకే అయినా 6 నెలలు గ్యాప్ వచ్చింది. మళ్ళీ నిరీక్షణ. అప్పుడు తలుపు తట్టింది డూండి గారి గూఢచారి 116. తెలుగుతెరకు జేమ్స్ బాండ్ ని పరిచయం చేసే అదృష్టం కృష్ణకే దక్కింది

దాని తర్వాత ఆయన వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఎప్పుడూ కలగలేదు. ఒకేసారి ఇరవై నిర్మాతలు చెక్కులు పట్టుకుని ఇంటికి వచ్చేశారు. ఎవరెవరికి సంతకాలు పెడుతున్నారో కూడా చూసుకోవడం లేదు. కేవలం డేట్లు ఇవ్వడం వరకే బాధ్యతగా చూసుకుని కనీసం కథలు వినే సమయం కూడా ఉండేది కాదు. స్వర్గీయ ఎన్టీఆర్ తో కలిసి నటించే భాగ్యం తన ఏడో సినిమాకే స్త్రీజన్మకే దక్కడం కృష్ణ మురిసిపోతూ చెప్పుకుంటారు. పట్టుమని పది చిత్రాలు పూర్తి కాకుండానే అవే కళ్ళు లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో హిట్టు కొట్టారు కృష్ణ. సెంటిమెంట్, యాక్షన్, క్రైమ్, ఎమోషన్, కమర్షియల్ ఇలా జానర్ ఏదైనా కృష్ణ చేస్తాడన్న మాట జనంలోకి బలంగా వెళ్లిపోయింది

1969 నుంచి మొదలుపెడితే సుమారు పదేళ్ల పాటు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు నటించిన ఘనత కృష్ణ గారి సొంతమయ్యింది. టక్కరిదొంగ చక్కని చుక్క,అక్కాచెల్లెల్లు, అందరికీ మొనగాడు,మహాబలుడు, ఉండమ్మా బొట్టు పెడతా ఇలా ఒకదాన్ని మించి మరొకటి లెక్కలేనన్ని హిట్లు పడ్డాయి. 1971లో మెకనస్ గోల్డ్ లాంటి హాలీవుడ్ చిత్రాలు ఇండియాలోనూ భీకరంగా ఆడుతున్నప్పుడు వాటిని మనమెందుకు తీయకూడదన్న ఆలోచన మోసగాళ్లకు మోసగాడుకి ప్రేరేపించింది. ఆ తర్వాత జరిగిన చరిత్ర తెలిసిందే. టాలీవుడ్ మొదటి కౌబాయ్ ని చూసి జనం మురిసిపోయారు. ఎంతగా అంటే దీన్నే మళ్ళీ ఇంగ్లీష్ లో డబ్ చేయించేంత

ఎన్టీఆర్ అంతటి నటదిగ్గజమే స్క్రిప్ట్ రాయించుకుని మరీ తీయలేకపోయిన అల్లూరి సీతారామరాజుని 1974లో సినిమా స్కోప్ లో భారీ బడ్జెట్ తో కృష్ణ నిర్మించడం గురించి ఏకంగా పుస్తకాలే వచ్చాయి. ఆ పేరు చెప్పగానే అసలు రూపం ఎలా ఉంటుందో చెప్పలేం కానీ ఇప్పటి తరానికి కూడా గుర్తొచ్చేది కృష్ణనే. అంతగా ఆ విగ్రహం మనసుల్లో ముద్రించుకుపోయింది. ఏడాది ఆడిన బొమ్మ అది. తర్వాత ఏకంగా 13 ఫ్లాపులు నటశేఖరుడిని దెబ్బ కొట్టాయి. అయినా తగ్గలేదు. తిరిగి ఫ్యామిలీ మూవీ పాడి పంటలుతో తన సత్తా చాటారు. ఇంకొకరు అయితే ఏళ్ళ తరబడి బ్రేక్ తీసుకునేవారు కానీ అక్కడ ఉన్నది కృష్ణ. పరాజయాలకు కుంగిపోయే తత్వం కాదు

