
US aviation crisis raises concerns
నాయుడుగారూ.. అమెరికా విమాన సంక్షోభం చూస్తున్నారా?
ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా ఒకటి. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న దేశం. ఇంతగా అభివృద్ధి చెందిన అమెరికాలోనే సాంకేతిక సమస్యల కారణంగా వేలాది విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పాత కమ్యూనికేషన్ వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో రూటర్‌లో తలెత్తిన సమస్య కారణంగా ఏటీసీ కమ్యూనికేషన్, రాడార్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది.
దీంతో నవంబర్ 13న దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చింది. శుక్ర, శనివారాల్లో 12 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. .
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న అమెరికా వంటి అగ్రరాజ్యానికే ఇటువంటి పరిస్థితి ఎదురైతే, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ పరిస్థితి ఏమిటి? దేశంలో ఇప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా విమాన ప్రయాణాలు చేయగలుగుతున్నారు.
పైగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక కొత్త విమానాశ్రయాలను నిర్మిస్తోంది. కనుక ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ విమానాల రాకపోకలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. అప్పుడు భారత్‌లో కూడా ఇటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తి విమానాలను నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చు.
కనుక భారత్ ఇప్పటికైనా మేల్కోవాలి. అమెరికాలో ఎదురైన సమస్యను కేవలం ఆ దేశానికి సంబంధించిన సమస్యగా చూడకూడదు.
అమెరికాలో తలెత్తిన ఈ సంక్షోభం భారత్‌కు ఒక అలారం వంటిది. సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కంటే, అది రాకుండా ముందే సన్నద్ధం కావడం ముఖ్యం. ఇప్పుడే మేల్కొని విమానయాన రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులను నివారించవచ్చు.
ముందుగా ఏటీసీ వ్యవస్థలను ఆధునీకరించాలి. కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు విఫలమైనప్పుడు సమర్థంగా పనిచేయగల ప్రత్యామ్నాయ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలి.
అలాగే తగినంత మంది ఏటీసీ సిబ్బందిని తయారు చేసుకుంటూ, సిబ్బంది కొరత లేకుండా ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టాలి. క్రమం తప్పకుండా సాంకేతిక తనిఖీలు, భద్రతా పరీక్షలు నిర్వహించాలి.
మన రాష్ట్రానికి చెందిన యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. కనుక అమెరికా ఎదుర్కొంటున్న ఈ విమాన సంక్షోభాన్ని చూసి ఆయన కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
ప్రతిదీ సొంత అనుభవం నుంచే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇతరులకు ఎదురైన సమస్యలను చూసి కూడా పాఠాలు నేర్చుకోవచ్చు. కనుక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే భారత్ ఇప్పుడే మేల్కొని తగిన చర్యలు తీసుకోవడం మంచిది.
King Nagarjuna presented Aniesh's Itllu Arjuna and he is proving to be a potential star…
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు వేరయ్యాయి. కానీ నేటికీ వాటి రాజకీయాలు మాత్రం వేరు కాలేదు.…