
అధికార పార్టీ రాజకీయ కక్షతో ప్రతిపక్షపార్టీ నేతలపై కేసులు పెట్టడం, జైళ్ళకు పంపడం మన దేశంలో కొత్తేమీ కాదు. కానీ ప్రతీ కేసుని రాజకీయ కక్షతో ట్యాగ్ చేయడం కూడా సరికాదు.
పాలలో నుంచి మీగడ, వెన్న తీసి వాడుకున్నట్లుగా ఒకవేళ అవినీతికి పాల్పడినందుకో లేదా మరో కారణం చేతో ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం కేసులు పెట్టినా, వాటిని సానుభూతి ఓట్లుగా ఎలా మలుచుకోవాలో మన రాజకీయ నాయకులకు బాగా తెలుసు.
కనుక ఈ కేసులు, నోటీసులు, అరెస్టులు అన్నీ తమ రాజకీయ ఎదుగుదలకు గుర్తింపుగా లభించిన మెడల్స్ వంటివే అని భావిస్తున్నారు. అందువల్లే ఇప్పుడు ఎవరూ పోలీసులకు, కేసులకు, జైలుకి వెళ్ళడానికి భయపడటం లేదు.
కానీ మద్యలో ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ అధికారులు నలిగిపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు మంచివైనా, చెడ్డవైనా అధికారులు వాటిని అమలు చేయక తప్పదు.
వైసీపీ హయంలో తప్పుడు నిర్ణయాలే ఎక్కువగా అమలయ్యాయి. ఉదాహరణకు రైతుల భూములలో జగన్ బొమ్మలతో సర్వే రాళ్ళు, తిరుమల పరకామణిలో దొంగతనాలలో నిందితులతో రాజీ చేసుకోవడం, ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం, ప్రభుత్వ పాఠాశాలలపై ప్రయోగాలు, రాజధాని భూములను సెంటు భూములుగా ప్లాట్లు వేసి పంచిపెట్టేయడం, రుషికొండ ప్యాలస్ నిర్మాణం… ఇలా ఒకటా రెండా కోకోల్లలున్నాయి.
ఇవన్నీ జగన్ సొంత నిర్ణయాలే. కానీ పిల్లి మెడలో గంట ఎవరు కడ్తారన్నట్లు, ఎవరూ ఆయనకు నచ్చజెప్పలేక, ఆయన మాటని కాదనలేక పాటించేవారు.
ఇలాగే తిరుమల ఈవో అనిల్ కుమార్ సింఘాల్, మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీలు జగన్ చెప్పినట్లుగా పనిచేశారు.
నిబందనలు ఉల్లంఘిస్తే భవిష్యత్‌లో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని వారికి తెలుసు. కానీ ఉల్లంఘించకపోతే జగన్ కక్ష, వేధింపులను తట్టుకోలేరు. కనుక అన్నీ ఉల్లంఘించి సంతకాలు పెట్టేశారు.
ఊహించినట్లే కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇప్పుడు వారు ముగ్గురూ చిక్కుకున్నారు. ఈ కేసు విచారణ జరిపిన సిట్, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ లేఖ వ్రాసింది. కనుక వారిపై వేటు తప్పదు.
నాడు అక్రమాస్తుల కేసులో పారిశ్రామికవేత్తలు, మంత్రులు మొదలు వివేకా హత్య కేసు, మద్యం కుంభకోణం, కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, పరకామణి దొంగతనం వరకు వైసీపీ పడగ నీడ పడిన ప్రతీ అధికారి, నాయకుడు చివరికి ఇలా కేసులలో చిక్కుకొని జైలు పాలవుతూనే ఉన్నారు.
జగన్ కళ్ళలో ఆనందం చూడటం కోసం రప్పా రప్పా అంటూ రెచ్చిపోతున్న వైసీపీ కార్యకర్తలకు ఇదే గతి పడుతోంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు పాము తన పిల్లలను, గుడ్లను తనే తినేస్తున్నట్లే అనిపిస్తుంది.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…