
రెండు పార్టీల మద్య సీట్ల సర్దుబాట్లు ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కానీ టిడిపి, జనసేనలు ఒకేసారి ఏకంగా 118 మంది అభ్యర్ధుల జాబితాని ప్రకటించగలిగాయి. వైసీపి వేరే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. కనుక 175/25 స్థానాలకి ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించడం పెద్ద కష్టం కాదు. కానీ వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్‌లో ఎంత కసరత్తు చేస్తున్న ఇప్పటివరకు సగం మందిని కూడా ప్రకటించలేకపోయారు. ఆ ప్రకటించిన జాబితాలలో కూడా అభ్యర్ధులు మారిపోతూనే ఉన్నారు.
తాజాగా పిఠాపురం అభ్యర్ధి ఎంపీ వంగా గీతని మార్చేందుకు జగన్ ‘సిద్దం’ అవుతున్నట్లు సమాచారం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేయబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుని జగన్ ముందే పక్కన పెట్టేసి, కాకినాడ ఎంపీ వంగా గీతని అక్కడి నుంచి శాసనసభకు పోటీ చేయించబోతున్నట్లు జాబితాలో ప్రకటించారు.
కానీ అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయనను ఆమె ఎదుర్కొని నిలబడలేరని జగన్ భావిస్తుండటంతో, శుక్రవారం ఆమెకు తాడేపల్లి ప్యాలస్ నుంచి పిలుపు వచ్చింది. ఆమె స్థానంలో ముద్రగడ పద్మనాభం లేదా ఆయన కుమారుడిని నిలబెట్టాలని, వారు మాత్రమే పవన్ కళ్యాణ్‌ని ఢీకొని ఓడించగలరని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరైతే వంగా గీత పరిస్థితి ఏమిటి?అనేది ప్రశ్న. ఎందుకంటే వైసీపి 5వ జాబితాలో కాకినాడ నుంచి ఆమెకు బదులు చలమలశెట్టి సునీల్ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఒకవేళ ఆమెకు మళ్ళీ కాకినాడ ఎంపీ టికెట్ ఇవ్వదలచుకుంటే, అప్పుడు చలమలశెట్టి సునీల్ పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ త్వరలో విడుదల కాబోయే జాబితాలలో సమాధానాలు దొరుకుతాయేమో చూద్దాం.
చివరిగా ఒక్క మాట! జెండా సభ తర్వాత వైసీపి నేతలు మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్‌పై విరుచుకు పడుతూ ఆయనకి రాజకీయాలు చేతకావని, ఆయనకు పార్టీని నడిపించడం చేతకాదని అవహేళన చేశారు. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని తెలియగానే వైసీపి అభ్యర్ధిని ఎందుకు మార్చుకోవాలనుకొంటున్నారు?
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…
Vijay Deverakonda is hoping to make a strong comeback with Ranabaali. After a series of…