
సినిమాలలో రాజకీయనాయకులు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు కలిసి ఓ ముఖ్యమైన కేసుని ఏవిధంగా పక్కదారి పట్టిస్తుంటారో, దోషులను ఏవిధంగా కాపాడుతుంటారో చూస్తుంటాము.
వివేకానంద రెడ్డి, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం కేసులలో కొన్ని వ్యత్యాసాలున్నప్పటికీ ఇద్దరూ దారుణ హత్యకు గురయ్యారనేది వాస్తవం.
కానీ రెండు కేసులలో దోషులు పదవులు, అధికారం, రాజకీయ పరపతి, చట్టంలో లొసుగులు, వ్యవస్థలలో లోపాలను తెలివిగా ఉపయోగించుకుంటూ శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు. హత్యలు చేసిన వారు నిర్భయంగా ప్రజల మద్యనే తిరుగుతున్నారు. చట్ట సభలకు వెళ్ళి వస్తున్నారు కూడా.
కానీ రాజకీయ లెక్కలు, అవసరాలు, ప్రయోజనాల కారణంగా ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నాయి.
దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కోసం నాడు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం పోలీసులను కట్టడి చేసింది. ఆ ఒత్తిళ్ళ వలన పోలీసులు కూడా అనంతబాబుని ఈ కేసు నుంచి సురక్షితంగా బయటపడేసేందుకు, కుదరకపోవడంతో రెగ్యులర్ బెయిల్ లభించేలా చేసేందుకు అన్ని విధాల తోడ్పడ్డారని సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ ఎమ్మెల్సీని కాపాడుకోవాలనుకోవడం, దాని కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడటం రాజకీయాలలో సహజమే.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పైనే అయినా అది కూడా ఈ కేసులో విచారణ వేగవంతం చేసేందుకు, దోషులకు శిక్షలు పడేలా చేసేందుకు గట్టి చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు నిష్కర్షగా చెప్పింది.
ఈవిధంగా అధికారంలో ఎవరు ఉన్నా దోషులను కాపాడేందుకు సహకరిస్తూనే మళ్ళీ కోర్టుకు వచ్చి శిక్షించాలని అడుగుతున్నాయని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసులకు చెంప దెబ్బ వంటివే.
అయితే ఈ చెంప దెబ్బ ఈ ఒక్క కేసుకి మాత్రమే కాదు… వివేకా హత్య కేసు మొదలు మాజీ మంత్రి గోదాములో రేషన్ బియ్యం మాయమావ్వడం, కాకినాడ పోర్టు కబ్జా చేయడం, ఆ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా కావడం, మద్యం, కల్తీ మద్యం, పరకామణి కేసులో విచారణ కు వస్తున్న మాజీ అధికారి అనుమానాస్పద మృతి కేసు, కల్తీ నెయ్యి కేసు… ఇలా ఒకటా రెండా డజన్ల కొద్దీ కేసులున్నాయి. అవినీతికి తావులేదంటూ రంకెలు వేస్తున్న కూటమి ప్రభుత్వ హయంలోనే అవన్నీ నత్త నడకలు నడుస్తున్నాయి. వాటిలో కొన్ని అటకెక్కిపోయినట్లే ఉన్నాయి. కారణం రాజకీయ లెక్కలు, పార్టీలకు అతీతంగా బదుత్వాలు, స్నేహాలే.
ఇలా రాజకీయ లెక్కలతో నేరస్తులను, అవినీతిని పరులను, చివరికి హంతకులను కూడా ప్రభుత్వం శిక్షించలేని స్థితిలో ఉన్నప్పుడు నేరాలు ఆగుతాయా? పెరుగుతాయా?
ప్రభుత్వం, పోలీసుల అలసత్వాన్ని సుప్రీంకోర్టు స్వయంగా ఎండగట్టింది. ఇకనైనా ఈ కేసుల విచారణ వేగవంతం చేసి దోషులకు శిక్షలు పడేలా చేస్తే మంచిది. లేకుంటే కల్తీ నెయ్యిలాగే ఈ కేసులు కూడా ప్రభుత్వం, పోలీసుల చేతికే అంటుకుంటాయి. ఏదోనాడు వారే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
Shah Rukh Khan's King already has one of the biggest ensemble casts among upcoming Hindi…
A viral claim that Virat Kohli was paid Rs. 5 crores to visit Premanand Maharaj’s…