
కాంగ్రెస్ పార్టీ తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. ముందుగా చెప్పుకున్నట్టే గెలవడానికి ప్రత్యర్థి పార్టీల మీద చేసిన యుద్దానికి మించి ముఖ్యమంత్రి పదవి అందుకోవడానికి సొంత పార్టీ నేతలపై యుద్ధం చేయాల్సి వస్తుంది.ఇప్పుడు టి. కాంగ్రెస్ లో అదే సీన్ రిపీట్ అవుతుంది.
హోటల్స్ లో గంటల కొద్దీ మీటింగులు, సమావేశాలు,చర్చలు, తీర్మానాలు, అలకలు, బుజ్జగింపులు అన్ని యధాతధంగా తన పని తానూ చేసుకుంటూ పోతున్నాయి. ఈ రోజు రాత్రి 7 గంటలకు రాజ్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ తరుపున ముఖ్యమంత్రి పదవి స్వీకారం ఉంటుంది అంటూ వచ్చిన వార్తలు ఒక్కసారిగా కార్యక్రమం వాయిదా అంటూ మారిపోయాయి. భట్టి, ఉత్తమ్ కుమార్ ఇంకా అలక పాన్పు దిగలేదని, అధిష్టానం ఇంకా బుజ్జగింపులు దశకు చేరుకోవాలి అంటూ వార్తలు ఊపందుకున్నాయి.
పరిస్థితి చూస్తుంటే ఈ చర్చకు కొనసాగింపే కానీ ఇప్పటికి ముగింపు లేదని స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేతను తీసుకువెళ్ళడానికి నూతన కాన్వాయిని సిద్ధం చేశారు అధికారులు.ప్రభుత్వ సచివాలయంలో గత ప్రభుత్వం తాలూకా నేమ్ బోర్డ్స్ ను మార్పులు చేశారు.కొత్త ప్రభుత్వానికి అన్ని రకాల సదుపాయాలను సిద్ధం చేసి తెలంగాణ అధికారులు ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం ఎదురుచూస్తున్నారు.
పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు బాధ్యత తీసుకుని పార్టీని అధికారం దిశగా అడుగులు వేయించడానికి ముందుకు రాని అనుభవం, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్థానాలను పార్టీ సంపాదించుకున్నాకా సీనియారిటీ సాకు చెప్పి పదవులు దండుకోవాలని ఆశ పడుతున్న నాయకులు ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి తప్పేలా లేదు. ఉన్న ముఖ్యమంత్రి పదవి ఒక్కటే కానీ గెలిచిన వారిలో సగం మందికి దాని మీదే ఆశ.
పదవి ఇవ్వకపోతే పార్టీకి హ్యాండ్ ఇచ్చి పక్క పార్టీకి జంప్ అవుతాం అంటూ బెదిరిస్తున్న నేతలు ఒక్కసారి స్థిమితంగా ఆలోచిస్తే అర్ధమవుతుంది. ఏ పార్టీలోకి వెళ్లినా వారికీ ఆ ముఖ్యమంత్రి పదవి అనేది అందని ద్రాక్షనే. అందని పండు కోసం ఆశ పడి చేతిలో ఉన్న పండును కాలరాసుకునే తీరుగా ఉంటది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆలోచన. ఇక ఇప్పుడు ఈ పంచాయితీ ఢిల్లీ పెద్దల చేతులోకి వెళ్ళింది. ఇక దాని పరిష్కారం సీల్డ్ కవర్ లో రావాల్సిందే.
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…
The TDP, Jana Sena and BJP have finalised their seat-sharing agreement for Andhra Pradesh’s urban…