
ముందే చెప్పుకున్నట్లుగా బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొంటున్న వారికి బిగ్‌బాస్ రోజుకో టాస్క్ ఇచ్చి ప్రేక్షకులను అలరించమని చెప్పినట్టుగానే, వైసీపీ నేతలకు కూడా వారి బిగ్‌బాస్ జగన్ వారానికో టాస్క్ ఇస్తుంటారు. వాటిని పట్టుకొని వారు ఏదేదో మాట్లాడేస్తూ, రోడ్లపై హడావుడి చేసేస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని తిప్పలు పడుతుంటారు.
మెడికల్ కాలేజీలు–కోటి సంతకాల టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసేశారు. కనుక ఇప్పుడు వారికి వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటోందనే టాపిక్‌పై మాట్లాడాలని కొత్త టాస్క్ ఇచ్చినట్లున్నారు. ముందుగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఫీల్డ్‌లోకి దిగారు.
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేలు, నేతలు భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. దాని వల్ల విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటోందన్నారు. ఈ కారణంగా ఏపీలో, విశాఖలో పెట్టుబడులు పెట్టాలంటే అందరూ భయపడుతున్నారని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.
డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా తమ ఎమ్మెల్యేలు ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తున్నారని ఒప్పుకున్నారన్నారు.
కనుక సీఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తమ ఎమ్మెల్యేలను అదుపు చేసి ఏపీ మరియు విశాఖ బ్రాండ్ ఇమేజ్ కాపాడాలన్నారు. అప్పుడే రాష్ట్రానికి, విశాఖకు పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ కంపెనీలు వస్తాయని గుడివాడ అమర్నాథ్ అన్నారు.
గుడివాడ మాట్లాడిన ఈ మాటలు విన్నవారికి ఆయన తమ హయాంలో వైసీపీ నేతల భూకబ్జాలు, అరాచకాల గురించి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.
అటు చిత్తూరులో భూమన, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి మొదలు ఇటు నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాల వరకు వైసీపీ నేతల భూకబ్జాల గురించి నేటికీ జనాలు కథకథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు. ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి.
మూడు రాజధానులంటూ ఏపీని నవ్వులపాలు చేసి తీరని నష్టం కలిగించి, విశాఖ రాజధాని అంటే రుషికొండ ప్యాలస్ అన్నట్లు మాట్లాడుతూ వారు కూడా నవ్వులపాలయ్యారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ, విశాఖ బ్రాండ్ ఇమేజ్ ఎంతగా దెబ్బ తిందో ప్రజలకంటే వైసీపీ నాయకులకే బాగా తెలుసు.
సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి, పట్టుదల, చొరవ వల్ల ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి, విశాఖకు పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి. వాటి వల్ల బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంటే తగ్గిపోతోందంటూ వైసీపీ నేతలు గుడ్డుకి ఈకలు పీకేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూనే మరో పక్క రప్పా రప్ప తలకాయలు నరికేస్తామని, ముఖ్యమంత్రి కాగానే అధికారులు, పారిశ్రామికవేత్తలు అందరినీ జైల్లో వేస్తామని బెదిరిస్తున్నది ఎవరు? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే కదా?
అమరావతి వరద నీటిలో మునిగిపోతుందని, కనుక దాని కోసం రుణాలు ఇవ్వదని ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసిందెవరు? వైసీపీయే కదా?
నేటికీ ఏపీ, విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీయడానికి చేయకూడని పనులన్నీ చేస్తూ మళ్లీ ఇలా మొసలి కన్నీళ్లు కార్చడం వైసీపీ నేతలకే సాధ్యమేమో?
Telugu stars are becoming bigger across India, but something is getting smaller in the process:…
Nani seems ready to move away from the A-certificate zone, but he is not doing…