
తొలి టీ 20 మాదిరే భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచే క్రమంలో క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ కేవలం 144 పరుగులు మాత్రమే టీమిండియా చేయగలిగింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సాధించిన 71 పరుగుల చలవతో కనీసం ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోర్ ను నమోదు చేసిన టీమిండియా విజయంపై అభిమానులకు ఆశలు సన్నగిల్లాయి. లక్ష్య చేధనలో నెహ్రా వేసిన ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి, తడబడినప్పటికీ, లక్ష్యం చిన్నది కావడంతో నింపాదిగా బ్యాటింగ్ సాగిస్తూ విజయం దిశగా దూసుకెళ్లింది ఇంగ్లాండ్.
అయితే చివరి 5 ఓవర్లలో మ్యాచ్ ను మలుపు తిప్పారు టీమిండియా ఫాస్ట్ బౌలర్లు. ఒక ఎండ్ లో బూమ్రా పరుగులను ఇవ్వకుండా కట్టడి చేయగా, మరో ఎండ్ లో నెహ్రా కీలకమైన స్టోక్స్ ను పెవిలియన్ కు పంపి మ్యాచ్ ను రసకందాయంలో పడేసాడు. బ్యాటింగ్ ను అనుకూలంగా లేని పిచ్ పై స్లో బాల్స్ తో ఇంగ్లాండ్ ను ముప్పతిప్పలు పెట్టాడు బూమ్రా. చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు కావాల్సిన తరుణంలో, నెహ్రా ఓవర్లో ఏకంగా 16 పరుగులు సాధించడంతో విజయం ఇంగ్లాండ్ దేనని భావించారు.
6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఈ తరుణంలో బాల్ అందుకున్న బూమ్రా, తొలి బంతికే రూట్ ను పెవిలియన్ కు పంపాడు. అయితే రూట్ నాటౌట్ అన్న విషయం టీవీ రీప్లేలో కనపడినప్పటికీ, టీ20లలో ఎంపైర్ దే తుది నిర్ణయం కావడంతో, రూట్ వెనుదిరగక తప్పలేదు. ఇక అప్పటివరకు భారీ షాట్లతో విరుచుకుపడుతున్న బట్లర్ ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్ ను ఇండియా వైపుకు తిప్పాడు బూమ్రా. ఒత్తిడిలో అద్భుతమైన స్లో బంతులు వేసి, చివరికి టీమిండియాకు 5 పరుగుల విజయాన్ని అందించాడు.
బూమ్రా వేసిన చివరి రెండు ఓవర్లలో కేవలం అయిదే అయిదు పరుగులు రాగా, ఫాంలో ఉన్న ఇద్దరు ఇంగ్లాండ్ ప్లేయర్లను పెవిలియన్ పంపాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను సొంతం చేసుకున్నాడు బూమ్రా. రెండు మ్యాచ్ లు ముగిసే సమయానికి 1-1తో సమంగా ఉన్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ ఫిబ్రవరి 1వ తేదీన బుధవారం నాడు బెంగుళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. బ్యాటింగ్ కు అనుకూలమైన ఈ పిచ్ పైన పరుగుల వరద పారుతుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…