
YS Family Property Dispute Raises Questions for KCR
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా అటు కర్ణాటకలో కూడా హాట్ టాపిక్ గా మారిన వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదాలు ఒక కీలకమైన విషయాన్నీ గుర్తుచేస్తున్నాయి.కుటుంబాల్లో వారసత్వ ఆస్తుల పంపకాలు ఎంత పారదర్శకంగా ఉండాలి? భవిష్యత్ లో పిల్ల మధ్య విభేదాలు తలెత్తకుండా తల్లిదండ్రులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి? అనే ప్రశ్నలకు ఈ వివాదం వేదికగా మారింది.
ప్రస్తుతం బెంగళూరులోని యలహంక పాలస్ కేంద్రంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులు జగన్, షర్మిల మధ్య సాగుతున్న ఆస్తుల వివాదం చివరికి న్యాయస్థానం గడప తొక్కింది. ఇన్నాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల మీడియాలో చర్చకు పరిమితమైన ఈ కుటుంబ వ్యవహారం ఇప్పుడు కర్ణాటక మీడియాలో కూడా ప్రధాన్యత సంతరించుకుంది.
యలహంక ప్యాలస్ తన తండ్రి ఆస్తిలో తనకు కేటాయించిన వాటాలో భాగమని షర్మిల వాదిస్తుంటే, ఇది తన అత్తగారి కుటుంబానికి సంబంధించిన ఆస్తి అంటూ జగన్ ఆధారాలు చూపిస్తున్నారు. ఇక ఈ వివాదానికి ఎటువంటి పరిష్కారం చూపలేక వైఎస్ సతీమణి విజయలక్ష్మి ఇద్దరి కన్నబిడ్డల మధ్య నలిగిపోతున్నారు.
2019 ఎన్నికల తరువాత మొదలైన ఈ వైఎస్ కుటుంబ పంచాయతీ నానాటికీ మరింత చిక్కుముడిలా బలపడుతూ అన్నాచెల్లెళ్ల బంధాన్ని మరింత బలహీన పరుస్తుంది. అయితే అసలు వైఎస్ జీవించి ఉన్నప్పుడే ఆస్తుల పంపకాల విషయంలో కుటుంబ సభ్యులందరికి స్పష్టత ఇచ్చి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది.
అయితే నాడు వైఎస్ జీవించి ఉన్నప్పుడు జగన్, షర్మిల మధ్య ఇటువంటి రాజకీయ, వ్యక్తిగత వివాదాలు కానీ విభేదాలు కానీ లేవు. కానీ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం తరువాత మారిన రాజకీయ పరిస్థితులు, జగన్ సీఎం పదవితో మారిన కుటుంబ సంబంధాలు వైఎస్ కుటుంబంలో ఇంతటి ప్రకంపనలను సృష్టించనున్నాయి అనేది నాడు ఎవ్వరు ఉహించి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా ప్రమాదపు అంచున ఉన్నట్టు కనిపిస్తున్నాయి.
ఇటువంటి పరిస్థితులలో వైఎస్ కుటుంబ వివాదాలను దృష్టిలో ఉంచుకుని కల్వకుంట్ల అప్రమత్తం అవుతుందా? చేతులు కాలాక ఆకులు పట్టుకునే చందాన కాకుండా చేతులు కాలకుండానే జాగ్రత్త పడడం కల్వకుంట్ల కుటుంబానికి సాధ్యమవుతుందా?
ఇక్కడ కేసీఆర్ జీవించి ఉండగానే ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత మధ్య రాజకీయ, వ్యక్తిగత వివాదాలు, విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి. అలాగే ఇటు కేసీఆర్ సైతం కవిత విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలే తీసుకున్నారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, పార్టీ పగ్గాలు కేటీఆర్ కి అప్పగించే కార్యక్రమాలు మొదలుపెట్టడం వంటి నిర్ణయాలతో కవిత అటు బిఆర్ఎస్ పార్టీతో పాటుగా ఇటు కల్వకుంట్ల కుటుంబానికి కూడా దూరమయ్యారు.
దీనితో కవిత తండ్రి కేసీఆర్ ని వ్యతిరేకిస్తూ, అన్న కేటీఆర్ కి వ్యతిరేకంగా తెలంగాణ రక్షణ సేన పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన ఈ రాజకీయ దూరం రేపటి రోజున మరో రూపంలోకి మారకుండా కేసీఆర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారా? వైఎస్ వారసుల ఆస్తి తగాదాలు కల్వకుంట్ల కుటుంబానికి హెచ్చరిక కానుందా?
ఈ నేపథ్యంలో రేపటి రోజున కల్వకుంట్ల కుటుంబం కూడా ఇప్పుడు వైఎస్ కుటుంబం మాదిరే తండ్రి వారసత్వ ఆస్తుల కోసం, హక్కుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించకుండా, మీడియా వార్తల్లో నిలవకుండా, తమ రాజకీయ ప్రత్యర్థుల ముందు దోషిగా నిలబడకుండా కేసీఆర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారా? తన హయాంలోనే ఈ అన్నాచెల్లళ్ల మధ్య ఉన్న ఉమ్మడి ఆర్థిక వ్యహారాలను సర్దుబాటు చేస్తారా?
Keerthy Suresh's courtroom drama film Sathyavan Savithiri directed by Praveen S Vijaay was released in…
Naga Chaitanya celebrates his birthday today, marking another year in a career that has seen…