
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.
తెలంగాణలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందనుకొన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా పుంజుకొని అధికార బిఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది.
సీపీఐ, వైఎస్సార్ తెలంగాణ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వగా, తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడం కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే అంశాలు. ఈ పరిణామాలతో కేసీఆర్ కూడా అప్రమత్తమయ్యారు. ఆయనతో సహా పార్టీ ముఖ్యనేతలందరూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు.
కేసీఆర్ ఒక్కరే ఏకంగా 96 ఎన్నికల సభలలో పాల్గొని, అభివృద్ధిపదంలో సాగుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీజేపీ చేతులలో పెట్టి నష్టపోవద్దని నచ్చజెప్పేందుకు గట్టిగా ప్రయత్నించారు.
కాంగ్రెస్ పార్టీ ‘ప్రజలు మార్పు కోరుతున్నారు’ అనే నినాదంతో బిఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టించగా, బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు ‘బీసీ ముఖ్యమంత్రి’ని నియమిస్తామని జోరుగా ప్రచారం చేసుకొంది. ఈసారి జనసేన కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని 8 స్థానాలలో పోటీ చేసింది.
తెలంగాణలో ఐపిఎస్ అధికారిగా పనిచేసిన ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ రెండేళ్ళ ముందే తన పదవికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరి ఆ పార్టీని బలోపేతం చేసుకొన్నారు. ఈసారి బీఎస్పీ 119కి 107 స్థానాలలో పోటీ చేసింది. సిపిఎం పార్టీకి కూడా తెలంగాణలో మంచి పట్టున్న 19 నియోజకవర్గాలలో పోటీ చేస్తోంది.
తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కొనసాగించేందుకు బిఆర్ఎస్ పార్టీకే మళ్ళీ ఓట్లు వేస్తారా లేక మార్పు కోరుకొంటున్నట్లయితే కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, జనసేన, వామపక్షాలకు ఓట్లు వేస్తారా? అనే విషయం సాయంత్రం 5.30 గంటలకు వెలువడే ఎగ్జిట్ పోల్ నివేదికలతో కొంత స్పష్టత రావచ్చు. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడితే పూర్తి స్పష్టత వస్తుంది.
ఈ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేనప్పటికీ ఏపీ ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్స్ వంటివే అని చెప్పవచ్చు. ఏవిదంగా అంటే, తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిని బట్టి ఆంధ్రాలో రాజకీయ పార్టీల బలాబలాలు మారుతాయి. ముఖ్యంగా.. ఈసారి తెలంగాణలో ఆంధ్రా ఓటర్లు ఏపీలో ప్రజల రాజకీయ అభిప్రాయానికి అద్దం పట్టబోతున్నారు. కనుక తెలంగాణ ఎన్నికలు తర్వాత జరుగబోయే ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేయడం ఖాయమే. కనుక ఆంధ్రా ప్రజలు, పార్టీలు కూడా ఈ ఎన్నికల ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
The plot to commit a mass shooting at a Hindu temple in Aurora has been…
The reported differences between Andhra Pradesh Chief Minister Chandrababu Naidu and Deputy Chief Minister Pawan…