
ప్రొద్దుటూరు కేంద్రంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి… “ఇంతకు మించిన అన్యాయం ఎక్కడైనా ఉందా?” అంటూ ప్రత్యర్థి వర్గాలను ఉద్దేశించి కీలక విమర్శలు చేసారు. అయితే జగన్ పలికిన ‘అన్యాయం’లో ‘న్యాయం’ ఎంత ఉందో ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది.
తన బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు నెత్తిన పెట్టుకున్నారట. రాజకీయ స్వార్ధంతో తన కుటుంబీకులైన చెల్లెళ్లు బాబుకు మద్దతు ఇస్తున్నారట. తన చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడించిన వ్యక్తితో వీరంతా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట.
కలియుగం కాకపోతే ఏంటి ఇదంతా? ఇంతకు మించిన అన్యాయం ఎక్కడైనా ఉందా? అంటూ మరోసారి తనను తాను అర్జునుడిగా పోల్చుకుంటూ పెద్ద పెద్ద ప్రసంగాలే ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. కుటుంబాలను చీల్చే వ్యక్తిగా చంద్రబాబును అభివర్ణిస్తూ ప్రజల నుండి సింపతీ పొందే విధంగా తన ప్రసంగాన్ని రక్తి కట్టించారు.
గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తాను రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసానో పట్టుమని పది వ్యాఖ్యలు కూడా చెప్పలేని జగన్, యధావిధిగా గత ఎన్నికలకు ప్రధాన కేంద్రంగా నిలిచిన వివేకా హత్య కేసును మళ్ళీ వెలుగులోకి తీసుకువచ్చారు. నిజానికి వివేకా హత్య కేసు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డుపడింది ఎవరు? అన్న ప్రశ్న వస్తే దానికి సమాధానం ‘జగన్ అండ్ కో’ వస్తుంది.
రాష్ట్ర పరిధిలో ఉన్న కేసును పరిష్కరించలేక సీబీఐకు అందివ్వడానికి జగన్ ప్రభుత్వం చేసిన తాత్సారం, అలాగే సీబీఐ విచారణకు సహకరించకుండా ‘అవినాష్ అండ్ కో’ పడిన ఆ(నా)రోగ్యకరమైన ఇబ్బందులు ప్రజలకు తెలియనివి కాదు. దీనికి ముఖ్యమంత్రిగా జగన్ అందించిన సహకారం కూడా బహిరంగమే. ఈ కేసు నిమిత్తం ఏకంగా పలుమార్లు జగన్ ఢిల్లీ బాట పట్టిన వైనం అప్పట్లో మీడియాలలో ప్రముఖంగా నిలిచింది.
తన తండ్రికి న్యాయం జరగాలంటూ బయటకు వచ్చిన సునీతను సొంత కుటుంబం అని కూడా ఆలోచించకుండా, తన పార్టీ నేతల చేత విమర్శలు చేయించిన జగన్, నేడు ఎన్నికలు దగ్గరకు వచ్చేపాటికి ‘కుటుంబ చీలికలు’ అంటూ తాను చీల్చిన కుటుంబాన్ని ప్రత్యర్థి రాజకీయ నేతలపై మోపే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలకు మంచి చేసే అలవాటు లేని వారంతా ఏకం అయ్యారని ఆరోపించిన జగన్, ఈ ఐదేళ్లల్లో తాను చేసిన మంచి ఏమిటో మాత్రం వివరించలేకపోయారు. ‘బటన్ నొక్కడం’ మాత్రమే తాను చేసిన అత్యంత మంచి పనిగా భావిస్తోన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారి మాటల గారడీలో ప్రజలు పడతారో లేదో తెలియాలంటే జూన్ మాసం వరకు వేచి చూడాల్సిందే!
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…