
వైసీపీకి ‘సాక్షి’ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ‘నమస్తే తెలంగాణ’ ఉంది. ఇవే కాక మరికొన్ని పక్క వాయిద్యాలు కూడా ఉన్నాయి.
వాటిలా టీడీపికి సొంత మీడియా లేదు కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి కొంటి పక్క వాయిద్యాలున్నాయి. వాటన్నిటినీ వైసీపీ క్లుప్తంగా ‘ఎల్లో మీడియా’ అని రెండు ముక్కలలో చెప్తుంటుంది.
ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు పక్కనే మృదంగం వాయించే వ్యక్తిని పెట్టుకున్నారు. ఎందుకంటే ఎవరైనా పొగిడితే ఉబ్బిపోయి వారి బుట్టలో పడిపోకుండా అప్రమత్తమయ్యేందుకు ఆ ఏర్పాటట!
సాక్షి, నమస్తే తెలంగాణ లేదా అలాంటి మరో మీడియా వాటి అధినేతలను ఆవిధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ దారి తప్పకుండా సాయపడాలి.
కానీ వారు చేసే తప్పులు, వారి లోపాలు, వైఫల్యాలు జనాలకు వినబడకుండా ఉండేందుకు ఆ పక్క వాయిద్యాలు గట్టిగా మోగుతుంటాయి.
ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండూ కూడా అలానే మృదుమధురంగానే వినిపిస్తుంటాయి. కానీ టీడీపిలో, కూటమి ప్రభుత్వంలో లోపాలు, వైఫల్యాలు, తప్పులు జరుగుతున్నప్పుడు అవి సన్నాయి నొక్కులు నొక్కవు… డోలు తీసి దరువు వేసేస్తుంటాయి.
ఈ విషయంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ ఏమాత్రం మొహమాటపడరు. ఉపాధ్యాయులు పిల్లలకు చెవి మెలేసి చెప్పినట్లే చెప్తుంటారు. అందుకే కూటమిలో సైతం కొంత మందికి ఆయనంటే గిట్టదు. యధార్ధవాది లోక విరోధి అని ఊరికే అనలేదు పెద్దలు.
ఉదాహరణకు తెలంగాణలో సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ మంత్రులు, ఓ న్యూస్ ఛానల్ అధిపతి పోటీ పడుతున్నారంటూ వేమూరి నిర్భయంగా చెపితే డెప్యూటీ సిఎం భట్టి ఆయనపై చిందులు వేశారు.
కానీ వేమూరి “నా ప్రతీ అక్షరానికి కట్టుబడి ఉన్నా… కావాలంటే కోర్టుకి వెళ్ళ వచ్చని” ఆయనకు సలహా ఇచ్చారు. ఈ రోజుల్లో ఇంత ధైర్యం ఎవరికుంది? భట్టి కోర్టుకు వెళ్ళలేదు. అంటే వేమూరి రాతలలో వాస్తవం ఉందనుకోవాలి.
నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి… అసమదీయులకైనా తసమదీయులకైనా సరే! కానీ ఆ చేదుని జీర్ణించుకునే విజ్ఞత ఉంటే మేలే జరుగుతుంది.
మీడియా అంటే రెండు అంచుల పదునైన కత్తి వంటిది. దాని వాడకంలో తేడా వస్తే ఆ కత్తి పట్టుకున్నవారికీ, ఆ కత్తిపై కత్తి దూస్తున్నన్నవారికీ కూడా చాలా ప్రమాదం. అని తెలిసి ఉన్నా వేమూరి రాధాకృష్ణ ధైర్యంగా 30 ఏళ్లుగా ఆ పులి మీద సవారీ చేస్తూనే ఉన్నారు. నేటికీ ‘దిగేదేలే… తగ్గేదేలే’ అంటున్నారు.
అందుకే ఆయన “నాకు చంద్రబాబు నాయుడు కానీ మరొకరు గానీ బాస్ కాదు. ఎవరి నుంచీ నేను ఏమీ ఆశించడం లేదు కనుక ఎవరి ముందు తల దించుకోవాల్సిన అవసరం నాకు లేదు,”’ అంటూ నేడు తొలి పలుకులు తేల్చి చెప్పేశారు.
ఈ మాటలు చాలా మందికి పొగరుగానే అనిపించవచ్చు. కానీ ఈ రోజుల్లో మీడియాలో ఇంత ధైర్యంగా ఈ ముక్క చెప్పగలవారు ఎవరున్నారు? రాష్ట్రాలకు, రాజకీయ పార్టీలకు ఇలాంటి మృదంగాలే చాలా అవసరం ఎక్కువగా ఉందిప్పుడు.
Aadarsha Kutumbam moving out of the October 9 slot has unexpectedly changed the equation for…
A rather interesting casting buzz is doing the rounds around Ravi Teja and Vivek Athreya’s…