
క్రికెట్ లేదా ఫుట్‌బాల్ వంటి క్రీడలలో ముందస్తు జాగ్రత్తగా అదనపు ఆటగాళ్ళని కూడా సిద్దంగా ఉంచుకుంటారు. ఒకవేళ ఏ కారణంగానైనా మ్యాచ్‌లో ఓ క్రీడాకారుడు ఆడలేనప్పుడు అతను లేదా ఆమె స్థానంలో ఆ అదనపు ఆటగాడు ప్రవేశించి ఆడుతాడు. కానీ సాధారణంగా ఆ అదనపు ఆటగాడి అవసరం లేకుండానే మ్యాచ్‌లు పూర్తవుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏపీ కాంగ్రెస్ పార్టీ, దాని అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అటువంటి అదనపు ప్లేయర్ అని చెప్పక తప్పదు. రాష్ట్ర విభజనతోనే కాంగ్రెస్ పార్టీ ఏపీలో నశించి పోయింది. అప్పటి నుంచి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చేవరకు ఏపీలో కాంగ్రెస్ అనే ఓ పార్టీ ఇంకా ఉందనే సంగతి ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు.
ఆమె నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలుస్తుందని ఎవరూ భావించనప్పటికీ, ఆమె రాకతో ఏపీ రాజకీయాలలోకి ఏదో జరుగబోతోందని అందరూ భావించారు.
ఆమె తన అన్న జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతుండటంతో కొన్ని రోజులు ప్రజలందరూ ఆసక్తిగా ఆమె మాటలు విన్నారు. కానీ ఆమె రోజూ అదే పాట పాడుతుండటంతో ప్రజలు ఆమె పట్ల ఆసక్తి కోల్పోయారు.
వైసీపీలో చేరిన కాంగ్రెస్ నేతలను మళ్ళీ వెనక్కు రప్పించి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనే టార్గెట్ ఇచ్చి కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు ఈ పదవి కట్టబెట్టింది. కానీ ఏడాదిన్నరగా ఆమె ఎంత హడావుడి చేస్తున్నా కనీసం ఒక్క ముఖ్య నేతని కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించలేకపోయారు. అలాగే ఎన్నికలలో పోటీ చేసిన కాంగ్రెస్ నేతలతో సహా ఆమె కూడా ఓడిపోయారు. అంటే కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు ఇచ్చిన ఏ ఒక్క టాస్క్ పూర్తి చేయలేకపోయారన్న మాట!
తెలంగాణ రాజకీయాలలో వైఫల్యం చెందిన వైఎస్ షర్మిలకు ఏపీ రాజకీయాలలో ఇటువంటి ఉన్నత పదవితో రెండో అవకాశం లభించినా ఆమె తన సమర్ధత నిరూపించుకోలేకపోయారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆమెని తొలగించి వేరేవారిని నియమించడానికి ఇష్టపడటం లేదు.
రాష్ట్ర రాజకీయాలలో అవశేషంగా ఉన్న ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడం, కేవలం ఆమె మాత్రమే ఏదో రోజు జగన్ కంచుకోటలోకి ప్రవేశించి వైసీపీని కూల్చేసి ఏపీ కాంగ్రెస్‌ని బ్రతికించగలరనే చిన్న ఆశ కాంగ్రెస్ అధిష్టానం ఆమెని తొలగించపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఈ విషయం ఆమెకు కూడా బాగా తెలుసు. అందుకే అదనపు ప్లేయర్‌లా గ్యాలరీలో తాపీగా కూర్చొని రిలాక్స్ అవుతూ, 2:1 నిష్పత్తిలో జగనన్నని, చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో ఆమె ఇదే చేస్తున్నారు.
ఆమె జగన్‌ని విమర్శిస్తుండటం వలన వైసీపీలో ఆయన ధోరణి నచ్చనివారికీ ఆమె ఓ ప్రత్యామ్నాయంగా కనిపించవచ్చు. ఎప్పుడైనా వారిలో కొందరు ఆమె పంచన చేరవచ్చు.
కానీ తన జగనన్న ఏపీలో ఆర్ధిక, రాజకీయ, పారిశ్రామిక, సామాజిక, ప్రకృతి విధ్వంసం చేశారని ఆమె చెపుతున్నప్పుడు, దానిని సరిదిద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టాలని ఎంతగానో కృషి చేస్తున్న సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించడం వలన ప్రజల దృష్టిలో ఆమె గ్రాఫే పడిపోతుందని గ్రహిస్తే మంచిది.
అయినా ఉనికి చాటుకోవడానికి మాట్లాడే ఇటువంటి మాటలతో తన రాజకీయ భవిష్యత్, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌కి ఏమైనా ఉపయోగపడుతుందా?ఇలా ఇంకెంత కాలం కాలక్షేపం చేయాలి? చేసి ఏం సాధించగలను?సాధించకపోతే రాజకీయాలలో ఉండటం అవసరమా? అని వైఎస్ షర్మిల ఆలోచించుకుంటే మంచిదేమో?
Karthi's long pending film Sardar 2 directed by PS Mithran was finally released in theatres…
India will play 14 ODIs before IPL 2027 as the team prepares for the 2027…