
దేశీయ చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా ఖ్యాతి పతాక స్థాయిలో ఉంది. ఒకప్పుడు ఇండియన్ సినిమాను నిర్ధేశించిన బాలీవుడ్ వర్గాలు కూడా నేడు తెలుగు సాంకేతిక నిపుణుల వైపు, హీరోల వైపు చూసే పరిస్థితి నెలకొంది.
ఈ స్థాయికి తెలుగు సినిమాను చేర్చిన ఘనత రాజమౌళికే దక్కింది. అయితే ఆ విజయపరంపరను కొనసాగించడంలో తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు, హీరోలు పూర్తిగా విజయవంతం అయ్యారు, అవుతున్నారు కూడా!
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ మరియు నిర్మాణ షూటింగ్ దశలలో ఉన్న తెలుగు అగ్ర హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్ లోనే విడుదల కానున్నాయి. జక్కన్న – మహేష్ ల సినిమా అయితే అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ కానుందన్న వార్తలు టాలీవుడ్ చరిత్రను మరో మెట్టు ఎక్కిస్తాయన్న ఉత్సాహం సినీ వర్గీయులలో కూడా ఉంది.
అంతా బాగానే ఉంది కదా…. అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. టాలీవుడ్ “ఖ్యాతి” అయితే నిర్విరామంగా పెరుగుతూనే ఉంటోంది గానీ, బాక్సాఫీస్ వద్ద “కౌంట్” అయితే పెరగడం లేదు. స్పష్టంగా చెప్పాలంటే, థియేటర్లలో తెలుగు సినిమా వెలవెలబోతోంది.
పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు ఒక వారం, పది రోజులు ధియేటర్ల వద్ద సందడి నెలకొంటోంది. ఆయా హీరోల అభిమానుల్లో మరియు సినీ ప్రేక్షకులలో క్రేజ్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొన్నాళ్ల పాటు సందడి చేస్తున్నాయి.
కానీ ఏడాదికి సగటున పెద్ద సినిమాలు నెలకు ఒక్కటి కూడా విడుదల కానీ పరిస్థితి నెలకొంది. అంటే 12 పెద్ద సినిమాలు కూడా బరిలో నిలబడడం లేదు. 12 పెద్ద సినిమాల కోసం వేల థియేటర్లు వందల రోజులు ఖాళీగా ఉండే పరిస్థితి ప్రస్తుత టాలీవుడ్ ది.
పెద్ద హీరోల సినిమాలు మినహాయిస్తే, ఏడాదిలో చిన్న సినిమాలు మరియు ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలు విడుదల కావడం, వాటి వైపు ప్రేక్షకులు మొగ్గు చూపడం అనేది ఇటీవల కాలంలో అసలు జరగడం లేదు.
నెల రోజులకే ఓటీటీలో ఈ తరహా సినిమాలు ప్రత్యక్షం అవుతుండడంతో ధియేటర్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్యా గణనీయంగా తగ్గిపోయింది. ఒక దశాబ్దం క్రిందట చిన్న మరియు మీడియం సినిమాలకు ఇలాంటి పరిస్థితులైతే లేవు.
పెరిగిన టికెట్ ధరలు మరియు ఓటీటీలు ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. గతంలో సినీ పరిశ్రమను ‘పైరసీ’ భూతం పట్టి పీడించింది. అగ్ర హీరో అయిన మహేష్ బాబు దీనికి వ్యతిరేకంగా నిలిచి కోర్టు మెట్లు ఎక్కేటంత స్థాయికి టాలీవుడ్ ను ‘పైరసీ’ వేధించింది.
కానీ ప్రస్తుతం ‘పైరసీ’ జాడలే లేవు. ఆ స్థానంలో ‘ఓటీటీ’ వచ్చి చేరింది. ప్రేక్షకులకైతే సినిమాను చేరువ చేర్చింది గానీ, ధియేటర్ అనుభూతిని మాత్రం దూరం చేస్తోంది.
ఒక్క సినిమాకు కుటుంబం మొత్తం పెట్టే ఖర్చు ఏదొక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఏడాది పొడవునా సినిమాలు చూసుకునే వ్యయం కావడంతో, సినీ ప్రేక్షకులు దూరమవుతున్నారన్న విషయాన్ని టాలీవుడ్ గ్రహించలేకపోతోంది.
క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు ఓకే గానీ, పాన్ ఇండియా స్థాయిలో లేనటువంటి ‘కంటెంట్’కు ప్రేక్షకులు ధియేటర్లకు ‘క్యూ’ కట్టడం లేదు. దీనిపై సత్వర చర్యలకు తెలుగు సినీ పెద్దలు పూనుకోని పక్షంలో, తెలుగు సినిమా ‘కౌంటింగ్’పై ప్రశ్నలు నెలకొంటాయి.
తమిళనాడులో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే పార్టీ, 73 సీట్లు గెలుచుకున్న డీఎంకే, 53 సీట్లు గెలుచుకున్న అన్నాడీఎంకే మూడూ…
Chief Minister Chandrababu Naidu has officially shattered the comfort of the Secretariat by declaring every…