
YSRCP's Amaravati Policy Under Scrutiny
ఏపీ రాజకీయాలలో పాతుకుపోయిన టీడీపిని ఓడించి వైసీపీని ఒంటి చేత్తో గెలిపించుకున్న ఘనుడు జగన్మోహన్ రెడ్డి. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఆయన కారణంగానే వైసీపీ 2019 ఎన్నికల్లో అంత దారుణంగా ఓడిపోయింది కూడా. అంటే వైసీపీకి బలం, బలహీనత రెండూ ఆయనేనన్న మాట!
రాజకీయ పార్టీల కొన్ని ఆలోచనలు, విధానాలు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగిస్తుంటాయి. ఈ విషయం కొమ్ములు తిరిగిన రాజకీయ పార్టీలకు, వాటి అధినేతలు, నేతలకు తెలియదనుకోలేము.
తమది తప్పుడు విధానమని ఒకవేళ వారు గుర్తించలేకపోయినా, మీడియా, వారి రాజకీయ ప్రత్యర్థులు హెచ్చరికలతో అప్రమత్తం చేసి తప్పు సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించవచ్చు. కానీ దేశంలో చాలా పార్టీలు మొండిగా తప్పుడు విధానాలతో ముందుకు సాగి ఎదురుదెబ్బలు తింటాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ వైఖరి అటువంటిదే.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థే తప్ప శత్రువు కాదు. కానీ ఆయనపై ద్వేషంతో ఆయన చేపట్టే ఏ పనినైనా గుడ్డిగా వ్యతిరేకించడమే పార్టీ విధానంగా మార్చేసుకున్నారు.
అమరావతి మొదలు అన్నా క్యాంటీన్ల వరకు ప్రతిదీ వ్యతిరేకిస్తూ చివరికి తనను, తన పార్టీని నష్టపరుచుకున్నారు. కానీ నేటికీ ఆయన వైఖరిలో మార్పు రాలేదని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. అమరావతి నిర్మాణ ఖర్చులపై చెప్పిన తప్పుడు లెక్కలే ఇందుకు నిదర్శనమన్నారు.
అమరావతిలో 52.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న 5 ఐకానిక్ టవర్లపై కూటమి ప్రభుత్వం చ. అడుగుకు రూ.30,000 ఖర్చు చేస్తోందని జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ఆరోపణలపై వెంటనే స్పందిస్తూ, 5 ఐకానిక్ టవర్ల విస్తీర్ణం 52.20 లక్షల చదరపు అడుగులు కాదు… 71.43 లక్షల చదరపు అడుగులని పేర్కొంది.
విస్తీర్ణం తక్కువగా పేర్కొంటూ వాటిపై భారీగా ఖర్చు చేస్తున్నట్లు జగన్ చేసిన ఆరోపణలు వాస్తవం కాదని తెలిపింది. ఐకానిక్ టవర్ల విస్తీర్ణం 71.43 లక్షల చ. అడుగుల లెక్కన చ. అడుగుకు కేవలం రూ.17,339 మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
కనుక అమరావతి నిర్మాణ పనుల వ్యయంపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఇటువంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
నాడు అమరావతిని వద్దనుకోవడం, అందుకోసం మూడు రాజధానులు, విశాఖ రాజధాని, మావిగన్ అంటూ జగన్ పదేపదే ఆలోచనలు మార్చుకోవడం స్పష్టత లేకపోవడం వల్లనే అని అందరూ భావిస్తుంటారు.
కానీ అసలు కారణం అది కాదు. చంద్రబాబు నాయుడుపై వ్యతిరేకత, ద్వేషంతోనే ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారని చెప్పక తప్పదు.
అయితే జగన్ మాటలు, ఈ వైఖరే వైసీపీ విధానంగా పరిగణించబడుతున్నాయి. కనుక రాజధానితో సహా పలు అంశాలలో ఇటువంటి విధానపరమైన లోపాల కారణంగానే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించారు. ఇది కేవలం విధానపరమైన లోపం మాత్రమే కాదు… ఆ లోపాన్ని అంగీకరించి సరిదిద్దుకోలేని అహంభావం కూడా కనిపిస్తోంది. ఈ తప్పులు సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో కూడా తిరస్కరిస్తారని గ్రహిస్తే వైసీపీకే మంచిది.
