
వైసీపీ ఆడుతున్న కుల రాజకీయ వలలోకి మెల్లిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జారుకుంటున్నాయి. ఒక అంశాన్ని వివాదంగా మార్చేందుకు అవసరమైన మీడియా, సోషల్ మీడియా, పార్టీ క్యాడర్, కుల రాజకీయాలను పెంచి ప్రోత్సహించే నేతలు, కుల పెద్దలుగా భావించే కుల నాయకులు వంటి అన్ని రకాల ఆయుధాలు వైసీపీ వద్ద పుష్కలంగా ఉన్నాయి.
వాటి సాయంతో వైసీపీ తిరుమల లడ్డు కల్తీ వివాదం నుంచి సాయికృష్ణ మరణం వరకు ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడానికి సర్వ శక్తులు ఒడ్డుతుంది. 2029 ఎన్నికలు వైసీపీ రాజకీయ భవిష్యత్ కి అత్యంత కీలకంగా మారడంతో ఈసారి జగన్ 2.0 కోసం వైసీపీ 2.0 రాజకీయ విధానాలను అవలంభిస్తుంది.
నిన్న మొన్నటి వరకు కోడికత్తి, వివేకా గొడ్డలి వేటు, గులకరాయి రాజకీయాలతో వైసీపీ రాష్ట్రంలో సానుభూతి రాజకీయాలను ప్రోత్సహిస్తే ఇక వాటికి కాలం చెల్లిందని భావించిన వైసీపీ ఇప్పుడు కొత్తగా కుల రాజకీయాలను తెరమీదకు తెచ్చింది.
కూటమి విచ్ఛిన్నానికి కుల రాజకీయాలే బెస్ట్ ఆప్షన్ గా వైసీపీ భావిస్తుంది. అందుకుగాను కూటమికి కాపు ఓటింగ్ ను దూరం చేసేలా, కాపు సామాజికవర్గం పవన్ కళ్యాణ్ ను వ్యతిరేకించేలా వైసీపీ లోని కాపు నేతలందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ మీద పడుతున్నారు.
పవన్ కాపులను వాడుకుని వదిలేశారని, ఆయన కాపు సామాజికవర్గానికి చేసిందేమి లేదని, కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు అదే కాపుల మీద కుట్రలు చేస్తున్నారని ఇలా ఆ సామాజికవర్గాన్ని రెచ్చకొట్టేందుకు వైసీపీ కాపునేతలంతా కాపు ఆత్మీయ సమావేశాలు, సభలు నిర్వహించుకుని తమను తాము కాపు సామాజికవర్గ బ్రాండ్ అంబాసిడర్ లుగా ప్రచారం చేసుకుంటున్నారు.
అయితే కుల రాజకీయాల పట్ల వైసీపీ చూపిస్తున్న ఆసక్తి, వారిలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం కూటమిని ఆత్మరక్షణలో పడేస్తుందా.? కాపు సామాజికవర్గం కూటమి కి దూరం కాలేదు నిరూపించుకునేందుకు, దూరం కాదు అని తెలియచేసేందుకు జనసేనకు తోడు టీడీపీ కూడా కలిసి నడవాలని నిర్ణయించుకుందా.?
అందులో భాగంగానే పవన్ టార్గెట్ గా వైసీపీ కాపు నేతలు చేస్తున్న కుల రాజకీయాలను తిప్పికొట్టేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగరా.? ఇక తనతో పాటుగా తన పార్టీ నేతలు, మంత్రులు, బీజేపీ నేతలు, ఆ పార్టీ మంత్రులు కూడా పవన్ కు మద్దతుగా నిలబడాలని ప్రకటించారా.?
2024 లో వై నాట్ 175 అంటూ వైసీపీ అతివిశ్వాశంతో చేసిన కొన్ని పనులు, తీసుకున్న కొన్ని నిర్ణయాలు (బాబు అరెస్ట్, పవన్ నిర్బంధం) టీడీపీ, జనసేన ను ఒక్కటి చేసింది. బీజేపీ, టీడీపీ, జనసేన బంధానికి మార్గాన్ని చూపింది. ఇక ఇప్పుడు 2029 ఎన్నికల లక్ష్యంగా వైసీపీ లో పెరిగిన ఈ అతి ఆత్మవిశ్వాశం కూటమి బంధాన్ని మరింత బలోపేతం చేసేలా కనిస్తుంది.
వైసీపీ తన పార్టీ గెలుపు కోసం చేస్తున్న మితిమీరిన రాజకీయాలు ఎప్పుడు టీడీపీ, జనసేనల రాజకీయ బంధానికి పునాదులు వేస్తూనే వస్తున్నాయి. మరి ఈసారి వైసీపీ చేస్తున్న ఈ కుల రాజకీయాలు కూడా కాపు, కమ్మను రాజకీయంగా మరింత దగ్గర చేస్తాయా.? కూటమి బలాన్ని మరింత దృఢంగా మారుస్తాయా.?
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…