
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ న్యూస్ ఛానల్, న్యూస్ పేపర్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైసీపి ప్రకటనలు కనిపిస్తున్నాయి. చివరికి ప్రజల మొబైల్ ఫోన్లలో ఏదైనా యూట్యూబ్ లేదా మరేదైనా యాప్ ఓపెన్ చేస్తే ముందుగా జగన్ గొప్పలు వినాల్సిందే.
ఒకవేళ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉండి ఉంటే ప్రజలు తప్పకుండా ఆయన చెప్పేది ఓపికగా వినేవారు. కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెపుతున్న మాటలను వినేందుకే ఆసక్తి చూపుతున్నారు తప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు వినేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడం గమనిస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్దమవుతుంది.
ఇక మీడియాలో ఊదరగొడుతున్న ప్రకటనలలో రాష్ట్ర వ్యాప్తంగా 15,005 గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశామని, ఈ 5 ఏళ్లలో 6,45,410 మందికి ఉద్యోగాలు కల్పించామని, రాష్ట్రంలో స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసేందుకు, మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణాలకు వేలకోట్లు ఖర్చు చేశామని వాటి సారాంశం.
సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలనే గొప్ప ఆలోచన చేసిన జగన్ ప్రభుత్వానికి, రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయకపోవడం విడ్డూరంగానే ఉంది కదా? తాము విశాఖను రాజధాని చేస్తామంటే చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని అడ్డుకుంటున్నారనే సాకుతో అదీ ఏర్పాటు చేయకుండా జగన్ ప్రభుత్వం తప్పించుకుంది. పైగా రూ.400 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి ఋషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాన్ని కూడా వాడుకోకుండా ఖాళీగా వదిలేసింది.
వైసీపి 5 ఏళ్ళపాటు ఆడిన ఈ మూడు ముక్కలాటతో రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోవడంతో జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలే పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోతుంటే నిమ్మకు నీరేత్తిన్నట్లు జగన్ ప్రభుత్వం, 6,45,410 మందికి ఎక్కడ ఎలా ఉద్యోగాలు కల్పించిందో ఎవరికీ తెలీదు.
వైసీపి చెప్పుకుంటున్న ఈ అంకెల గురించి అది ఎవరికీ జవాబు చెప్పుకోనవసరం లేదు కనుక 6 లక్షల బదులు 7 లక్షలో 14 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పుకున్నా పెద్దగా తేడా ఉండదు కదా?వైసీపి చెప్పుకుంటున్నట్లు ఏపీలో ఇంత భారీగా ఉద్యోగాలు కల్పిస్తుంటే యువత ఎందుకు వలసలు పోతోంది?
స్మార్ట్ సిటీల సంగతి దేవుడెరుగు రాష్ట్రంలో ఎక్కడికక్కడ రోడ్లపై పేరుకుపోతున్న చెత్తకుప్పలు, మురుగు కాలువలను కూడా జగన్ ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేక చేతులెత్తేసింది. కానీ ప్రజల నుంచి బలవంతంగా చెత్తపన్ను ముక్కు పిండి మరీ వసూలు చేస్తోంది.
వైసీపి చెప్పుకుంటున్న ఈ గొప్పలకు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు చాలా తేడా ఉందని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. అయినా ‘ఆల్ ఈజ్ వెల్’ అని గొప్పలు చెప్పుకోవడం వైసీపికే చెల్లు. పైగా ఇదే… 5 ఏళ్ళ జగన్ మార్క్ పాలన అని నిసిగ్గుగా చెప్పుకుంటోంది కూడా.
Jana Sena Party’s proposed seat share for Andhra Pradesh urban local body elections has triggered…
Kangana Ranaut's upcoming film Queen Forever has become the subject of a legal dispute over…