తెలంగాణలో కారు దూసుకుపోతోందని చెప్పుకొంటారుగా?

BRS-Carబిఆర్ఎస్ పార్టీ ఎన్నికల చిహ్నం కారు. కనుక ఎన్నికల సమయంలో కారు దూసుకుపోతోందని, కారులో ఇతర పార్టీల నేతలు ఎక్కుతున్నారని లేదా దిగుతున్నారని మీడియా అభివర్ణిస్తుంటుంది. వాటిని చూసి మురిసిపోయే బిఆర్ఎస్ పార్టీ, ఎన్నికలొచ్చేసరికి ఆ కారు గుర్తును చూసే భయపడుతుంటుంది.

ADVERTISEMENT

ఎందుకంటే స్వతంత్ర అభ్యర్ధులకు, చిన్నా చితకా పార్టీలకు కారుని పోలిన చిహ్నాలను ఎన్నికల సంఘం కేటాయిస్తుండటమే ఇందుకు కారణం. వ్యాను, ఆటో, లారీ, బస్సు, ట్రాక్టర్, రోడ్ రోలర్, చివరికి రొట్టెల పీట-కర్ర, కెమెరా వంటివన్నీ కారు గుర్తుకు దగ్గరదగ్గరగా ఉంటున్నాయని వాటి వలన తమ పార్టీ తీవ్రంగా నష్టపోతోందని బిఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది.

కనుక కారుని పోలిన ఎన్నికల చిహ్నాలను ఎవరికీ ఈయవద్దని కేంద్ర ఎన్నికల కమీషన్కు విజ్ఞప్తి చేస్తుంటుంది. ఈసారి కూడా ఆలాగే చేసింది కానీ ఈసీ పట్టించుకోకపోవడంతో ఈసీని ప్రతివాదిగా పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టులో బిఆర్ఎస్ పార్టీ ఓ పిటిషన్‌ వేసింది. తమ విజ్ఞప్తిని ఈసీ అధికారులు పట్టించుకోకపోవడం వలననే హైకోర్టుని ఆశ్రయించవలసి వచ్చిందని బిఆర్ఎస్ తరపు న్యాయవాది మోహిత్ అన్నారు.

సాధారణంగా గ్రామీణ ఓటర్లు, వృద్ధులు, నిరక్షరాస్యులు, దృష్టిలోపం ఉన్నవారు ఎన్నికల గుర్తులను బట్టే ఓట్లు వేస్తుంటారు. కనుక వారు కారు గుర్తుకి వేస్తున్నామనుకొని వ్యాన్, బస్సు, లారీ లేదా మరోదానికి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది.

రాజకీయ పార్టీలకు అత్యంత కీలకమైన ఎన్నికలలో ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఫలితాలను తారుమారు చేసే ప్రమాదం ఉంటుంది కనుక బిఆర్ఎస్ పార్టీ ఆందోళన చెందడం సహజమే. అయితే ఒక సీటుకి అనేకమంది అభ్యర్ధులు పోటీ పడుతున్నప్పుడు వారందరికీ కూడా ఏవో ఓ గుర్తులు కేటాయించవలసి ఉంటుంది. అవి కారు గుర్తుకు దగ్గరదగ్గరగా ఉన్నాయని అభ్యంతరం చెపితే ఈసీ ఏమీ చేయలేదు.

బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో తన ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నప్పుడు ఈసీని ఎలా తప్పు పట్టగలదు?ప్రత్యర్ధి పేరు కలిగినవారిని వెతికి పట్టుకొని స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో దింపుతుండటం, పోలింగ్ సమయం దగ్గర పడుతున్నప్పుడు ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధి తమ పార్టీలో చేరిపోబోతున్నారనో లేదా వేరే పార్టీలో చేరిపోబోతున్నారనో ప్రచారం చేస్తూ మైండ్ గేమ్స్ ఆడుతుంటుంది. కానీ ఎన్నికలలో ప్రత్యర్ధుల వలన తమకు ఎటువంటి నష్టం కలగకూడదని కోరుకొంటుంది. అందుకోసం న్యాయపోరాటం కూడా చేస్తోందిప్పుడు.

ADVERTISEMENT
Latest Stories