
ఉద్యోగుల పోరుబాటను నిలువరించేందుకే ఈ జిల్లాల అంశం హడావుడిగా సిద్ధం చేసి, తప్పుల తడకగా తీసుకువచ్చారన్న ఆరోపణలు ఎలా ఉన్నా, ప్రస్తుతం అందరి చర్చను జిల్లాల పైకి తీసుకువెళ్లడంలో జగన్ వేసిన పాచిక పారినట్లే కనపడుతోంది. ఈ జిల్లాల పేర్లను వివాదాస్పదం చేయడం కూడా జగన్ సర్కార్ రాజకీయ నీతిలో భాగమో ఏమో గానీ, ఇదే మీడియాలో చర్చలకు ప్లస్ పాయింట్ గా మారింది.
బహుశా ఎలాంటి వివాదం లేకపోతే ఈ స్థాయిలో చర్చలు జరిగి ఉండేవి కాదేమో! ఎన్టీఆర్ జిల్లా మొదలుకుని, అల్లూరి జిల్లా, అన్నమయ్య జిల్లా, హిందుపూర్ జిల్లా, దామోదరం సంజీవయ్య, వంగవీటి మోహన రంగా… ఇలా ఎవరికి తోచిన పేర్లను వారు చెప్తూ జిల్లాల పెంపుపై ప్రతి ఒక్కరు మాట్లాడుకునేలా చేయడంలో జగన్ ఎత్తుగడ ఫలించింది.
ఆఖరికి ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఎన్టీఆర్ జిల్లా పేరును ఆహ్వానించారు. బాలకృష్ణ అయితే మరో అడుగు ముందుకేసి జిల్లాల పెంపును స్వాగతిస్తున్నాను అని చెప్పేసారు. తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా స్పందిస్తూ, 100లో 99 తప్పులు చేసే జగన్, ఒక మంచి పనిగా ఎన్టీఆర్ జిల్లా పేరు గురించి స్పందించారు.
చూడబోతుంటే జిల్లాల పేర్లతో వైసీపీ వేసిన పాచికలో టీడీపీ చిక్కుకునేలా చేయడంలో జగన్ సఫలీకృతం అయినట్లే కనపడుతున్నారు. రాజకీయంగా ఇలా ఉంటే ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలానే ఉందన్నది లేటెస్ట్ న్యూస్. పోరుబాట పట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్న నేపధ్యంలో… ప్రస్తుతం ఏ జిల్లాలో ఎవరు వెళ్ళాలి అనే దానిపై కూడా ఉద్యోగులు తలమునకలై ఉండడం పోరుబాటను డైవర్ట్ చేసినట్లయింది.
అయితే జిల్లాల పెంపుతో జగన్ చేయబోయే కార్యాచరణ అంతా తాత్కాలికమే. ఎందుకంటే గతంలో కేసీఆర్ సర్కార్ పెంచిన జిల్లాల పెంపునే ఇప్పటివరకు కేంద్రం ధ్రువీకరించలేదు. ప్రస్తుతం జగన్ సర్కార్ చేస్తోన్న హడావుడి కూడా కొన్నాళ్లపాటు ఉంటుంది. సినీ పరిశ్రమ అంశాన్ని రెండు నెలల పాటు మీడియాలో చర్చకు దారితీసేలా చేసిన జగన్ సర్కార్ పోకడను తదుపరి చిత్ర పరిశ్రమ విస్మరించింది.
బహుశా జిల్లాల పెంపు నిర్ణయం కూడా ఇదే బాటలో పయనించవచ్చు. రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి నిత్యం ఏదొక వివాదంతో కాలయాపన చేయడం పట్ల వైసీపీ సర్కార్ పై విమర్శలు మాత్రం తగ్గడం లేదు. వేంకటేశ్వరస్వామి + అల్లా + ఏసుప్రభువులు కలిసి ఒక మనిషి రూపంలో వచ్చినా, ఈ రాష్ట్రాన్ని బాగుచేయడం సాధ్యం కాదని ఉండవల్లి లాంటి వారు చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా జ్ఞప్తికి రావడం సహజమే.
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…