
తమిళ సినీ చరిత్రలో దళపతి విజయ్ గా తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలు లిఖించుకున్న విజయ్ టీవీకే పార్టీతో తమిళ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. అయితే సినీ రంగంలో తనకున్న ఛరిష్మా, అభిమాన బలమే తన రాజకీయ పార్టీకి పెట్టుబడిగా పెట్టిన విజయ్ మరో నెలలో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో తన పెట్టుబడికి ప్రతిఫలం పొందనున్నారు.
ఇదిలా ఉంటే తన సినీరంగానికి జననాయకన్ తో మంచి సెండ్ ఆఫ్ ఇవ్వాలని ఆశించిన విజయ్ ఆ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని ఆశపడ్డారు. కానీ కట్ చేస్తే, ఆయన పొలిటికల్ ఎంట్రీ, చేస్తున్న రాజకీయ ప్రకటనలు ఆ చిత్రాన్ని ప్రేక్షకుల వద్దకు చేరనివ్వలేకపోయాయి.
రాజకీయ ఒత్తిడులను తట్టుకుని రిలీజ్ కి రెడీ అయిన ఒక చిత్రాన్ని విజయ్ తన సినీ ఛరిష్మాతో, తన అభిమానుల బలంతో థియేటర్లలోకే తీసుకురాలేకపోయారు. జనవరి సంక్రాంతి కానుకగా విడుదలవ్వాల్సిన సినిమా ఇప్పుడు మార్చ్ ముగింపుకొచ్చినా దానికి ఇంకా మోక్షం లభించలేదు.
అయితే విజయ్ జననాయకన్ చిత్రం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయైన తరువాత జూన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ తాజాగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంలో రాజీ పడకపోతే విడుదలకు సిద్దమైన సినిమాను కూడా థియేటర్లలోకి తీసుకురావడానికి నెలల సమయం పడుతుందనేది స్పష్టమయింది.
మరి అటువంటి పరిస్థితులలో విజయ్ ఇప్పటికీ ఎవరి రాజకీయ ఒత్తిడి లకు తలవంచేదిలేదు అని, ఏ పార్టీతో రాజకీయ పొత్తు పెట్టుకునేది లేదని తెగేసి చెపుతున్నప్పుడు విజయ్ TVK పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లడానికి పార్టీ అధినేతగా విజయ్ కి ఉన్న ఈ కాస్తంత సమయం సరిపోతుందా.?
ఇంతవరకు TVK పార్టీ తరుపున సరైన నాయకులను ప్రజలకు పరిచయం చెయ్యలేదు, అలాగే అసలు పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందో ప్రకటించలేదు, కానీ TVK పార్టీ పోటీ చేసే అన్ని స్థానాలలో నేనే అభ్యర్థిని అనుకుని ప్రజలు తమ పార్టీకి ఓటేసి తనను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలని మాత్రం విజయ్ తమిళ ప్రజలకు విన్నపాలు చేసుకున్నారు.
అయితే ఒకపక్క కరూర్ తొక్కిసలాట ఘటన, దాని పేరుతో విజయ్ చుట్టూ జరుగుతున్న సీబీఐ విచారణ, మరోపక్క మూవీ రిలీజ్ సమస్యలు, ఇంకోపక్క భార్యతో విడాకులు, నటి త్రిష తో సంబంధం అంటూ వ్యక్తిగత వివాదాలు ఇవిచాలవు అన్నట్టుగా ఇక ఇన్ కం టాక్స్ కేసులు వెంటాడుతున్నాయి.
ఇన్ని సమస్యల మధ్య విజయ్ తాను అనుకున్న లక్ష్యాన్ని ఒంటరిగా అందుకోగలరా.? ఉన్న ఈ నెల రోజుల సమయంలో విజయ్ తన ప్రసంగాలతో, తన ప్రచారాలతో, తన పార్టీ సిద్ధాంతాలతో తమిళ ప్రజలను తన వైపు ఆకర్షించుకోగలరా.? తన సినీ అభిమానులను TVK పార్టీకి ఓటర్లుగా మలచుకోగలరా.?
దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న స్టాలిన్ వంటి నేతను బలంగా ఢీకొట్టి గద్దె దింపగలరా.? అలాగే తమిళ అధికార పీఠం కోసం ఏళ్ళ తరబడి వేచిచూస్తున్న బీజేపీ రాజకీయాన్ని ఒంటరిగా ఎదుర్కోగలరా.? సినిమాలో మాదిరి రెండు గంటలలో అనుకున్న తంతు పూర్తి చేయడానికి ఇక్కడ యాక్షన్ – కట్ లు చెప్పడానికి దర్శకుడు ఉండడు, లేదా చేసిన పొరపాటును సరిచేసుకోవడానికి సెంకండ్ టేక్లు ఉండవు.
Venkatesh Maha is returning with his next film Attahaasam. The film is set in the…
Earlier there were multiple unverified media reports about the ACB court potentially looking at impounding…