
ఢిల్లీ పెద్దలని కలిసి వచ్చిన తర్వాత కేసుల విషయంలో జగన్ ప్రభుత్వం వెనక్కు తగ్గడమో లేదా ఇంకా దూకుడు పెంచడమో చేస్తుందని అందరూ ఊహించారు. కానీ జగన్ నోట ఈ కొత్త పల్లవిని ఎవరూ ఊహించి ఉండరు
చంద్రబాబు నాయుడుపై జగన్ ఎంత కక్షతో రగిలిపోతున్నారో నాలుగున్నరేళ్ళుగా అందరూ చూస్తూనే ఉన్నారు. వింటూనే ఉన్నారు. కనుక ఉందా లేదా అని కాదు… ఎంత ఉంది?అని ప్రశ్నించుకొంటే ‘చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించి 33 రోజులుగా రాజమండ్రి జైల్లో బందించి ఆయనకు బెయిల్ దొరక్కుండా చేసే అంత’ అని చెప్పుకోవలసి ఉంటుంది.
అయితే జగన్తో సహా వైసీపి నేతలందరూ “చంద్రబాబు నాయుడుపై మాకు ద్వేషం లేదు… రాజకీయకక్ష లేదు,” అంటూ కొత్త పల్లవి ఎందుకు అందుకొన్నారనేదే ప్రశ్న. ఎందుకంటే రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసని వైసీపి నేతలకు కూడా తెలుసు కనుక.
రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాల్సిన జగన్ ప్రభుత్వం, రాష్ట్రాభివృద్ధి కోసం పరితపించే చంద్రబాబు నాయుడుపై కక్ష సాధింపుకే ప్రాధాన్యం ఇస్తూ జైలుకి పంపించిందని రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు కనుక.
చంద్రబాబు నాయుడుని జైల్లో వేయడమే కాకుండా, ఢిల్లీలో చక్రం తిప్పి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఆయనకు బెయిల్పై దొరకాకుండా చేసి, బయటకు రాకుండా చేస్తున్నారని సామాన్య ప్రజలు సైతం అనుమానిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడుపై ఏర్పడుతున్న ఈ సానుభూతి ఓట్ల రూపంలో మారితే టిడిపి ఎన్నికలలో ఘనవిజయం సాధించడం ఖాయం. అందుకే జగన్, విజయసాయి రెడ్డిలతో సహా ఈ కొత్త పల్లవితో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.
పైగా వైసీపి నేతలు తమ వాదనలకు కోర్టులను కూడా జవాబుదారీ చేసేందుకు ప్రయత్నిస్తుండటం మరో విశేషం. విజయసాయి రెడ్డి తాజా ట్వీట్ చూస్తే ఈ విషయం అర్దమవుతుంది.
“చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులన్నీ రాజకీయకక్షతోనే నమోదు చేసిన్నట్లయితే మరి న్యాయస్థానాలలో ఆయనకు బెయిల్పై ఎందుకు లభించడం లేదు? కోర్టులు ఆయన పిటిషన్లను ఎందుకు అంగీకరించడం లేదు? చంద్రబాబు నాయుడుకి బెయిల్పై లభించడం లేదు కనుక న్యాయవ్యవస్థలు నిష్పక్షపాతంగా పనిచేయడం లేదని టిడిపి ఆరోపిస్తోందా?ఎవరైతే తప్పులు చేస్తుంటారో వారు ఇటువంటి ఆవేదనలు తప్పవు,” అని ట్వీట్ చేశారు.
వివేకా హత్య కేసులో చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఆవినాష్ రెడ్డి తదితరులను ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని వైసీపి నేతలు పదేపదే ఆరోపించడం అందరూ వినే ఉంటారు. కానీ అవినాష్ రెడ్డి మీద సీబీఐ ఈగలు వాలకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జగన్ ఎలా కాపాడుకొస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. అప్పుడు తాము వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నామని వారనుకోలేదు. ఇప్పుడూ అనుకోవడం లేదు. ఇదెలా ఉందంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదనుకొన్నట్లుగా ఉంది.
అందుకే చంద్రబాబు నాయుడుకి ఎందుకు బెయిల్ రావడం లేదు?అని అతితెలివిగా ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం ప్రజలందరికీ తెలుసు.
జగన్ వ్యక్తిగత, రాజకీయ కక్షల కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, రాష్ట్ర ప్రయోజనాలను కూడా పణంగా పెడుతూ, ‘ఇది కక్ష కాదు బ్రో… జస్ట్ అవినీతే,’ అని నమ్మబలికేందుకు వైసీపి నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఏవి పాలో ఏవి నీళ్ళో తెలుసుకోలేనంత అమాయకులేమీ కారు ఏపీ ప్రజలు. అమాయకులే అయితే రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయగలిగే వారు కదా?అప్పుడు కాంగ్రెస్కు బుద్ధి చెప్పిన ప్రజలు ఇప్పుడు వైసీపికి బుద్ధి చెప్పలేరా? చెప్పకుండా ఉంటారా?అని జగన్కు కోరస్ పాడుతున్న వైసీపి నేతలే బాగా ఆలోచించుకోవాలి.
Ranabaali Review: History Without Heart A film rooted in heart-wrenching stories is let down by…
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…