
సంచలనం సృష్టించిన పెద్ద పెద్ద కేసులలో పెద్ద మలుపు అంటూ తరచూ వార్తలు వినపడుతుంటాయి. కానీ ఏ ఒక్క కేసులో దోషులను నిర్ధారించి శిక్షలు వేసిన దాఖలాలు లేవు, అది వివేకా హత్య, అక్రమాస్తుల కేసు, మద్యం కుంభకోణం కేసు ఏదైనా కావచ్చు. అన్ని కేసులు అలా మలుపులు తిరుగుతూ ఏళ్ళ తరబడి సాగుతూనే ఉంటాయి.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటిలో కొన్ని అటకెక్కిపోతుంటాయి. మరికొన్నిటి బ్రేకులు వేసినట్లు స్పీడు తగ్గిపోతుంది. అవి అలా సాగుతుండగానే మళ్ళీ కొత్త కేసులు పుట్టుకొస్తాయి. వాటి గురించి మీడియాలో సంచలనం, ప్రకంపనలు… అంటూ వార్తలు ప్రజలకు కాలక్షేపం కలిగిస్తుంటాయి.
సామాన్య ప్రజలు హత్యకు గురయితే పోలీసులు కొన్ని గంటలు, రోజులు, వారాలలో దోషులను పట్టుకొని జైలుకి పంపించగలరు. కానీ వైఎస్ వివేకానంద రెడ్డి వంటి రాజకీయ ప్రముఖుడు హత్య జరిగి ఆరేళ్ళు గడిచినా ఇంతవరకు దోషులకు శిక్షలు పడలేదు. పడే అవకాశం కూడా లేదు. ఎందువల్లనంటే రామాయణ, మహా భారతాలలో పిట్ట కధలున్నట్లుగానే ఈ కేసులో అనేక పిట్ట కేసులున్నాయి. ఒకవేళ అవి కొలిక్కి వస్తే మరిన్ని పిటిషన్లు పడతాయి.
ఇంతకీ విషయమేమిటంటే, నాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కేసులో బాధితులుగా ఉన్న వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖ రెడ్డి, ఈ కేసు విచారణ జరిపిన సీబీఐ ఎస్పీ రాంసింగ్ తదితరులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు.
వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశం మేరకు డీఎస్పీ మురళీ నాయక్ విచారణ జరిపారు. వారిపై తప్పుడు కేసులను మూసివేశారు.
వారిపై తప్పుడు కేసులు నమోదు చేసిన రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్సై రామకృష్ణా రెడ్డిలపై తాజాగా కేసులు నమోదు చేశారు.
వివేకా హంతకులను అరెస్ట్ చేసి శిక్షలు పడేలా చేయాల్సి ఉండగా, ఇలా ఒక్కో చిక్కుముడి విప్పుకుంటూ కాలక్షేపం చేయాల్సి వస్తోంది. నిజానికి ఈ కేసు విచారణ ఎన్నటికీ ముందుకు సాగకుండా, పూర్తి కాకుండా ఉంచేందుకే నిందితులు బహుశః ఇలా చిక్కుముళ్ళు వేశారేమో?
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…