
ఒక అబద్దం చెపితే దానిని కప్పి పుచ్చుకునేందుకు వంద అబద్దాలు చెప్పాలి. అయినా ఏదో రోజు ఆ అబద్దం.. దానితో పాటు చెప్పిన వంద అబద్దాలు కూడా బయటపడతాయి.
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విషయంలో ఇదే జరిగింది. కాకినాడ పోర్టు కేసులో విచారణకు హాజరైనప్పుడు తనకు అరబిందో కంపెనీ ఆర్ధిక లావాదేవీల గురించి ఏమీ తెలియదని, దాని అధినేత శరత్ చంద్రా రెడ్డితో తాను ఎన్నడూ మాట్లాడలేదని మీడియాతో అన్నారు.
కానీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం సీఐడీ విచారణకు హాజరైనప్పుడు, రాజ్ కసి రెడ్డి, మిధున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ముగ్గురూ తన వద్దకు వచ్చి అరబిందో నుంచి వంద కోట్లు అప్పు ఇప్పించాల్సిందిగా కోరితే తానే శరత్ చంద్రా రెడ్డికి ఫోన్ చేసి వారికి వంద కోట్లు అప్పు ఇప్పించానని మీడియాకు చెప్పారు.
ఓ చిట్ ఫండ్ కంపెనీలో కేవలం రూ.10-25 వేలు చీటీ వేసి మద్యలో పాడుకొని ఆ సొమ్ము తీసుకోవాలంటే ష్యూరిటీలు కావాలి.. వంద సంతకాలు చేయాలి. కానీ విజయసాయి రెడ్డి ఒక్క ఫోన్ చేసి వారికి అరబిందో నుంచి వంద కోట్లు అప్పు ఇప్పించారంటే ఆ కంపెనీతో దాని అధినేత శరత్ చంద్రా రెడ్డితో ఆయనకు ఎంత బలమైన ఆర్ధిక అనుబందం, పరపతి ఉందో అర్దం చేసుకోవచ్చు.
కనుక కాకినాడ పోర్టుని అరబిందో స్వాధీనం చేసుకోవడానికి విజయసాయి రెడ్డి తోడ్పడ్డారనే ఆరోపణలు వాస్తవమే అని భావించాల్సి ఉంటుంది.
వైసీపీలో జగన్‌తో సహా అందరూ ఆణి ముత్యాలే అని పదేపదే సర్టిఫై చేసిన విజయసాయి రెడ్డి స్వయంగా ఇప్పుడు తన ఇంట్లోనే మద్యం పాలసీకి అంటే మద్యం కుంభకోణానికి ప్లాన్ చేశామని ఒప్పుకున్నారు.
దానిలో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని మరోసారి తేల్చి చెప్పారు. ఆయన చాలా ‘తెలివైన దుర్మార్గుడు’(క్రిమినల్ మైండ్) అని కూడా విజయసాయి రెడ్డి చెప్పారు. అతనికి తానే వైసీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు కూడా అప్పగించానని విజయసాయి రెడ్డి చెప్పారు. అతను ప్రజలను, పార్టీని మోసం చేశారని కూడా చెప్పారు.
అంటే వైసీపీ ఆణిముత్యాలు ఎటువంటివో విజయసాయి రెడ్డి స్వయంగా బయటపెట్టారన్న మాట! ఆ ఆణిముత్యాలలో ఆయన కూడా ఒకరని ఆయన మాటలతోనే స్పష్టమవుతోంది. కానీ తాను అమాయకుడిని.. నమ్మమంటున్నారు!
గతంలో సూట్ కేస్ కంపెనీలు సృష్టించి క్విడ్ ప్రో ద్వారా ఏవిదంగా లక్షల కోట్లు స్కామ్ చేయవచ్చో జగన్‌కు మార్గదర్శనం చేసి అక్రమాస్తుల కేసులతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయసాయి రెడ్డి గుర్తింపు పొందారు.
అందుకే జగన్ అధికారంలోకి రాగానే అంటే 2019లోనే ‘మద్యం పాలసీ’ తయారు చేయమని ఏపీఎస్ బీసీఎల్ ఎండీ వాసుదేవ రెడ్డి, ఎక్సైజ్ శాఖ ఓఎస్‌డీ సత్యప్రసాద్ తదితర అధికారులను, ఎంపీ మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్య రాజ్, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు ఆయన వద్దకు పంపించారని స్పష్టమవుతోంది.
మద్యం కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులు అందరూ కూడా తనని సంప్రదించారని, వారితో తాను సమావేశమయ్యానని విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పారు. జగన్ కోరుకున్నట్లుగానే వారికి అవసరమైన నిధులు సమకూర్చి ‘మద్యం పాలసీ’తో ఏవిదంగా వేలకోట్లు పిండుకోవాలో సలహాలు, సూచనలు ఇచ్చారని విజయసాయి రెడ్డి మాటలతోనే స్పష్టమవుతోంది.
మద్యం కుంభకోణం జరిగిన మాట వాస్తవం.. దానిలో ఫలానా ఫలానా వ్యక్తులున్నారు. వారందరికీ (తెలిసో తెలియకో) తానే మార్గదర్శనం చేశానని చెప్పిన విజయసాయి రెడ్డి తాను మాత్రం ఆణిముత్యాన్నే అని మద్యం కుంభకోణంలో ఎవరెవరు ఎంత బొక్కేశారో తనకు తెలియదని అంటున్నారు. ఈ కుంభకోణం, దీనిలో పాత్రధారులందరి వెనుక ప్రధాన సూత్రధారి ఎవరో తనకు తెలియదని విజయసాయి రెడ్డి అమాయకంగా చెపుతుంటే జనం నమ్మి తీరాలి. అంతేగా అంతేగా!
Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…