
ప్రపంచంలో అనేక మతాలు… నమ్మకాలు… ఆచారాలు. ఏ మతంలో వారైనా నాకు ఆయురారోగ్యాలు కావాలి… మంచి ఉద్యోగం, సంపాదన, ఇళ్ళు, కార్లు, భార్య/భర్త/పిల్లలు కావాలి… నా సమస్యలన్నీ తీరిపోవాలి… నేను సుఖంగా జీవించాలి.. బోలెడంత పుణ్యం కావాలి… మోక్షం కావాలంటూ పెద్ద జాబితాతో గుడికి వెళతారు. అయితే ఈ కోర్కెలు, సమస్యల జాబితా ఎన్నటికీ పూర్తవదు. ఒకటి తీరితే మరోటి మొదలవుతుంది.
మానవులు తమ పరిధికి మించి ఆలోచించలేరు. అందుకే దేవుళ్ళకు కానుకల రూపంలో లంచం ఇస్తుంటారు. మనుషుల దృష్టిలో బంగారం చాలా విలువైనది. కనుక బంగారు కిరీటాలు, గోపురాలు, ఆభరణాలు చేయించి ఇస్తూ అదే అత్యుత్తమైన భక్తిమార్గం అనుకుంటారు. కానీ దేవుడికి డబ్బు, బంగారం అవసరమా? అంటే కాదనే తెలుసు.
మనిషి తాను చాలా గొప్పదనుకొన్నదే లేదా తనకు చాలా ఇష్టమినదే దేవుడికి సమర్పించుకుంటాడు. అప్పుడు దేవుడు ప్రసన్నమై తన సమస్యలు, కోర్కెలన్నీ తీర్చేస్తాడనే నమ్మకంతో చేస్తుంటాడు.
షిరిడీ సాయి బాబా చాలా నిరాడంబరంగా జీవించారు. కానీ భక్తులు ఇప్పుడు ఆయనని బంగారంతో ముంచెత్తుతున్నారు. సాయి పారాయణం కూడా చేస్తారు. ఆయన గొప్పదనం గురించి మాట్లాడుకుంటారు. కానీ అయన చూపిన మార్గంలో ఎవరూ నడవరు.
తిరుమలలో భక్తులు గుండు కొట్టించుకుంటారు. ఆ దేవుడికి మన జుట్టు అవసరం లేదు. కానీ ఎందుకు సమర్పిస్తున్నాము?అని ఆలోచిస్తే దానిలో ఓ పరమార్ధం కనిపిస్తుంది.
అది మనిషి అహాన్ని త్యజించడానికి ప్రతీకగా భావించవచ్చు. లేదా చరాచర సృష్టిని నడిపిస్తున్న నీ ముందు నేను దాసోహమని మనిషి అంగీకరిస్తునట్లు భావించవచ్చు. కానీ అదే మొక్కు లేదా భక్తి అనుకుంటాము. కానీ ఇలాంటి పరమార్ధం కూడా తెలుసుకుంటే భక్తిలో పరిపక్వత వస్తుంది.
చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా?అనే ప్రశ్న ఈనాటిది కాదు. కనుక భగవత్ దర్శనం కంటే ముందు మనసులో భక్తి, నమ్మకం ముఖ్యం.
సకల పాపాలు చేస్తూ హుండీలో డబ్బులు వేసి దేవుడికి దణ్ణం పెట్టినా, ఏదో రోజు పాప ప్రక్షాళన చేసుకోక తప్పదని గ్రహిస్తే తప్పకుండా మనిషి మారతాడు. నిజానికి ఆ పాప చింతన, భయమే మనిషిని దేవుడి దగ్గరకు నడిపిస్తోంది. కనిపించని ఆ దేవుడిని ఆశ్రయించేలా చేస్తోంది కదా?
కనుక దేవుడి వద్దకు కోర్కెల జాబితాతో వెళ్ళడం కాదు… భక్తితో వెళ్ళాలి. భక్తితోనే దర్శించుకోవాలి. అప్పుడు ఆ అనుభూతి వేరేలా ఉంటుంది… అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారు చెపుతుంటారు.
మనిషి ఆలోచనలను ఒకే ఒక్క క్షణం అదుపు చేయగలడా? చేయగలిగితే గొప్ప విషయమే. చేయలేనప్పుడు దైవ సన్నిధిలో లేదా దైవ ప్రార్ధనలో అదుపు అవుతాయి. తద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది.
మనుషులు తమ కర్తవ్యం, బాధ్యతలు నిర్వర్తించకుండా దేవుడిని సాయపడమని కోరితే అశాంతి, సమస్యలు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. ఎందుకంటే సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత దేవుడిది కాదు మనుషులదే. కనుక భక్తితో దేవుడిని దర్శించుకోవాలి తప్ప కోర్కెలతో కాదు. ఆ భక్తి మనసుతో ప్రారంభమై ఆలయంలో ముగియకూడదు. జీవితాలను సరిదిద్దాలి. అప్పుడే అది పరిపూర్ణమవుతుంది.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…