
ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. మిథున్ రెడ్డి అరెస్టుపై వైసీపీ నేతల వాదనలు ఊహించినట్లే ఉన్నాయి.
పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై కక్షతోనే మిథున్ రెడ్డిని ఈ కేసులో ఇరికించారు. మాపై ఎన్ని కేసులు పెట్టినప్పటికీ, ఎంత మందిని జైలుకి పంపినప్పటికీ మేమెవరం భయపడబోము.
ఈ సిట్టూ బట్టూ మాపై కేసులు పెట్టి జైల్లో పెట్టగలవు తప్ప మమ్మల్ని మరేమీ చేయలేవు. మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. కనుక ఈ అక్రమ అరెస్టులపై న్యాయపోరాటాలు చేస్తాము. అందరూ కడిగిన ఆణిముత్యాల్లా జైలు నుంచి బయటకు వస్తారు.
కానీ సిఎం చంద్రబాబు నాయుడుకి ఒకటే చెపుతున్నాను. ఇప్పుడు మీరు ఏ విత్తనం వేస్తారో రేపు అదే మొక్క మొలుస్తుంది… అదే చెట్టవుతుంది… అవే ఫలాలు లభిస్తాయని మరిచిపోవద్దు,” అని హెచ్చరించారు.
శివ ప్రసాద్ రెడ్డి చెప్పినట్లుగానే ఆనాడు జగన్ వేసిన విత్తనాలకు అవే మొక్కలు మొలిచాయి… అవే ఫలాలు వస్తున్నాయి కదా?
కానీ ఆయన చెప్పినట్లుగా ఇకపై ఏపీలో భవిష్యత్ రాజకీయాలు ఈవిదంగానే సాగుతాయని స్పష్టమవుతోంది. చంద్రబాబు నాయుడు 2014-19లో వైసీపీ దాని అధినేత జగన్ జోలికి పోలేదు. అయినా జగన్ సిఎం కాగానే ప్రతీకార రాజకీయాలు మొదలుపెట్టారు.
ఇప్పుడు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి జైళ్ళకు పంపిస్తున్నారు. కనుక మేము అధికారంలోకి వస్తే ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామని వైసీపీ అధినేత జగన్ మొదలు సామాన్య కార్యకర్త వరకు ప్రతీ ఒక్కరూ హెచ్చరిస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని, పోలీస్ అధికారులను బెదిరిస్తున్నారు. కనుక కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చేలా చేసుకోవడం టీడీపికి ఇప్పుడు మరింత తప్పనిసరిగా మారింది.
వైసీపీ మళ్ళీ ఎన్నడూ ఏపీలో అధికారంలోకి రాదని సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చెపుతున్నప్పటికీ, వైసీపీ నేతల బెదిరింపులతో టీడీపి నేతలు, కార్యకర్తలు, పోలీస్ అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలకు వైసీపీ నేతల బెదిరింపులు విని ఆందోళనతో వెనక్కు తగ్గితే రాష్ట్రం చాలా నష్టపోయే ప్రమాదం ఉంది.
జగన్ మళ్ళీ వస్తే ఎలా ఉండబోతోందో గట్టిగానే చెపుతున్నారు కనుక అమరావతిలో మరో ౩౦ వేల ఎకరాల భూసేకరణకు రైతులు అంగీకరించకపోవచ్చు.
‘జగన్ ఎన్నటికీ మళ్ళీ అధికారంలోకి రాలేరనే’ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట కంటే “మళ్ళీ మేము వస్తాము… ప్రతీకారం తీర్చుకుంటామని” వైసీపీ నేతలు చెపుతున్న మాటలే గట్టిగా వినబడుతున్నాయిప్పుడు.
ఇవి అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. కనుక వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి కొనసాగేందుకు కూటమి ప్రభుత్వం ఏం చేయాలో ఇప్పటి నుంచే కాస్త గట్టిగానే ఆలోచించాలి. లేకుంటే ఏమవుతుందో వైసీపీ నేతలు చెపుతూనే ఉన్నారుగా!
Former chief minister YS Jagan addressed the media again today. A significant part of his…
BOTTOM LINE Substandard Sitcom, Hardly Watchable PLATFORM Netflix RUNTIME 3 Hours(8 Episodes) What Is the…