
మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. దీని కోసమే ఊర్ల నుంచి పట్టణాలకు వచ్చి హాస్టల్స్‌లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నవారు, వయోపరిమిత మించి పోతోందని ఆందోళన చెందుతూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నవారు లక్షల మంది ఉన్నారు.
వారందరూ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగానే అప్పుడే తమకు ఉద్యోగాలు వచ్చేసినట్లు చాలా సంతోషపడుతూ దరఖాస్తు చేసుకుంటున్నారు. వచ్చే నెల 15 వ తేదీ వరకు దరఖాస్తు గడువు ఉంది కనుక ప్రతీరోజూ వేలాది దరఖాస్తులు అందుతున్నాయి.
అయితే మెగా డీఎస్సీకి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన బీఈడీ, డీఈడీ చేసిన అభ్యర్ధులకు గుబులు పుట్టిస్తోంది. సుమారు రెండు లక్షల మంది టెట్ పరీక్షలు వ్రాయలేకపోయారు. ఒకవేళ వ్రాసినా ఉత్తీర్ణులు కాలేకపోయారు.
కనుక ఇంతకాలం ఎదురు చూసి ఇప్పుడు చేతికి అందివచ్చిన ఈ సువర్ణావకాశం చేజారిపోతోందని వారందరూ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా మూడు నెలలలోనే ఈ డీఎస్సీ ప్రక్రియ మొత్తం ముగించి అర్హత సాధించిన వారికి నియామక పత్రాలు ఇవ్వాలని సిఎం చంద్రబాబు నాయుడు డెడ్‌లైన్ పెట్టడంతో, కేవలం మూడు నెలల్లోనే ప్రభుత్వోద్యోగం సాధించే అవకాశం కోల్పోతున్నందుకు మరింత నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.
సాధారణంగా ఏటా సెప్టెంబర్-అక్టోబర్, మార్చి-ఏప్రిల్ మద్య రెండు సార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తుంటుంది. కానీ ఈసారి టెట్ పరీక్షలకు ముందే మెగా డీఎస్సీ ప్రకటన జారీ అవడంతో టెట్ పరీక్షలు వ్రాసేందుకు సిద్దంగా ఉన్న అభ్యర్ధులు అందరూ ఫలితాలు వచ్చే సరికి డీఎస్సీ దరఖాస్తుల గడువు ముగిసిపోతుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కనుక మెగా డీఎస్సీ దరఖాస్తు గడువుని మరో రెండు నెలలు పొడిగించి ముందుగా టెట్ పరీక్షలు నిర్వహించాలని సిఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా మంత్రులకి ఈ మెయిల్స్, వాట్సప్ తదితర మాద్యమాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.
మరికొందరు స్థానిక ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, టీడీపీ నేతలను కలిసి తమ గోడు మొరపెట్టుకుంటున్నారు. ఈ మెగాడీఎస్సీ చేజారిపోతే మళ్ళీ ఎన్నటికీ ఈ ఉద్యోగాలు సాధించే అవకాశం లభించదని, కనుక ముందుగా టెట్ పరీక్షలు నిర్వహించి , వాటి ఫలితాలు వచ్చే వరకు మెగాడీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగించాలని వేడుకుంటున్నారు.
మరి వారి గోడు సిఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెవికి చేరుతుందో లేదో?చేరితే ఏం నిర్ణయం తీసుకుంటారో?
మెగా డీఎస్సీ షెడ్యూల్:
ఏప్రిల్ 20-మే 15 వరకు: దరఖాస్తుల స్వీకరణ
మే 20 నుంచి: నమూనా పరీక్షలు
మే 30 నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్
జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు
జూలై 8 లేదా 9 న ప్రాధమిక కీ విడుదల
జూలై 15-16 తేదీల వరకు: అభ్యంతరాలు
జూలై 21-22 తేదీలలో ఫైనల్ కీ
జూలై 27-28 తేదీలలో అర్హత సాధించిన మెరిట్ అభ్యర్ధుల జాబితా ప్రకటన.
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…
Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…