
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. కానీ వైసీపీ నేతలు తమ కళ్ళను తమ వేళ్ళతోనే పొడుచుకుంటున్నప్పుడు రెడ్ బుక్ బయటకు తీయాల్సిన అవసరమే లేదని ఇటీవల మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఇందుకు ఉదాహరణగా మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై నమోదైన కేసు గురించి చెప్పారు. ఆయన పెద్ద కోడలు జోగి మేఘన తన భర్త, అత్తమామలతో సహా ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఇప్పుడు జోగి రమేష్ కుటుంబం కోర్టు చుట్టూ తిరగడం చూస్తున్నప్పుడు నారా లోకేష్ చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది.
జోగి మేఘన పిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి కుటుంబంపై గృహ హింస, హత్యాయత్నం, వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, సోదరి రమతో సహా మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చారు. ఇది చాలా తీవ్రమైన నేరంగా పరిగణింపబడుతుంది. ఈ కేసులో వారిని పోలీసు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కనుక జోగి రమేష్, కుటుంబ సభ్యులు విజయవాడ మహిళా కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేసి తమని అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్ధించారు.
వారి పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇబ్రహీంపట్నం పోలీసులను కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. వారి కౌంటర్ ఏవిధంగా ఉంటుందో, ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించవచ్చు.
ఇదేవిధంగా భూకబ్జాలు, బెదిరింపులతో ఇతరుల ఇళ్ళు కబ్జా చేసిన కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, అజ్ఞాతంలోకి వెళ్ళి హైకోర్టుని ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోవడంతో నేడు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరవక తప్పలేదు.
ఏపీ మద్యం రానా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కానీ అయన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఓ రోడ్డు ప్రమాదం కేసులో నుంచి కొడుకుని తప్పించేందుకు మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు ప్రస్తుతం రిమాండ్ మీద జైల్లో ఉన్నారు.
ఈవిధంగా వైసీపీలో మాజీ మంత్రులు, సీనియర్ నేతలు వారంతట వారే కేసులలో చిక్కుకొని, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు రెడ్ బుక్ అవసరం ఏమిటి?
India beat Afghanistan by 7 wickets in the second T20I in Delhi to take an…
With Rohith and Trigun emerging as the potential gamers in the Bigg Boss reality show,…