
ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బిహార్ సిఎం నితీష్ కుమార్‌లతో సహా ఎన్డీయే భాగస్వాములు అందరూ హాజరుకాబోతున్నారు. ఇది అందరికీ తెలిసినదే.
కానీ ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన వార్త సర్వత్రా వినిపిస్తోంది. అదే… నితీష్ కుమార్‌కి ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేసిందనే వార్త!
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకి 272 సీట్లు అవసరం కాగా ఎన్డీయేకి 293, ఇండియా కూటమికి 234 వచ్చాయి. కనుక బిహార్‌లోని జేడీయూ, ఏపీలోని టిడిపిని కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇండియా కూటమి ప్రయత్నించడం సహజమే.
ఆ ప్రయత్నంలో నితీష్ కుమార్‌కి ప్రధాని పదవి ఇస్తామని ఇండియా కూటమి ఆఫర్ చేసిందని జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి చెప్పారు. కానీ తమ అధినేత నితీష్ కుమార్ ఆ ఆఫర్ తిరస్కరించారని, తాము ఎన్డీయే కూటమితోనే ఉంటూ బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంపాదించడానికి గట్టిగా ప్రయత్నిస్తామని చెప్పారు.
ఎప్పటికైనా ప్రధాని కావాలని నితీష్ కుమార్ కలలు కన్నారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం వస్తే వద్దనుకున్నారు. ఆయన ఏ కారణంతో వద్దనుకున్నప్పటికీ బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని మోడీ ప్రభుత్వంపై భవిష్యత్‌లో ఒత్తిడి చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
కానీ బిహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తే అది అక్కడితో ఆగేది కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడుపై కూడా ఒత్తిడి పెరిగి, ఆయన కూడా ఏపీకి ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టవలసి రావచ్చు. దేశంలో ఇంకా చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నాయి. కనుక బిహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తే అది తేనెతుట్టెని కదిలించిన్నట్లే అవుతుంది.
కనుక ప్రధాని నరేంద్రమోడీ నితీష్ కుమార్‌కి నచ్చజెప్పుకోక తప్పదు లేదా బిహార్‌తో పాటు ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఇవ్వక తప్పదు.
నిలకడలేని నితీష్ కుమార్ భవిష్యత్‌లో ఎన్డీయే వీడేందుకు ప్రత్యేక హోదా అనే సాకుని ఇప్పుడే సిద్దం చేసి పెట్టుకున్నట్లుగా కూడా భావించవచ్చు. నిలకడలేని నితీష్ కుమార్ ఎన్డీయేలో భాగస్వామిగా ఉండటం వలన చంద్రబాబు నాయుడు మరింత కీలకంగా మారుతారు అప్పుడు ఎన్డీయేలో ఆయన ప్రాధాన్యత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే నితీష్ కుమార్ వలననే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఏపీకి, చంద్రబాబు నాయుడుకి మంచి రోజులు వచ్చిన్నట్లే.
YS Jagan has been very successful when it comes to mitigating the legal and judicial…
Actor Suriya has a message for students who spend too much time making reels, focus…