
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత, టిడిపిని ఎన్డీయేలో చేరవచ్చన్నట్లు చెప్పారు. అంటే ఏపీలో టిడిపి, జనసేనలతో బీజేపీ కూడా కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉందని అర్దమవుతోంది.
అయితే బీజేపీతో సీట్ల సర్దుబాట్లు చేసుకొనేందుకు టిడిపి, జనసేనలు అంతర్గతంగా చర్చించుకోవలసి ఉంటుంది. కనుక కొంత సమయం అవసరం. అందుకే ఇంతవరకు బీజేపీతో టిడిపి పొత్తు గురించి అధికారిక ప్రకటన చేయలేదనుకుంటే, నేడు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ “ఎవరినో ముఖ్యమంత్రులను చేసే పని మాది కాదు. జాతీయపార్టీగా దేశాన్ని నడిపిస్తున్న బీజేపీకి ఎవరినో ముఖ్యమంత్రులను చేయాల్సిన అవసరం ఏమిటి?ఏపీలో తప్పనిసరిగా బీజేపీ ముఖ్యమంత్రి కావాల్సిందే. ఏపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావాల్సిందే.
2014, 2019 ఎన్నికలలో పరిస్థితులు వేరు. ఇప్పుడు 2024 ఎన్నికలలో పరిస్థితులు వేరు. ఏపీలో మా పార్టీ బలహీనంగా ఉందని చెప్పేవాళ్ళకి ఒకటే ప్రశ్న. మా పార్టీ బలహీనంగా ఉంటే, ఈరోజు ఢిల్లీకి పోయి ఎవరు ఎవరి అపాయింట్మెంట్స్ కోరుతున్నారు? ఎవరు ఎవరి కోసం ఎదురుచూస్తున్నారు?ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకోవాలని ఢిల్లీలో మా పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు?” అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబు-అమిత్ షాల భేటీ జరిగిన తర్వాత ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ నోట ఇటువంటి మాటలు వినిపించడం ఆశ్చర్యంగానే ఉంది. కానీ బీజేపీ అడిగినన్ని సీట్లు టిడిపి, జనసేనలు ఇవ్వలేకపోవడంతో టిడిపి-బీజేపీల మద్య పొత్తులు కుదరలేదేమో?అనే సందేహం కలిగిస్తున్నాయి ఆయన మాటలు.
ఇక ఏపీలో బీజేపీకి పెద్దగా బలం, జనాధరణ రెండూ లేకపోవడం వలననే, ఒంటరిగా పోటీ చేయలేకనే జనసేనతో పొత్తులు పెట్టుకుందనే విషయం అందరికీ తెలుసు.
ఏపీలో బీజేపీకి బలం లేకపోయినా టిడిపి, జనసేన, వైసీపిలు ఢిల్లీ పెద్దలను ఎందుకు కలుస్తున్నారో విష్ణువర్ధన్ రెడ్డికి తెలియదనుకోలేము.
ఒకవేళ వైసీపి ఎన్నికలలో ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండి ఉంటే, టిడిపి, జనసేనలు బీజేపీతో పొత్తు ఆలోచనలు చేసి ఉండేవే కావు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరుగుతాయని నమ్మకం కలిగి ఉండి ఉంటే కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు ఆశించేవే కావు.
అదే విదంగా టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకోకుండా ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో కేంద్రం సహాయసహకారాలు కోరేవారేకారు. ఇవన్నీ ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడుగా పనిచేస్తునా విష్ణువర్ధన్ రెడ్డికి తెలియదనుకోలేము.
కానీ ఏపీలో బీజేపీ చాలా బలపడినందునే టిడిపి, జనసేన, వైసీపిలు మూడూ తమ చుట్టూ తిరుగుతున్నాయని గొప్పలు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది… కదా?
A film's release is no longer the only way for a new heroine to get…
Vijay Deverakonda is confident about his comeback with Ranabaali and has a strong message for…