అమరావతి శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయంపై ఒక పత్రిక మరియు కొందరు రాజకీయ నేతలు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. చదరపు అడుగుకు ₹29,340 నుండి ₹30,000 వరకు ఖర్చు పెడుతున్నారని చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు.
పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న 5 ఐకానిక్ ప్రభుత్వ టవర్ల వైశాల్యాన్ని కేవలం 52.20 లక్షల చదరపు అడుగులుగా తక్కువ చేసి చూపిస్తూ, నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచి చూపిస్తున్నారు. వాస్తవానికి, ఇందులో 47 అంతస్తులతో నిర్మితమవుతున్న జీఏడీ (GAD) టవర్, ఒక్కొక్కటి 39 అంతస్తుల చొప్పున నిర్మించబడుతున్న 4 హెచ్‌వోడీ (HOD) టవర్లతో పాటు, వాటి ముందు నిర్మించే అత్యంత విశాలమైన ఆర్కిటెక్చరల్ పోడియంలను కలిపితే మొత్తం నిర్మాణ వైశాల్యం 71.43 లక్షల చదరపు అడుగులు (SFT) అవుతుంది. ఈ మొత్తం విస్తీర్ణానికి బడ్జెట్‌ను లెక్కగడితే చదరపు అడుగుకు అయ్యే అసలు ఖర్చు కేవలం ₹17,339 మాత్రమే. అంతేకాకుండా, ఇవి సాధారణ ఇటుక, సిమెంట్ భవనాలు కావు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ‘అంచనాలు పెంచేశారు’ అంటూ ప్రచారం చేస్తున్న పనులు, ఈ భారీ భవనాల నిర్మాణంలో అత్యంత కీలకమైన అంతర్భాగాలు. ఇది ఒక సంపూర్ణమైన ‘టర్న్‌కీ’ (Turnkey) ఒప్పందం. ఇందులో భవనాన్ని మోసే క్లిష్టమైన పునాదులు, డయాగ్రిడ్ సూపర్ స్ట్రక్చర్, అగ్నిమాపక మరియు భద్రతా ప్రమాణాల కోసం వాడే ప్రత్యేక స్ట్రక్చరల్ స్టీల్ మరియు ఫైర్-రేటెడ్ పెయింట్, అధునాతన మెకానికల్-ఎలక్ట్రికల్-ప్లంబింగ్ (MEP) వ్యవస్థలు, లిఫ్టులు, హెచ్‌వీఏసీ (HVAC) మరియు డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, గాలి వేగాన్ని తట్టుకునే హై-పర్ఫార్మెన్స్ గ్లాస్ ఫసాడ్స్, పూర్తిస్థాయి ఇంటీరియర్స్, రోడ్లు మరియు డ్రైనేజీ వంటి అంతర్గత మౌలిక వసతులు అన్నీ కలిసి ఉంటాయి.
జాతీయ, ప్రాంతీయ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పోల్చి చూసినా అమరావతి రేట్లు అత్యంత హేతుబద్ధంగా ఉన్నాయి. కేవలం 4 అంతస్తులతో నిర్మించిన కేంద్ర పార్లమెంట్ భవనానికే చదరపు అడుగుకు ₹16,916 ఖర్చయింది. అలాగే 5 ఏళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపోవడం వల్ల నిర్మాణ సామగ్రి ధరలు (స్టీల్, సిమెంట్, జీఎస్టీ) భారీగా పెరిగాయి. విపరీతమైన గాలి ఒత్తిడిని, ప్రకృతి విపత్తులను తట్టుకోవాల్సిన అవసరం ఉన్న 250 మీటర్ల ఎత్తైన (47 అంతస్తులు, 39 అంతస్తుల) ఐకానిక్ టవర్ల సివిల్ ఇంజనీరింగ్ సంక్లిష్టతను బట్టి చూస్తే చదరపు అడుగుకు ₹17,339 కావడం మార్కెట్ రేట్లకు అనుగుణంగానే ఉంది. కాబట్టి అమరావతి ప్రతిష్టను దెబ్బతీయాలని ఒక పత్రిక, కొందరు నేతలు పనిగట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు.
#FactCheck #Amaravati #AndhraPradesh— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) November 28, 2026
Nithiin starrer Alias Rukmini has generated interest with its songs and trailer. Murali Kanth Devasoth…
Royal Challengers Bengaluru (RCB) have retained most of their core squad for IPL 2027, but…