
2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అప్పుడే అయన గుండెపోటు వలన చనిపోయారని అందరినీ నమ్మించాలని వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలు ఫలించి ఉండి ఉంటే, నేడు ఈ కేసు జరుగుతుండేదే కాదు. ఈ కథ ఆనాడే ముగిసిపోయేది.
అప్పుడు ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉండేవో కానీ గుండెపోటు కాదు గొడ్డలి వేట్లు అనే విషయం బయటపడిన తర్వాత దాంతో కూడా వైసీపీయే లబ్ది పొందింది… అది మరో విశేషం!
ఆత్మీయులు హత్యకు గురైతే సామాన్య ప్రజలు కూడా న్యాయం కోసం పోలీసులు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. ఆ లెక్కన సొంత బాబాయ్ అంత దారుణంగా హత్యకు గురైతే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మరెంత ఇదిగా వ్యవహరించాలి?
చేతిలో పోలీసులు, యంత్రాంగం అన్నీ ఉన్నందున జగన్ తలుచుకుంటే రెండు మూడు నెలల్లోనే కేసు విచారణ పూర్తయ్యేది. కానీ సీబీఐ విచారణ చేసినా పూర్తి కాలేదు! పైగా విచారణకు వచ్చిన సీబీఐ అధికారుల మీదే ఎదురు కేసులు పెట్టి ముప్పతిప్పలు పెట్టి అందరికీ చుక్కలు చూపించారు.
ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని వెనకేసుకు వస్తూ మళ్ళీ ఎంపీ సీటు కూడా ఇచ్చారు. ఎందువల్ల? అనే ప్రశ్నకు నేటికీ జవాబు దొరకలేదు.
అప్పటి నుంచి ఈ కేసు విచారణ డైలీ తెలుగు సీరియల్లా సాగిపోతూనే ఉంది. చివరికి వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టు సాయంతో ఈ కేసుని తెలంగాణకు బదిలీ చేయించుకున్నా ముందుకు సాగలేదు.
జగన్ హయంలో సాగలేదు. సరే ఇప్పుడు ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. కనుక ఆయనని కలిసి ఈ కేసు విచారణ వేగవంతం అయ్యేందుకు తోడ్పడాలని సునీతా రెడ్డి అభ్యర్ధించారు. కానీ అయన వల్లా కాలేదు? ఎందుకు? ఈ ప్రశ్నకు కూడా సమాధానం దొరకలేదు.
కనుక సుప్రీంకోర్టు-ట్రయల్ కోర్టు మద్య ఈ కేసు చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేశామని సీబీఐ సుప్రీంకోర్టుకి తెలియజేసింది.
ఈసారి సునీతా రెడ్డి కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. తాను కోరిన అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయకుండా వదిలేసిందని సుప్రీంకోర్టుకి తెలియజేశారు.
దీనిపై స్పందిస్తూ దీని గురించి ట్రయల్ కోర్టు (తెలంగాణ హైకోర్టు)ని ఆశ్రయించాలని సూచించింది. కాస్త ఊరట కలిగించే విషయం ఏమిటంటే, ఈ కేసులో దాఖలైన అన్ని రకాల పిటిషన్లపై నాలుగు వారాలలోగా విచారణ ముగించి తీర్పు చెప్పాలని ఆదేశించింది. అంటే వివేకా హత్య కేసుపై ఏప్రిల్ 15లోగా హైకోర్టులో తుది తీర్పు వెలువడబోతోందన్న మాట!
కానీ ఆ గడువులోగా విచారణ పూర్తి చేసి తుది తీర్పు చెప్పగలదా? అంటే కాదనే పూర్వానుభావాలు చెపుతున్నాయి. హైకోర్టు విచారణ చేపట్టగానే నిందితులలో ఎవరో ఒకరు దానిలో ఏదో ఓ అంశం తీసుకొని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు. ఇలా పదేపదే మద్యలో పిల్ల పిటిషన్లు వేస్తుంటే ఈ కేసు విచారణ పక్కదారి పడుతుంది. గడువు పొడిగిస్తూనే ఉంటారు.
మన న్యాయవ్యవస్థలపై సామాన్య ప్రజలకు నమ్మకం కలగాలంటే ఈ కేసులో దోషులందరికీ శిక్షలు వేయాల్సి ఉంటుంది. ఇది సాధ్యమేనా? డవుటే!
November 20 could witness an interesting box-office battle, with Mammootty and Dulquer Salmaan finding themselves…
Crazy Kalyanam is moving ahead of its theatrical release by arriving earlier than originally planned.…