
Skyroot Aerospace's Vikram-1 rocket lifted off successfully from Sriharikota, marking India's first successful private orbital rocket mission.
భారత అంతరిక్ష చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం ఇది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్‌టెక్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ తయారు చేసిన విక్రమ్-1 రాకెట్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది.
దేశంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ ఈ రాకెట్ తయారు చేయడం, దానిని ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం రెండూ అపురూపమైన ఘట్టాలే.
ఓ భారతీయ ప్రైవేట్ సంస్థ తొలిసారిగా పూర్తిస్థాయి ఆర్బిటల్ రాకెట్‌ను రూపొందించి విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడం భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయమనే చెప్పవచ్చు.
‘మిషన్ ఆగమన్’ పేరుతో విక్రమ్-1 రాకెట్ భూమికి సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులో పలు పేలోడ్లను విజయవంతంగా ప్రవేశపెట్టింది.
విక్రమ్-1లో మరో విశేషమేమిటంటే ఇది మూడు దశలలో ఘన ఇంధనంతో, చివరి దశలో ద్రవ ఇంజిన్‌తో పనిచేస్తుంది. మళ్ళీ ఇక్కడా మరో ప్రత్యేకత ఉంది. చివరి దశ మాడ్యూల్ ‘3డీ ప్రింట్’ చేశారు. ఈ 3డీ ప్రింటెడ్ మాడ్యూల్ స్వయంగా ‘ఆర్బిటల్ అడ్జస్ట్‌మెంట్స్’ చేసుకోగలగడం మరో ప్రత్యేకత.
ఈ చివరి దశ మాడ్యూల్ కూడా అనుకున్న విధంగానే అద్భుతంగా పనిచేయడంతో ఈ విజయం మరింత గొప్పగా మారింది.
తక్కువ ఖర్చుతో, వేగంగా చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చేలా ఈ విక్రమ్-1 రాకెట్‌ను రూపొందించారు. ఇది విజయవంతం అవడంతో భవిష్యత్‌లో ‘స్మాల్ శాటిలైట్ లాంచింగ్ మార్కెట్’లోకి మరిన్ని భారతీయ కంపెనీలకు ఇది అవకాశాలను సృష్టిస్తుంది.
తెలంగాణ (హైదరాబాద్) గడ్డపై తయారైన ఈ రాకెట్ ఆంధ్ర గడ్డ (శ్రీహరికోట)మీద నుంచి అంతరిక్షంలోకి దూసుకుపోవడంతో ఈ విజయంలో రెండు రాష్ట్రాలు భాగస్వాములుగా మారాయి.
ఇస్రో సాంకేతిక అనుభవం, ప్రైవేట్ సంస్థల కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు కలిస్తే అంతరిక్ష రంగంలో ప్రపంచంలోని అగ్రదేశాలతో భారత్ పోటీ పడగలదనే విశ్వాసాన్ని విక్రమ్-1 విజయం కలిగించింది.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…