
వైఎస్ షర్మిల నిన్న మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో మా పార్టీ ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకోవడం వలననే కాంగ్రెస్ విజయం సాధించగలిగింది. ఒకవేళ మేము ఎన్నికలలో పోటీ చేసి ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చిఉండేవి కావు. ఎన్నికలలో గెలవగలిగేదే కాదు. నన్ను కాంగ్రెస్‌లో చేరమని అప్పుడే అడిగారు. అందుకు నేను అంగీకరించాను. బుధవారం నేను ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలువబోతున్నాను. తిరిగి రాగానే మీడియా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెపుతాను,” అని వైఎస్ షర్మిల అన్నారు.
వైఎస్ షర్మిల అన్నతో విభేదించి తెలంగాణలో మూడేళ్ళు కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్ర చేసినా ప్రజలు పట్టించుకోలేదు. ఆ సమయంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, చివరికి మీడియా కూడా ఆమెను పట్టించుకోలేదు.
ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్న ఆమెకు కాంగ్రెస్ పార్టీ దారి చూపించి ఆదుకొంది. ఆమె పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయమని కోరింది. అందుకు ఆమె వెంటనే సిద్దపడ్డారు.
కానీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు తమకు ఆమె అవసరం లేదని నిష్కర్షగా చెప్పారు. ఒకవేళ ఆమెను చేర్చుకొంటే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ రాజేసి మళ్ళీ గెలుస్తారని, కనుక వైఎస్ షర్మిలని ఏపీ కాంగ్రెస్‌లో చేర్చుకోమని సూచించారు.
అందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా అంగీకరించడంతో వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం, అసహనానికి గురయ్యారు. వెంటనే తమ పార్టీ రాష్ట్రంలో 117 స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించేశారు. కానీ అప్పటికే ఆమెపై నమ్మకం కోల్పోయిన ఆమె పార్టీ నేతలు చాలా మంది బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. మిగిలినవారిలో ఎవరూ ఎన్నికలలో పోటీ చేసేందుకు ముందుకు రాలేదు.
దీంతో తమ కుటుంబంలో ముగ్గురు తప్ప పోటీ చేసేందుకు అభ్యర్ధులు దొరక్క వైఎస్ షర్మిల పోటీ నుంచి విరమించుకొని, వేరే గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఈ విషయాలు అందరికీ తెలుసు కూడా.
కానీ కాంగ్రెస్ కోసమే తాము పోటీ చేయకుండా త్యాగం చేశామని, కనుక తమ వల్లే కాంగ్రెస్ గెలిచిందని వైఎస్ షర్మిల గొప్పలు చెప్పుకోవడం చూసి నవ్వుకోకుండా ఉండగలమా?
Chiranjeevi's Vishwambhara has been waiting for its theatrical release for a long time. Fans are…
Vijay Deverakonda and Rashmika Mandanna visited Tirumala ahead of Ranabaali's release and offered prayers for…