
అధికార పార్టీలు ఎన్నికలలో తప్పకుండా మళ్ళీ గెలుస్తామనే ధీమాగా ఉంటే, వాటి తీరుతెన్నులలో అది స్పష్టంగా కనబడుతుంటుంది. అదేవిదంగా ఓడిపోతామని గ్రహించినా వాటి తీరుతెన్నులలో అది బయటపడుతూనే ఉంటుంది.
మూడు రోజుల క్రితం పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో టిడిపి నేత కన్నా లక్ష్మినారాయణ రాత్రి రోడ్ షో నిర్వహిస్తుంటే, మంత్రి అనుచరులు వీధి దీపాలకు కరెంట్ నిలిపివేసి ఆయనపై రాళ్ళతో దాడి చేశారు. కన్నా లక్ష్మినారాయణ ఈసారి సత్తెనపల్లి నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల పల్నాడు జిల్లా క్రోసూరులో వైసీపి ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు అనుచరులు కర్రలతో వచ్చి, క్రోసూరు జంక్షన్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న టిడిపి నేత కంచేటి సాయిని అడ్డుకొన్నారు. ఆ తర్వాత ఆయన అనుచరుడు రాము దుకాణంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు.
తాజాగా నేడు వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో వైసీపి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు కర్రలు, రాళ్ళతో టిడిపి నేత శశిధర్ రెడ్డి అనుచరులపై దాడి చేశారు. ఆయన ఇటీవలే వైసీపిని వీడి టిడిపిలో చేరారు. కనుక ముద్దనూరులోని ఆయన అనుచరులు కూడా నేడు టిడిపిలో చేరేందుకు సిద్దపడ్డారు.
ఈ విషయం తెలుసుకున్న వైసీపి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన అనుచరులను వెంటబెట్టుకొని వచ్చి వారితో వాగ్వాదానికి దిగారు. టిడిపి జమ్మలమడుగు ఇన్చార్జి భూపేష్ రెడ్డి కూడా అక్కడకు చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మద్య ఘర్షణ మొదలై పరస్పరం రాళ్ళతో దాడులు చేసుకున్నారు.
పోలీసులు వారిని నియంత్రించలేక, భూపేష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం ముద్దనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
వైసీపి నేతలు చేస్తున్న ఈ వరుస దాడులపై కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ, “ఇవన్నీ వైసీపిలో ఓటమి భయాన్ని సూచిస్తున్నాయి. ఎన్నికలలో ఓడిపోతామని గ్రహించబట్టే ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచే వైసీపి నేతలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ, దాంతో భయానక వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపి నేతలు, వారి అనుచరులు ఈవిదంగా రోడ్లపై కర్రలు పట్టుకొని తిరుగుతూ, ఇళ్ళు, దుకాణాలపై దాడులకు తెగబడుతున్నా డిజిపి కానీ జిల్లా కలెక్టర్ గానీ స్పందించడం లేదు,” అని కన్నా లక్ష్మినారాయణ అన్నారు.
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపిలో అసహనం, అభద్రతాభావం ఇంకా పెరిగిపోతే, ఈ భౌతికదాడులు కూడా ఇంకా పెరిగిపోవచ్చు. ఎన్నికల సమయంలో ఇటువంటి భయానక వాతావరణం నెలకొని ఉంటే, సామాన్య ప్రజలు ఓట్లు వేసేందుకు భయపడి ఇళ్ళకే పరిమితం అవుతారు. అందుకే వైసీపి ఈవిదంగా వ్యవహరిస్తోందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
Vaibhav Sooryavanshi was once again left out of India's playing XI for the fourth T20I…
Sundeep Kishan usually keeps things low-key while promoting his films and rarely makes big claims…