
Vijayawada Deputy Mayor Election 2026
విజయవాడ మేయర్‌గా జనసేనకు చెందిన వంగవీటి రాధాకృష్ణ ఎన్నిక ఒక సంచలనం. సోమవారం డిప్యూటీ మేయర్‌ని కార్పొరేటర్లు ఎన్నుకోబోతున్నారు. అధిష్టానం చేత ఎవరు ‘మమ’ అనిపించుకుంటే వారికే పదవి దక్కుతుంది. కనుక ఈ పదవి కోసం టీడీపీలోనే ఏకంగా పది మంది పోటీ పడుతున్నట్లు సమాచారం.
అయితే ఇక్కడ కొన్ని లెక్కలున్నాయి. మేయర్ పదవి కాపులకు దక్కింది కనుక డిప్యూటీ మేయర్ పదవి కమ్మగా ఉండాలని టీడీపిలో ఆశావాహులు పట్టుబడుతున్నారు.
మేయర్ పదవికి పురుషుడికి దక్కింది కనుక ఈ పదవి మహిళలకే ఇవ్వాలని మూడు పార్టీలలో మహిళా ఆశవాహులు వాదిస్తున్నారు. కనుక జనసేన వీర మహిళలు కూడా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.
కనీసం ఈ డిప్యూటీ మేయర్ పదవి అయినా తమకు ఇవ్వాలని బిజేపి ఆశావహులు కోరుకుంటున్నారు. ‘కమ్మ, కాపులతో బాటు మేము కూడా ఉన్నామని గుర్తుంచుకొండి’ అంటూ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉమ్మడి చంటి, నాగేశ్వరరావు, ఎనబోతు సుజాత తదితరులు అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
తొలుత బీజేపీకి చెందిన అడ్డూరి శ్రీరామ్ అనుకున్నప్పటికీ, అయితే తాజా సమాచారం ప్రకారం డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కనుక టీడీపీ కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, జాసిరి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి కాంతి శ్రీ, దేవినేని నాగ మహిత, వీరమాచినేని లలిత ఈ పదవికి పోటీ పడుతున్నారు. వీరిలో పలువురు గతంలో కార్పొరేటర్లుగా పనిచేసిన అనుభవం ఉన్నవారు కూడా ఉన్నారు. కనుక ఈ పదవికి తామే అర్హులమని భావిస్తున్నారు.
కనుక, కమ్మ, కాపు, బీసీ, పురుష, మహిళ, కార్పొరేటర్ల అనుభవం, రాజకీయ బలం.. ఇలా అనేక లెక్కలు చూసుకొని అనేక వడపోతల తర్వాత ఎంపిక చేయాల్సి ఉంటుంది.
డిప్యూటీ మేయర్‌కు మేయర్ సరిసమానమైన ప్రోటోకాల్ మర్యాదలు, అధికారిక ఛాంబర్, వాహనం వంటివి ఉంటాయి. మేయర్ అందుబాటులో లేనప్పుడు ఆయన స్థానంలో డిప్యూటీ మేయర్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తారు.
కనుక ఈ పదవికి చాలా పోటీ నెలకొంది. ఈ పదవి లభించనివారికి కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులు, పార్కులు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం వంటి అంశాల్లో ఏర్పాటు చేసే స్టాండింగ్ కమిటీలలో అవకాశం లభించవచ్చు.
ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, సుజనా చౌదరి, బోండా ఉమ, బుద్ధా వెంకన్న తదితర నేతలు ఈ అంశంపై ఇప్పటికే కొందరి పేర్లు అనుకున్నారు. మేయర్ వంగవీటి రాధాకృష్ణ కూడా తన అభిప్రాయం తెలియజేశారు.
సోమవారం ఉదయం ముందుగా మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. అయితే అప్పటికే ఒకరి పేరు ఖరారు చేయబడుతుంది కనుక ఇది కేవలం లాంచనమే.
మూడు పార్టీలు, అనేక రకాల సమీకరణలు, సుమారు డజనుకు పైగా ఆశావహులు.. వారిలో నుంచి ఎవరికి ఈ అవకాశం దక్కుతుంది? ఈరోజు సాయంత్రంలోగా ఈ సస్పెన్స్ వీడవచ్చు.
The South Indian social media space is frequently loaded with discussions and debates about the…
Nara Lokesh's visit to Chennai drew attention for two different reasons. It came just a…