
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నడూ లేని విధంగా ఆ దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకన్న స్వామి చుట్టు తిరుగుతున్నాయి. స్వామి వారి లడ్డు ప్రసాదం దగ్గర మొదలైన ఈ రాజకీయం ఇప్పుడు ఆ గోవిందుడి చిత్ర పటం వరకు వచ్చింది.
గత కొన్ని రోజులుగా అటు అధికార కూటమి ఇటు విపక్ష వైసీపీ ఇద్దరు కూడా తిరుమల కేంద్రంగా ఒకరి పై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. ఇందులో ఎవరికి వారు తమ ప్రత్యర్థి పార్టీ మీద పై చెయ్యి సాధించాలని ఆ పార్టీ నేతలను రాజకీయంగా ఇరుకునపెట్టాలని భావిస్తూ ఆ బాలాజీ భక్తుల మనోభావాలను తెగేదాకా లాగుతున్నారు.
ఇందులో న్యాయం ఎవరి వైపు ఉంది, అసత్య ప్రచారాలు ఎవరు చేస్తున్నారు, తప్పేవెవరిది.? తప్పించుకుంటుదెవరు.? అనే విషయాలను కాస్త పక్కన పెడితే ఇన్నాళ్ళుగా తిరుమల అంటే అదొక మహా పుణ్యక్షేత్రం, ఏడాదికొక్కసారైనా ఆ దేవదేవుని దర్శనం కావాలి, ఆ గోవిందుడి లడ్డు ప్రసాదం తినాలి, ఆ స్వామి వారి సేవలో మరిమరచిపోవాలి, గోవిందా గోవిందా అంటూ ఆయన సన్నిధిలో కొన్ని నిముషాలైనా సేద తీరాలి అని ఆలోచించే స్థాయి నుంచి,
ఇప్పుడు అసలు తిరుమలలో ఎం జరిగింది.? ఎం జరుగుతుంది.? శ్రీవారి లడ్డు ప్రసాదంలో అపచారం జరిగిందా.? ఆ ఏడుకొండలవాడికి కల్తీ నెయ్యి తో ప్రసాదం సమర్పించారా.? కూటమి ఆరోపిస్తున్నట్టు వైసీపీ హయాంలో తిరుమల లడ్డు తయారీ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందా.? సిట్ నివేదిక ప్రకారం అసలు అది నెయ్యే కాదా.?
వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు అసలు కల్తీ టీడీపీ ప్రభుత్వంలో జరిగిందా.? ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ కి సంబంధం ఏంటి.? అంటూ ఇలా ఒక పవిత్ర పుణ్యక్షేత్రం చుట్టూ ఇటువంటి అపవిత్ర చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇక్కడితో అయినా ఈ రెండు పార్టీలు తమ తమ రాజకీయానికి బ్రేకులు వేసారా అంటే,
నేడు శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ లు చేసిన పనితో ఏకంగా ఆ ఏడుకొండలవాడు చట్టసభలలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. తిరుమల లడ్డు కల్తీ వివాదం పై శాసనమండలి లో వాయిదా తీర్మానం ఇవ్వాలని, ఈ అంశం పై సుదీర్ఘ చర్చ జరగాలంటూ వైసీపీ నేతలు ఏకంగా ఆ గోవిందుడి చిత్ర పటంతో శాసనమండలిలో అడుగుపెట్టారు.
ఇక ఇక్కడ ఈ వివాదం మారో రూపంలో చర్చకు దారి తీసింది. అసలు వైసీపీ నేతలకు దేవుని మీద భక్తి లేదు, పాదరక్షలు ధరించి వైసీపీ ఎమ్మెల్సీ లు ఆ వెంకటేశ్వర స్వామి చిత్ర పటాన్ని పట్టుకున్నారు, ఏకంగా దైవాన్ని చట్ట సభలకు తెచ్చారు, ఆ తెచ్చిన పటాలను కూడా సభలోనే విసిరేసి పోయారు, వెంటనే జగన్ అండ్ కో ఆ తిరుమలేశుడికి క్షమాపణలు చెప్పాలి అంటూ కూటమి నేతలు పట్టుబడుతున్నారు.
ఇక వైసీపీ కూడా తనదైన రాజకీయంతో ముందుకొచ్చింది. గతంలో బాబు కూడా బాలాజీ ప్రతిమల బహుకరణ సమయంలో కాళ్ళకు బూట్లు ధరించారు, అసలు టీడీపీ కే వెంకన్న మీద భక్తి లేదు, టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నట్టు పాదరక్షలతో తిరుమల వెంకన్న ఫోటో ని పట్టుకుంటే వెంటనే తమ పదవికి రాజీనామా చేస్తా అంటూ ఆ ఏడుకొండలవాడి సాక్షిగా శపధాలు, శాసనాలు ప్రకటిస్తున్నారు వైసీపీ నేతలు.
అయితే ఎల్లప్పుడూ నిత్యకల్యాణం పచ్చతోరణం కింద సాగే తిరుమల శ్రీవారి సేవ ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య నిత్య వివాదాలుగా మారుతున్నాయి, వారి విమర్శలు వీరి కౌంటర్లే శ్రీవారికి సుప్రభాత సేవ, ఆర్జిత సేవ, పవళింపుల సేవగా మారుతున్నాయి.
ఈ వివాదాన్ని నిత్యం వార్తలలో ఉంచడానికి వైసీపీ ఇప్పటికే ఆ వెంకన్నను శాసనసభల వరకు తెచ్చింది, మరి రేపటి రోజున ఆ ఏడుకొండలవాడిని ఇంకెంత దూరం తీసుకువెళ్లదలచిందో.? అలాగే కూటమి కూడా ఇంకెన్నాళ్లు ఆ వైసీపీ ట్రాప్ లో ఉండాలనుకుంటుందో చూడాలి మరి..!
మరి వీరి రాజకీయానికి చెక్ పెట్టడానికి ఆ గోవిందుడే ప్రత్యక్షం కావాలేమో బహుశా..! అప్పటి వరకు గోవిందా గోవిందా అంటూ ఆ స్వామివారిని స్మరించుకోవడం తప్ప సామాన్య భక్తులు ఎం చేయగలరు..?
Ishan Kishan could be back in India’s Test plans ahead of the upcoming New Zealand…
Kangan Baruah brings a flash of metallic glamour to this striking portrait series. Her silver…