
ప్రపంచ దేశాలకు కరోనా అనేక గుణ పాఠాలు నేర్పినట్లే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా భారత్‌తో సహా ప్రపంచ దేశాలకు అనేక కొత్త గుణ పాఠాలు నేర్పిస్తున్నారు. ఆయన నిర్ణయాల వలన ప్రపంచదేశాలు భారీగా నష్టపోక తప్పదు.
కానీ నాడు కరోనా పాఠాలు నేర్చుకొని ఆ సమస్య నుంచి బయటపడినట్లేగానే, ఇప్పుడు ప్రపంచదేశాలతో సహా భారత్ కూడా ట్రంప్ సృష్టిస్తున్న ఈ సమస్యల నుంచి తప్పక బయటపడతాయి. ప్రపంచదేశాలకు ముఖ్యంగా… భారత్‌కు తనని తాను సంపూర్ణంగా ఆవిష్కరించుకునేందుకు ట్రంప్ ఓ గొప్ప అవకాశం కల్పించి చాలా మేలు చేశారనుకోవచ్చు.
హెచ్1 బీ వీసాల ఫీజు లక్ష డాలర్లు చేయడంపై ప్రధాని మోడీ స్పందిస్తూ, “మనకి ట్రంప్ లేదా మరో దేశం శత్రువు కానేకాదు. స్వాతంత్ర్యం వచ్చిన 75 సం.ల తర్వాత కూడా నేటికీ మనం అమెరికా లేదో మరో దేశంపై ఆధారపడి ఉండటమే మన శత్రువు.
అందుకే మేము అధికారంలోకి రాగానే ‘ఆత్మ నిర్భర్ భారత్’, దాని తర్వాత దశలో ‘మెకిన్ ఇండియా’ వంటి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాము.
కనుక ట్రంప్ లేదా మరొకరు విసిరే సవాళ్ళకు స్వయంసంవృద్ది సాధించడం ఒక్కటే ఏకైక పరిష్కారం. ఆ దిశలోనే మనం ముందుకు సాగుతున్నాము,” అని ప్రధాని మోడీ అన్నారు.
దీనికి ఓ పెద్ద ఉదాహరణ చెపుతూ, “దశాబ్దాల తరబడి సాగిన కాంగ్రెస్ పాలనలో షిప్పింగ్, నావికాదళం పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఈ కారణంగా దశాబ్దాల కాలంనాటి షిప్పులను యుద్ధ నౌకలనే వినియోగించుకుంటున్నాము. విదేశీ నౌకల సేవల కోసం భారత్ ఏటా రూ.6 లక్షల కోట్లు చెల్లిస్తోందని ఇది మన దేశ రక్షణ బడ్జెట్ కంటే చాలా ఎక్కువన్నారు.
కనుక తమ ప్రభుత్వం 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇటువంటి సమస్యలన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతోందని ప్రధాని మోడీ చెప్పారు.
ఇప్పటికే భారత్ నావికాదళంలో దేశీయంగా తయారైన అనేక అత్యాధునిక యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు చేరిన సంగతిని ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే పోర్టులు, షిప్పింగ్ రంగంలో కూడా ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మాట వాస్తవమే కానీ విదేశాలపై చాలా ఎక్కువగా ఆధారపడి ఉండటం , ఈవిదంగా ఎదురు దెబ్బలు తగిలినప్పుడు బాధపడుతుండటం పరిపాటిగా మారింది.
కానీ ట్రంప్ మనకి ఓ చక్కటి గుణపాఠం నేర్పుతున్నారు. కనుక ఇప్పటికైనా భారత్ కూడా చైనాలాగ స్వయంప్రతిపత్తి సాధించడానికి తగిన ప్రణాళికలు రూపొందించుకోవడం చాలా అవసరం. లేకుంటే కరోనా మహమ్మారిలా ఇటువంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ పలకరిస్తూనే ఉంటాయి. ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటాయి.
Aniesh made a good impression with his performance in the songs and teaser of Itllu…
Tom Cruise can still make audiences run to theatres, but it seems they need a…