
TDP-Jana Sena Alliance Faces Tensions
టీడీపి-జనసేనల మద్య చిచ్చు పెట్టి విడదీసేందుకు వైసీపీ ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు దానికి ఆ శ్రమ లేకుండా జనసేన నేతలు, మద్దతుదారులు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులతో రెండు పార్టీల మద్య చిచ్చు రగులుతోంది.
ఈ ఎన్నికలలో జనసేన పోటీ చేసి గెలిస్తే పార్టీ బలపడుతుందనేది వాస్తవం. అయితే కొన్నిచోట్ల పార్టీకి బలమైన అభ్యర్ధులు లేకపోవడం, మరికొన్ని చోట్ల టీడీపి లేదా బిజేపికి ఆ సీట్లు దక్కడం, ఆ కారణంగా చివరి నిమిషంలో జనసేన అభ్యర్ధులు పక్క డివిజన్‌లో నామినేషన్ వేయాల్సిరావడం వంటివి చాలా చాలా జరిగాయి.
తిరుపతిలో జరిగిన కథ ఇందుకు ఓ ఉదాహరణ. అక్కడ జనసేన ఎమ్మెల్యేకు, కీర్తన అనే వీరమహిళకు మధ్య విభేదాల కారణంగా సీటు దక్కలేదని, అప్పుడు తాళ్ళూరి రామ్ అనే జనసేన నేత చొరవ తీసుకొని ఆమెకు పక్క డివిజన్‌లో సీటు ఇప్పించారని ఆ పార్టీ నేత ఒకరు ట్వీట్ చేశారు. కానీ ఆమె నామినేషన్ పరిశీలనలో తిరస్కరించబడింది. ఇదేవిధంగా మరికొన్నిచోట్ల జనసేన అభ్యర్ధుల నామినేషన్స్ సక్రమంగా లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యారు. అయితే ఇందుకు టీడీపిని నిందిస్తూ కొందరు పోస్టులు పెడుతున్నారు. జనసేన ముసుగులో వైసీపీ వారియర్స్ కూడా ఉండి ఉండవచ్చు.
జనసేన ఈ ఎన్నికలలో పోటీ చేయడం, బలపడటం చాలా అవసరమే. అయితే ఇప్పుడు ఈవిధంగా రచ్చరచ్చ చేసే బదులు, 2-3 నెలల ముందు నుంచే అంతర్గతంగా సమావేశాలు నిర్వహించుకోవచ్చు. అందరికీ ఆమోదయోగ్యమైన బలమైన అభ్యర్ధులను ఖరారు చేసుకోవచ్చు. పోటీ చేయబోతున్నవారికి ఈ ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధులకు శిక్షణ తరగతులు నిర్వహించుకోవచ్చు. ఇవ్వన్నీ చేసి ఉండి ఉంటే నేడు టీడీపిని నిందించాల్సిన అవసరం ఉండేదే కాదు కదా?
జనసేనకు బలమున్న చోట తప్పక గెలుస్తామనే నమ్మకంతో రెబెల్ అభ్యర్ధులుగా నామినేషన్స్ వేస్తున్నప్పుడు, టీడీపిని నిందించే బదులు ఆ సీటు గెలుచుకొని చూపితే సరిపోతుంది కదా?
ఏది ఏమైనప్పటికీ, ఈ ఎన్నికలు టీడీపి-జనసేనల ఐఖ్యతను ప్రశ్నార్ధకంగా మార్చాయని చెప్పక తప్పదు. టీడీపికి ఎక్కడ, ఎంత బలం ఉందో ఆ పార్టీ నేతలకు వారి అధిష్టానానికి కూడా బాగా తెలుసు.
మరి జనసేనకు ఎక్కడ, ఎంత బలం ఉందో ఈ నెల 30న ఫలితాలు వెలువడిన తర్వాత తెలుస్తుంది. వాటిని బట్టి జనసేన భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటే, 2029 ఎన్నికల సమయంలో మళ్ళీ ఇలా హడావుడి, ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు.
The investigation into the firing at Tiger Shroff's car in Mumbai has led to four…
Nani's The Paradise is set to make its OTT debut on Netflix tomorrow, October 22.…