
ఇది రాష్ట్ర సచివాలయం పరిపాలనా విభాగం కనుక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లాంటి చిన్న పోస్టులు కొన్ని తప్ప దానిలో అత్యధిక ఉద్యోగాలకు లోకల్ కోటా ఉండదు, ఉద్యోగాల భర్తీ రాష్ట్రం అంతా యూనిట్ గా తీసుకుని జరుగుతాయి. అలా కాదు ఇక్కడకు మార్చడం వల్ల 50% లోకల్ కోటా పెట్టి ఉత్తరాంధ్ర ప్రజలకు సగం ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పలేదు? పోనీ అలా ఒక ప్రకటన చేస్తే మంత్రిగారి మాటలకు అర్దం ఉంది. కొత్త ఉద్యోగాలు రాకుండా, ఒకచోట ఉన్న ఉద్యోగులను ఇక్కడికి తెచ్చి, ఖాళీల భర్తీ కూడా రాష్ట్రం మెుత్తం నుంచి ఎంపిక చేస్తే, మరి దీని వల్ల విశాఖకు కానీ ఉత్తరాంధ్రకు కానీ కొత్త ఉద్యోగాలు ఎలా నచ్చినట్టు?. స్ధానికులకు ఉద్యోగాలు రావాలంటే గతంలో ముందుకు వచ్చిన అదానీ డేటా సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్ఫోసిస్, లులూ వంటి వేలాది ఉద్యోగాలు కల్పించే కంపనీలు ఇక్కడ తమ సంస్థలు ఏర్పాటు కాకుండా అవరోధాలు కల్పించినపుడు గట్టిగా మాట్లాడాల్సింది. ఆ సంస్థలు పూర్తి స్ధాయిలా ఏర్పాటైతే ఉత్తరాంధ్రలో ఓ తరం స్ధానికంగా ఉద్యోగాలు పొందగలిగేది.
ఈ కార్యనిర్వాహక సంస్థలను ఇక్కడికి మార్చడం వల్ల ఈ ప్రాంతానికి వచ్చే ఉపయెూగం ఏమిటనేది చూస్తే, కొత్తగా వచ్చే ఉద్యోగులకు ఇళ్లు కావాలి, దాని వల్ల రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ పెరిగితే ఎవరికి లాభమెూ గత రెండు మూడేళ్ళలో విశాఖ, ఉత్తరాంధ్రలలో భూములు సంపాదించిన వ్యక్తుల వివరాలు చూస్తే అర్ధం అవుతుంది. ఇంక ఉద్యోగాలు అంటే కొత్తగా వచ్చే ఈ ఉద్యోగుల అవసరాలు తీర్చడానికి కొన్ని షాపింగ్ మాల్స్, హోటల్స్ వంటి వ్యాపారాలు రావచ్చు. వాటిలో పని చేసే తక్కువ స్కిల్ ఉండే జాబులు రావచ్చు. ఇంక రోజువారీ లాండ్రీ, వాచ్మేన్, సెలూన్, చాయ్ దుకాణం, కిరాణా అంగడి వంటి పనులు కొన్ని రావచ్చు.
అంటే ఈ పనులు హైదరాబాద్ వెళ్లి చేసేది ఇక్కడ చేస్తారు, ప్రతి యాబై మందికి ఇటువంటి తక్కువ నైపుణ్యం ఉన్న ఉద్యోగాలు సుమారుగా ఒకటి అనుకుంటే 50 వేల సచివాలయ ఉద్యోగులకు కేవలం ఒక 1000 మందికి ఉపాధి కలగవచ్చు. దీనిని బట్టి ఈ మార్పువల్ల లాభపడేది రియల్ ఎస్టేట్ వాళ్లు, గత వారం రోజులుగా విశాఖ భూ దందా మీద వస్తున్న వార్తలు చూస్తే విషయం దీని వెనుక లబ్దిదారులు ఎవరనేది తేటతెల్లం. ఎవరో కబ్జాదారుల బాగు కోసం ఇక్కడి నాయకులు ఎందుకు ప్రజలను రెచ్చగొట్టి వాళ్ల భవిష్యత్ కబ్జాదారుల చేతిలో ఎందుకు పెడుతున్నారో ఆలోచించాలి. నిజాయితీకి, మంచితనానికి మారుపేరుగా ఉండే ఈ ప్రాంతంలో దేవుడి దర్శనానికి వచ్చే వారిపై రాజకీయ ప్రయెూజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టే చర్యల వల్ల ఈ ప్రాంతానికి చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తెరగాలి.
శ్రీ కాంత్ సి
Vijay Deverakonda's latest release Ranabaali is trying to hold well at the box office after…
YS Jagan Mohan Reddy’s latest statements have raised questions about his political consistency. The YSRCP…