
టొమేటో ధరలు ఈ స్థాయిలో పెరిగాయి కనుక టొమేటో పండించే రైతులు లాభపడుతుంటే తప్పక సంతోషించవచ్చు. కానీ రైతులు నష్టపోతుండగా టొమేటోలను బ్లాక్ చేసి అమ్ముకొంటున్న దళారులు, వ్యాపారులు మాత్రమే లాభపడుతున్నారు. రెండు-మూడు నెలల క్రితమే టొమేటో ధరలు కిలో రూ.10కి పడిపోయింది.
ఆ ధరకు కూలిల ఖర్చు, రవాణా ఖర్చు కూడా రాదని రైతులు టొమేటోలను రోడ్లపక్కన పారబోయడం అందరూ చూశారు. ఇప్పుడు అదే టొమేటో ధర ఈ స్థాయికి చేరుకొంది. రెండు-మూడు నెలల్లో ఇంతగా ఎలా పెరిగిపోయింది?అంటే ప్రభుత్వాలు, వ్యాపారులు వానలు, వరదలు అంటూ కుంటిసాకులు చెపుతున్నారు.
టొమేటో ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని గ్రహించిన జగన్ ప్రభుత్వం రైతుబజారులలో కిలో రూ.50 లెక్కన రాయితీపై అందజేస్తోంది. వివిద మార్కెట్ల నుంచి సుమారు రూ.95 చెల్లించి కొనుగోలు చేసి ప్రజలకు రూ.50లకే అందజేస్తోంది. ఇది ప్రజలను ఉద్దరించడమే అనుకోవాలేమో?
అయితే దళారులు, వ్యాపారులకు ఉన్న దూరదృష్టి ప్రభుత్వాలకు ఎందుకు ఉండదు?వారు రూపాయి, అర్దరూపాయికి టొమేటోలు కొనుగోలు చేస్తూ రైతులను ముంచేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఏమైపోయాయి? వారు కారు చవుకగా టొమేటోలు కొనుగోలు చేసి శీతల గిడ్డంగులలో నిలువచేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెరిగేలా చేస్తున్నారని తెలిసీ ప్రభుత్వాలు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
వారు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసుకొని వాటిలో లక్షల టన్నుల నిలువచేసి టొమేటోలు, ఉల్లిపాయలు, దుంపలు వగైరా నిలువ చేయగలుగుతున్నప్పుడు, సర్వశక్తివంతమైన ప్రభుత్వాలుశీతల గిడ్డంగులు ఏర్పాటు చేయలేకపోతున్నాయి?చేస్తే రైతులు తమ పంట ఉత్పత్తులకు సరైన ధరలు వచ్చేవరకు వాటిలో నిలువ ఉంచుకొని తమ కష్టానికి, పెట్టుబడికి తగిన ప్రతిఫలం పొందగలిగేవారు కదా?కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ ఇందుకు పూనుకోవడం లేదు. ఎందుకు?అంటే రాజకీయ నాయకులు, వారి బంధుమిత్రులలోనే ఈ వ్యాపారాలు ఉన్నందున!
కానీ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ప్రజాగ్రహానికి గురైతే నష్టపోతామనో లేదా పెరిగిన నిత్యావసర ధరలను ప్రతిపక్షాలు ఆయుధంగా మలుచుకొంటాయనో, ఈవిదంగా రాయితీ ధరలపై టొమేటోలు వగైరా అందించి ప్రజాగ్రహాన్ని చల్లార్చి వారికి మహోపకారం చేస్తున్నామని చెప్పుకోవడం పాలకులకు పరిపాటిగా మారింది.
దేశ జనాభా 140 కోట్లు దాటిపోయినప్పుడు నానాటికీ ఆహార కొరత పెరుగుతుందే తప్ప తరగదు. డిమాండ్-సప్లై ఫార్ములాను బాగా ఒంటబట్టించుకొన్న రాజకీయనాయకులు, దళారులు, వ్యాపారులు తెలివిగా వ్యవహరిస్తూ లాభాలు ఆర్జిస్తుంటే రైతులు, సామాన్య ప్రజలు దశాబ్ధాలుగా తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు.
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై టొమేటోలు, ఉల్లిపాయలు సరఫరా చేసి చేతులు దులిపేసుకొంటున్నాయి తప్ప ఈ సమస్యకు శాశ్విత పరిష్కారాలు చేయడం లేదు. రాజకీయ నాయకులు వ్యాపారాలు చేస్తున్నంత కాలం లేదా రాజకీయ నాయకులకు ప్రజల పట్ల నిబద్దత లేనంతకాలం ‘రాయితీ టొమేటోలు, ఉల్లిపాయల’ కంటే ఎక్కువ ఆశించలేము కూడా.
Sai Dharam Tej is pinning big hopes on Sambarala Yeti Gattu. Made on the biggest…
Nagarjuna has raised an important point about the release problems faced by smaller films like…