1975 తర్వాత కొన్ని డిజాస్టర్లు పడ్డాయి. ఎన్టీఆర్ అడవిరాముడుతో మాస్ మార్కెట్ ని తిరిగి చేజిక్కించుకున్నారు. ఏఎన్ఆర్ ప్రేమాభిషేకంతో రికార్డులు కొల్లగొట్టారు. కృష్ణ అంత తాకిడిలోనూ తన ఫ్యాన్స్ ని నిరాశపరిచేవారు కాదు. ఊరికి మొనగాడు, కృష్ణార్జునులు, ఈనాడు, ముందడుగు, కిరాయి కోటిగాడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. చిరంజీవి అనే ఉడుకురక్తం ఖైదీ రూపంలో దూసుకొచ్చి పరుగులు పెడుతున్న టైమది. 1984లో కృష్ణ డ్యూయల్ రోల్ చేసిన అగ్నిపర్వతం మరోసారి ఆయన స్టామినా చాటింది. 1986లో బాహుబలి రేంజ్ గ్రాండియర్ తో అప్పట్లోనే కోట్ల బడ్జెట్ తో చేసిన టాలీవుడ్ తొలి 70ఎంఎం సింహాసనం ముచ్చట్ల గురించి చెప్పమంటే నిన్నటి తరం అభిమానులు రోజుల తరబడి గడిపేస్తారు

1990 టైంలో కాస్త తగ్గాల్సి వచ్చినా రౌడీ అన్నయ్య, నెంబర్ వన్ లాంటి సూపర్ డూపర్ హిట్లతో తానెప్పటికీ సూపర్ స్టారేనని ఋజువు చేస్తూ వచ్చారు. పద్మాలయ బ్యానర్ లో సినిమాలు, స్టూడియో బాధ్యతలు చూసుకుంటూనే 1984లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 89లో ఏలూరు ఎంపిగా కాంగ్రెస్ తరఫున గెలవడం అక్కడా విజయాన్ని అందించింది. ఎన్టీఆర్ పాలన మీద నేరుగా విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ మండలాధీశుడు, నా పిలుపే ప్రభంజనం, గండిపేట రహస్యం, సాహసమే నా ఊపిరి లాంటి సినిమాలు తీయడం ఆయనకే చెల్లింది. వయసు మళ్లుతున్నా మరోసారి తెరపై కనిపించాలని 2016లో శ్రీశ్రీతో మళ్ళీ మేకప్ వేసుకోవడం కృష్ణగారి నటతృష్ణకు నిదర్శనం.

దర్శకుడిగా కృష్ణగారిది మరో గోల్డెన్ చాప్టర్.సింహాసనం, శంఖారావం, ముగ్గురు కొడుకులు, కలియుగ కర్ణుడు, కొడుకు దిద్దిన కాపురం, రిక్షావాలా, అన్న తమ్ముడు, నాగాస్త్రం, ఇంద్రభవనం, అల్లుడు దిద్దిన కాపురం, రక్త తర్పణం, మానవుడు దానవుడు, పండంటి సంసారం లాంటి ఎన్నో ఆణిముత్యాలు అందించారు. దానవీరశూరకర్ణకు పోటీగా కురుక్షేత్రం తీసినా, దేవదాసుని మరిపించాలని దేవదాసుని రీమేక్ చేసి ఈ ప్రయత్నాల్లో బాక్సాఫీస్ పరంగా ఓడిపోయినా చెక్కుచెదరని విశ్వాసం ఆయనది. ఊరికే కృష్ణగారిని సూపర్ స్టార్ అనలేదు. ఆ బిరుదుకి మించి ఎన్నో సాధించి ఒక మనిషి ఇన్ని మైలురాళ్ళు అందుకోవడం సాధ్యమేనా అనిపించిన నిజమైన సూపర్ స్టార్ పవర్ ఇది. అభిమానులు దేవుడిగా కొలిచేది అందుకే

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rajinikanth’s Dharman: The Disaster Fear After Jailer 2?

Following the terrible failure of Coolie, Rajinikanth made a comeback with his most anticipated sequel…

13 minutes ago

Weak Box Office: 5 Stars Who Don’t Deserve Solo Films?

Every actor deserves to do a solo film. Unfortunately, there is a long list of…

43 minutes ago