Telugu

నిజమే! దేవుడి దయతోనే ఈ ప్రభుత్వం నడుస్తోంది

ఏ ప్రభుత్వమైనా అధినేత సమర్దతతో నడుస్తుంటుంది కానీ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం మాత్రం దేవుడి దయతోనే నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే, అభివృద్ధి, ఆదాయం లేకపోయినా సంక్షేమ పధకాల కోసం సిఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి లక్షలు కోట్లు పుట్టించగలుగుతున్నారో… ఇంకా ఎంతకాలం పుట్టించగలరో ఎవరికీ అంతుపట్టదు.

కనుకనే ప్రతీ పధకం అమలుకు ముందు జగన్ ప్రసంగంలో దేవుడి దయ వలన అనే పదం తప్పక వినిపిస్తుంటుంది. ఈరోజు శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో అమ్మఒడి 3వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ, “నా పాదయాత్రలో రాష్ట్రంలో తల్లులు తమ పిల్లలను చదివించుకోవడానికి పడుతున్న ఆవేదనను చూశాను. అందుకే ఈ అమ్మఒడి పధకంతో ప్రతీ తల్లికి, ప్రతీ పిల్లాడికి ఆర్ధికసాయం అందజేస్తున్నాము. అక్షరాల 43.96 లక్షల మంది తల్లులకు 80 లక్షల మంది విద్యార్దులకు అమ్మఒడి పధకం ద్వారా రూ.6,595 కోట్లు ఇస్తున్నాం. చదువులపై పెట్టే ప్రతీ పైసా పెట్టుబడి ఎంతో పవిత్రమైనది అని నేను భావిస్తాను. దేవుడి దయ వలన ఈ పధకం సజావుగా సాగిపోతోంది,” అని అన్నారు.

ADVERTISEMENT

చదువులపై పెట్టే ప్రతీ పైసా పెట్టుబడి ఎంతో పవిత్రమైనదని భావిస్తున్నప్పుడు ప్రతీ ఏడాది ఆంక్షలు, నిబందనల పేరుతో ఈ పధకంలో లబ్దిదారుల సంఖ్యను ఎందుకు తగ్గిస్తోంది?అనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు. ఎన్నికలలో ఓట్లు రాబట్టుకోవడానికి ఆర్భాటంగా ఇటువంటి పధకాలను ప్రారంభించేసి, వాటి కోసం నిత్యం నిధుల కోసం దేవులాడుకోవలసివస్తుండటమే కారణం. కానీ విద్యార్దులు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలనే మంచి ఆలోచనతోనే 75 శాతం హాజరు తప్పనిసరి చేశామని సిఎం జగన్మోహన్ రెడ్డి సమర్ధించుకొంటున్నారు.

అయితే ఈ పధకాన్ని బియ్యం కార్డులతో, విద్యుత్‌ వినియోగంతో ముడిపెట్టడం దేనికి? అంటే అదీ అర్హులైన లబ్దిదారులకు మాత్రమే ఈ పధకాన్ని అందజేసేందుకు అని జగన్ ప్రభుత్వం సమర్ధించుకొంటోంది. అంటే రేషన్ బియ్యం తినకపోతే, నెలకు 300 కంటే ఎక్కువ యూనిట్లు విద్యుత్‌ వినియోగించుకొంటే జగన్ ప్రభుత్వం దృష్టిలో వారు పేదలు కాదన్న మాట!

పధకాలకు నిధులు సమకూర్చుకోలేక తడబడుతున్న జగన్ ప్రభుత్వం వాటి భారం తగ్గించుకోవడానికే ఎప్పటికప్పుడు ఇటువంటి కొత్త ఎత్తులు వేస్తోందని అందరికీ తెలుసు. కనుక ఈ పధకాలు ఇంకా ఎంతకాలం అమలుచేయగలదో ఆ దేవుడికే ఎరుక. ఈ పధకాల మీదనే వైసీపీ భవిష్యత్‌ ఆధారపడి ఉంది కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ దేవుడి దయ చాలా అవసరం ఉంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas’ Re-Release $13.5: Why US Tickets So Expensive?

Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…

5 hours ago

Karthik Subbaraj’s Dorothy: Will Netflix Release Spark Fresh Controversy?

Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…

6 hours ago